NTV Telugu Site icon

Thangalaan Movie Review Telugu: తంగలాన్ మూవీ రివ్యూ

Thangalaan

Thangalaan

చియాన్ విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”. ఈ సినిమాను దర్శకుడు పా రంజిత్ డైరెక్ట్ చేయగా నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా భారీ సాంకేతిక విలువలతో నిర్మించారు. “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. “తంగలాన్” సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కాగా సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం

తంగలాన్ కథ: తంగలాన్ 18వ శతాబ్దానికి చెందిన కథగా మొదలవుతుంది. అప్పుడప్పుడే బ్రిటిష్ వాళ్ళు ఇండియా మీద ఆధిపత్యం సంపాదించుకుంటున్న సమయంలో చిత్తూరు తాలూకాకి చెందిన ఒక కుగ్రామంలో తంగలాన్(విక్రమ్) తన భార్య (పార్వతి), పిల్లలతో కలిసి నివసిస్తూ ఉంటాడు. తమ తాతల కాలంలో ఒక బంగారు గని గురించి విన్న కథల కారణంగా తంగలాన్ ఎప్పుడూ ఏదో లోకంలో ఉన్నట్టు అనిపిస్తాడు. ఊరిలో నివసించేందుకు అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో బంగారు మైన్స్ నుంచి బంగారం తీయాలి అంటూ ఒక బ్రిటీషర్ ప్రభుత్వ ఉత్తర్వులతో తంగలాన్ గ్రామానికి వస్తాడు. అయితే పూర్వీకుల నుంచి వింటూ వస్తున్న కథల కారణంగా ఆ నిధికి విశేషాలు కాపలా ఉన్నాయని భయపడి పూరి వాళ్ళు ఎక్కువమంది వెళ్లడానికి సాహసించరు. కానీ తంగలాన్ మరికొద్దిమంది మాత్రం బ్రిటీషర్ వెనక వెళతారు. అలా వెళ్లిన తంగలాన్ కి నిధి దొరికిందా? ఇచ్చిన మాట ప్రకారం బ్రిటిషర్లు తంగలాన్ అండ్ కోకి బంగారంలో వాటా ఇచ్చారా? బంగారం గనికి నిజంగానే పిశాచాలు కాపలా కాస్తున్నాయా? అసలు తంగలాన్ కు కనిపించే ఆర్తి ( మాళవిక మోహనన్) ఎవరు? తంగలాన్ మాట మీద ఊరు వదిలి వచ్చిన వాళ్ళు ఏమయ్యారు? చివరికి బంగారం దొరికిందా? లేదా? అనేది తెలియాలి అంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ: పా రంజిత్ చేసే సినిమాలు చూసేవాళ్ళకి అతను ఎలాంటి కంటెంట్ ఇస్తాడు అనే విషయం మీద కొంత అవగాహన ఉంటుంది. తక్కువ జాతి సమస్యలను ప్రధాన ఇతివృత్తాలుగా చేసుకుని పా రంజిత్ సినిమాలు తెరకెక్కిస్తూ ఉంటాడు. దాదాపుగా ఇది కూడా ఒకరకంగా అలాంటి కథే కానీ స్వాతంత్రానికి పూర్వం కోలార్ గోల్డ్ మైన్స్ ఇతివృత్తంగా ఎంచుకున్నాడు. కలగా చెప్పుకుంటే చాలా చిన్న లైన్ అనిపిస్తుంది కానీ ఇలాంటి ఒక కథను ఆలోచించి రాసుకుని దాన్ని తెరమీదకు తీసుకురావడం అనే ఆలోచన మొదటి సక్సెస్ అనిపిస్తుంది. ఈ రోజుల్లో పీరియడ్ సినిమాలు ఎక్కువయ్యాయి కానీ ఈ సినిమా చేయడం ఒక రకంగా కత్తి మీద సాము లాంటి వ్యవహారం. ఏమాత్రం తేడాపడినా ఇప్పటి వరకు ఉన్న ఇమేజ్ మాయం కావడమే కాక ఈ సోషల్ మీడియా యుగంలో ఎన్నో ట్రోల్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అత్యాశ మనిషి ఆయుషుకే చేటు అనే మెయిన్ లైన్ తో ఈ సినిమా తెరకెక్కించినట్లు అనిపించింది. నిజానికి ఇలాంటి ఒక కథను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చేందుకు ఎంత హోమ్ వర్క్ చేసి ఉంటేనో తప్ప ఇలాంటి అవుట్ ఫుట్ తీసుకురావడం దాదాపు అసాధ్యం. కథగా చెప్పుకోవడం చాలా సులభమే కానీ ఆ కథను అనుకున్నది అనుకున్నట్టుగా తీసుకురావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే చాలా సన్నివేశాలు సున్నిత మనస్కులకు ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. సినిమాకి ప్రధానమైన ఆ సెట్ ఆర్ట్ వర్క్ కాగా ఆ తర్వాత విక్రమ్ నటన. పా రంజిత్ మేకింగ్ విక్రమ్ యాక్టింగ్ కోసం ఈ సినిమాని కచ్చితంగా చూసేయొచ్చు అనిపించేలా ఉంటుంది.

నటీనటుల విషయానికి వొస్తే విక్రమ్ తప్ప ఈ పాత్రలో ఎవరూ నటించ లేరు అన్నట్టుగా జీవించాడు. ఆయన భార్య పాత్రలో పార్వతి సహా మిగతా ప్రధాన పాత్రలో నటించిన వారందరూ తెలుగు వాళ్లకు కొత్తవాళ్లే. అయినా సరే ఎవరూ ఎక్కడా తగ్గనట్టుగా నటించారు. ఎవరికివారు నటనలో పోటీపడి మరీ రెచ్చిపోయారు. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే జీవి ప్రకాష్ కుమార్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి అదనపు ఆకర్షణ. ఇక సినిమాటోగ్రాఫర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి ఫ్రేమ్స్ ఆయన మాత్రమే పెట్టగలడు అనిపించేలా చాలా ఫ్రేమ్స్ అనిపించాయి. ఇక లొకేషన్స్ ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నారో తెలియదు కానీ అత్యద్భుతంగా ఉన్నాయి. నిజంగానే స్వాతంత్రానికి ముందు జరిగిన కథకు కావాల్సిన సెటప్ అంతా ఆర్ట్ డిపార్ట్మెంట్ చూసుకుంది. కాస్ట్యూమ్స్ విషయంలో ఎంత కేర్ తీసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి.

ఫైనల్లీ తంగలాన్ సినిమా ఒక మస్ట్ వాచ్ పీరియాడిక్ డ్రామా.. కానీ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు

Show comments