NTV Telugu Site icon

The Warriorr Movie Review : ది వారియర్ రివ్యూ

The Warrior Review

The Warrior Review

‘ఇస్మార్ట్ శంకర్’తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన రామ్ ఆ తర్వాత తమిళ రీమేక్ ‘రెడ్’ చేసి, ఫర్వాలేదనిపించుకున్నాడు. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో లింగుస్వామి డైరెక్షన్ లో ‘ది వారియర్’ మూవీలో నటించాడు. విశేషం ఏమంటే… అప్పుడెప్పుడో అల్లు అర్జున్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడనుకున్న లింగుస్వామి ఇప్పుడు రామ్ సినిమాతో అడుగుపెట్టాడు. ‘ఉప్పెన’ భామ కృతీశెట్టి హీరోయిన్ గా నటించిన ‘ది వారియర్’ మూవీని శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు.

ఎంబీబీయస్ పూర్తి చేసి, హైదరాబాద్ నుండి హౌస్ సర్జన్ చేయడానికి తల్లి (నదియా)తో కలిసి కర్నూలు వెళతాడు సత్య (రామ్ పోతినేని). అప్పటికే అక్కడ పెద్ద రౌడీగా పేరు తెచ్చుకున్న గురు (ఆది పినిశెట్టి) కర్నూలును గడగడలాడిస్తుంటాడు. ఓ హత్య కేసులో గురుని ఢీకొట్టిన డాక్టర్ సత్యకు పరాభవం ఎదురవుతుంది. గురు ఆగడాలను డాక్టర్ గా అరికట్టలేనని భావించిన సత్య… ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? పొలిటికల్ లీడర్ కావాలనుకున్న గురుకు ఎలా బుద్థి చెప్పాడు? అనేది మిగతా కథ.

రౌడీ డాక్టర్లను మనం కొన్ని సినిమాలలో ఇప్పటికే చూశాం. అలానే రౌడీ పోలీసులనూ చూశాం. కానీ చిత్రంగా దర్శకుడు లింగుస్వామి బుర్రలోకి ఈ డాక్టర్ పోలీస్ వచ్చి చేరాడు. ప్రథమార్ధంలో డాక్టర్ గా ప్రజల ప్రాణాలను కాపాడటమే పరమావధిగా భావించే ఓ యువకుడు, రౌడీని ఎదుర్కోవడంలో అశక్తుడై, పోలీస్ గా మారి అతన్ని అంతం చేయడమనేది ఆసక్తికరమైన అంశమే! బహుశా హీరో రామ్ ఈ పాయింట్ తోనే కనెక్ట్ అయి ఉంటాడు!! కానీ తెర మీద లింగుస్వామి మ్యాజిక్ అంతగా ప్రతిఫలించలేదు. డాక్టర్ కమ్ పోలీస్ గా రామ్ పాత్రను మలిచిన తీరు బాగానే ఉంది కానీ సన్నివేశాలు మరీ రొటీన్ గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా గురు పాత్రను ఎలివేట్ చేయడానికే ఉపయోగించిన దర్శకుడు, సెకండ్ హాఫ్ లో అతనికి పోలీస్ సత్య ఎలా చెక్ పెట్టాడనేది ఆసక్తికరంగా చూపించలేక పోయాడు. పైగా పాత్రలు, వాటి తీరు తెన్నుల మీద కూడా దర్శకుడు పెద్దంత శ్రద్ధ పెట్టలేదనేది తెలిసిపోతుంది. హీరో తన తల్లితో కర్నూలు రాగానే అతనికి కావాలిన వాటిని కొని ఇవ్వమని హీరోయిన్ కు ఫోన్ లో చెప్పిన పాత్ర విషయంలో క్లారిటీ లేదు. అలానే హీరోయిన్ తండ్రి పోసాని పాత్రనూ కామెడీ కోసం వాడుకుని తప్పించేశారు, ఆ తర్వాత ఏ సందర్భంలోనూ ఆ పాత్ర తెర మీదకు రాలేదు. ఇక గురు భార్య పాత్రను ఏదో చివరిలో హైలైట్ చేయాలని దర్శకుడు చూశాడు కానీ ఆ సన్నివేశాలేవీ పెద్దంతగా పండలేదు. మొత్తం మీద కాగితం మీద రాసుకున్న కథను ఎఫెక్టివ్ గా తెర మీద చూపించడంలో లింగుస్వామి విఫలమయ్యాడు. ‘సింహా’లో బాలకృష్ణను ఫెరోషియస్ డాక్టర్ గానూ, ‘సింగం’ సీరిస్ లో సూర్యను టఫ్ పోలీస్ గానూ చూసిన తర్వాత ఆ క్యారెక్టర్స్ ను టచ్ చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాటి తరహాలో కథ, కథనాలు ఉంటే ప్రేక్షకులు పెదవి విరుస్తారు తప్పితే, ఎగ్జియిట్ మెంట్ ఫీల్ కారు. ‘ది వారియర్’ విషయంలో అదే జరిగింది.

నటీనటుల విషయానికి వస్తే… రామ్ డాక్టర్ కమ్ పోలీస్ గా బాగానే నటించాడు. పోరాట సన్నివేశాలు, పాటల్లో నూరు శాతం ఎఫెర్ట్ పెట్టాడు. కృతిశెట్టి విజిల్ మహాలక్ష్మి పాత్రలో చలాకీగా కనిపించింది. నదియా ఈ తరహా పాత్రలు గతంలోనూ చేసింది. సో… కొత్తగా ఏమీ అనిపించలేదు. గురుగా ఆది పినిశెట్టి క్రూరత్వాన్ని బాగానే ప్రదర్శించాడు. మిగిలిన పాత్రలను జయప్రకాశ్, బ్రహ్మాజీ, లాల్, నాగ మహేశ్, సమ్మెట గాంధీ, దివ్య స్పందన, శరణ్య ప్రదీప్, అక్షరా గౌడ్, రెడిన్ కింగ్స్లే, రామచంద్రన్ దొరై రాజు పోషించారు. సినిమా ప్రారంభంలో వచ్చిన హోలీ సాంగ్ కలర్ ఫుల్ గా ఉంది. దేవి ప్రసాద్ ఇచ్చిన ట్యూన్స్ లో బాగా పాపులర్ అయిన రెండు పాటలూ (బుల్లెట్ అండ్ విజిల్ సాంగ్స్) ఆకట్టుకున్నాయి. అదే సమయంలో డాక్టర్ల గొప్పతనం తెలియచేస్తూ వచ్చే నేపథ్య గీతం కూడా బాగుంది. దేవిశ్రీ ఇచ్చిన ట్యూన్స్, రీ-రికార్డింగ్ బాగున్నాయి. అలానే సుజిత్ వాస్ దేవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సెకండ్ హాఫ్ లో విలన్ కు హీరో బుద్ధిచెప్పే సన్నివేశాలను మరింత ఆసక్తి కరంగా తీసి ఉంటే… ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేది. ఓవర్ ఆల్ గా వన్ టైమ్ వాచ్ గా ‘ది వారియర్’ను భావించొచ్చు!

 

ప్లస్ పాయింట్స్
రామ్, ఆది నటన
దేవిశ్రీ మ్యూజిక్

ప్రొడక్షన్ వాల్యూస్
మైనెస్ పాయింట్స్
నిరాశ పరిచిన ద్వితీయార్ధం
ఆకట్టుకోని క్లైమాక్స్

ట్యాగ్ లైన్: డాక్టర్ పోలీస్!