NTV Telugu Site icon

S5 No Exit Movie Review: ఎస్ 5

S5

S5

S5 Movie Review: నందమూరి తారకరత్న నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘సారధి’ ఆ మధ్య రిలీజైంది. తాజాగా అతను నటించిన హారర్ థ్రిల్లర్ ‘ఎస్ 5’ శుక్రవారం విడుదలైంది. ప్రిన్స్, సునీల్, అలీ, సాయికుమార్ తదితరులు కీ రోల్స్ ప్లే చేసిన ‘ఎస్ 5’తో డాన్స్ మాస్టర్ సన్నీ అలియాస్ భరత్ కోమలపాటి మెగాఫోన్ పట్టాడు. పేరుకు తగ్గట్టుగా రైల్వే బోగీలో జరిగే ఈ మూవీ కథా కమామీషు ఏమిటో తెలుసుకుందాం.

సాయికుమార్ సీఎంగా అధికారం చెలాయిస్తూ ఉంటాడు. రాబోయే ఎన్నికల్లో గెలిచి, మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తుంటాడు. తండ్రి అంటే ప్రాణం పెట్టే కొడుకు తారకరత్న. అతన్ని పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోమంటూ ట్రైన్ లో విశాఖ పట్నంకు పంపిస్తాడు సాయికుమార్. స్నేహితులు, అనుచరులతో కలిసి బయలు దేరిన తారకరత్న కోసం స్పెషల్ బోగీని ఏర్పాటు చేస్తాడు. ఆ బోగీలోకి అనుకోకుండా ప్రిన్స్ కు సంబంధించిన మ్యూజిక్ ట్రూప్ కూడా ఎక్కేస్తుంది. తమ బోగీలో ఎందుకు ఎక్కారంటూ తారకరత్న బృందం ప్రిన్స్ టీమ్ తో గొడవకు దిగుతుంది. మధ్యలో ట్రైన్ ఆగినప్పుడు దిగేద్దామని వాళ్ళు అనుకున్నా, డోర్స్ ఓపెన్ కావు. అంతేకాదు.. అందులో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరూ మాయమౌతుంటారు. ఊహకందని శక్తి ఏదో ఆ బోగీని కంట్రోల్ చేస్తుంటుంది. ఈ జర్నీ మధ్య టీసీ అలీ, యూ ట్యూబర్ సునీల్ వంటి వాళ్ళు బోగీలోకి అడుగుపెడతారు. బట్.. అక్కడి పరిస్థితులకు బయపడి దిగాలనుకున్నా దిగలేరు. చివరకు వాళ్ళూ మిగిలిన వాళ్ళలానే మాయమైపోతారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో రైల్లో బోగీకి మంటలు అంటుకుంటాయి. ఈ ప్రమాదం నుండి తారకరత్న, ప్రిన్స్ ఎలా బయట పడ్డారు? రన్నింగ్ ట్రైన్ బర్నింగ్ ట్రైన్ గా ఎందుకు మారింది? ఈ మిస్టీరియస్ జర్నీకి మూలకారణం ఏమిటీ? అనేది మిగతా కథ.

దర్శకుడు భరత్ కోమలపాటి ఎలాంటి నాన్చుడు ధోరణీ లేకుండా టైటిల్స్ పూర్తి కాగానే డైరెక్ట్ గా కథలోకి తీసుకెళ్ళిపోతాడు. తండ్రి అంటే ప్రాణం పెట్టే కొడుకు, అతనికి ఏది కావాలంటే అది సమకూర్చే తండ్రి.. అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయగలమనే వారి అహంకారం.. ఇవే ఈ కథకు మూలం. అయితే అధికార దాహం ఒంటబడితే.. ఎలాంటి క్రూరమైన నిర్ణయాలైనా తీసుకుంటారనే నగ్న సత్యాన్ని దర్శకుడు ఈ మూవీ ద్వారా చెప్పాలనుకున్నాడు. దానికి తగ్గట్గుగా కథను అల్లాడు. ఈ చిన్నపాయింట్ ను స్ట్రయిట్ గా చెప్పేస్తే మజా ఉండదని రైలు ప్రయాణం, స్పెషల్ బోగీ, అందులో కాస్తంత మసాలా అంశాలు, థ్రిల్లింగ్ సీన్స్ మిక్స్ చేసి వండి వార్చాడు. సినిమా ప్రారంభమైతే బాగానే జరిగింది కానీ ఆ తర్వాతే అది ఎటు వెళుతోందో అర్థం కాదు. లాజిక్ లేని సీన్స్, తిక్క పుట్టించే చేష్టలు, అర్థం పర్థం లేని వాదోపవాదాలు వీటితో బుర్ర హీటెక్కిపోతుంది. ప్రథమార్థంను ఎలాగో భరించినా, ద్వితీయార్థంలో ట్విస్టులు చూస్తే మతిపోతుంది. ఈ సినిమాకు కథానుగుణంగా సీజీవర్క్ తో చేయాల్సిన సీన్స్ చాలానే ఉన్నాయి. కానీ వాటిని చీప్ గా చుట్టేశారు.

నటీనటుల విషయానికి వస్తే.. తారకరత్న గెటప్పే ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. దానికి తోడు ఓ ఊతపదం ఒకటి! ప్రిన్స్, అతనితో ఉండే అమ్మాయిలు, వారితో ఫిష్ వెంకట్ అండ్ టీమ్ చేసే వెకిలిచేష్టలు.. ఇది చాలదన్నట్టు ముసలి మొగుడు – పడుచు పెళ్ళాం కామెడీ పరాకాష్ట! పొలిటీషియన్ గా సాయికుమార్ కాస్తంత హుందాగానే నటించారు. అలీ ఎంట్రీ బాగానే ఉన్నా.. ఐదు నిమిషాలు గడిచే సరికీ బోర్ కొట్టేస్తుంది. పైగా తన ముందు ఉన్న వాళ్ళంతా బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్ అనే థాట్ తో అతని ప్రవర్తించడం చికాకు తెప్పిస్తుంది. దీనికి తోడు యూ ట్యూబర్ గా సునీల్ ఎంట్రీ ఒకటి. ఆ అతి భరించడం కష్టమే. దర్శకుడు కట్ చెప్పడం మర్చిపోవడంతో ఎవరికి తోచినట్టు వాళ్ళను నటించారనే సందేహం కలుగుతుంది. ఇతర ప్రధాన పాత్రల్లో మెహబూబ్ దిల్ సే, సురేష్ వర్మ, రఘు, రితుజా సావంత్, అవంతిక హరి తదితరులు కనిపిస్తారు. దర్శకుడు సన్నీ చెప్పింది మంచి పాయింట్ అని నిర్మాతలకు అనిపించి ఉండొచ్చు. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో దారుణంగా విఫలమయ్యారు. సినిమా చూసిన తర్వాత మణిశర్మ, ‘గరుడవేగ’ అంజి, గ్యారీ బీహెచ్, రియల్ సతీశ్ వంటి టాప్ టెక్నీషియన్స్ పేర్లను వాడుకున్నారు కానీ వాళ్ళతో పని చేయించుకోలేదేమోననే డౌట్ వస్తుంది. ‘నో ఎగ్జిట్’ అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్! సో… థియేటర్ లోకి వెళితే మాత్రం మనశ్శాంతితో ఎగ్జిట్ కావడం చాలా కష్టం!

రేటింగ్: 1.5 / 5

ప్లస్ పాయింట్
ఎంచుకున్న పాయింట్
ప్రముఖులు కీ రోల్స్ చేయడం

మైనెస్ పాయింట్స్
ఇరిటేషన్ తెప్పించే గెటప్స్
పసలేని కామెడీ సీన్స్
ఆకట్టుకోని సీజీ వర్క్

ట్యాగ్ లైన్: బోగీ ఎక్కితే అంతే!

Show comments