NTV Telugu Site icon

Harom Hara Review : సుధీర్ బాబు హరోం హర రివ్యూ.. హిట్ కొట్టాడా?

Hh

Hh

సుధీర్ బాబు సరైన హిట్ కోసం చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నాడు. ఆయన తాజాగా హరోం హర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ నాయుడు నిర్మాణంలో “హరోం హర” అనే సినిమా తెరకెక్కింది. మాళవిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సునీల్, జయప్రకాష్ వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా తరువాత సుధీర్ బాబు కెరియర్ మారిపోతుంది అంటూ ప్రమోషన్స్ లో పెద్ద ఎత్తున సినిమా యూనిట్ చెప్పుకొచ్చింది. దీంతో పాటు టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకులకు సినిమా మీద కాస్త ఆసక్తి ఏర్పడింది. మరి ఆ ఆసక్తిని సినిమా ఎంతవరకు క్యారీ చేసింది? ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించింది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

కథ: కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులు కలిసే చోట ఉన్న ఒక అందమైన ప్రాంతం కుప్పం. ఆ ఊరు మొత్తాన్ని తిమ్మారెడ్డి() అతని సోదరుడు బసవ(రవి కాలె), కుమారుడు శరత్ రెడ్డి(అర్జున్ గౌడ) తమ గుప్పెట్లో పెట్టుకుంటారు. అక్కడ వారు చెప్పిందే వేదం, చేసిందే చట్టం. కనీసం వాళ్ళు వస్తుంటే తల కూడా పైకి ఎత్తి లేనంతగా ఆ ఊరి ప్రజలు వణికిపోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అదే ఊరిలో బతకడానికి వేరే ఊరు నుంచి సుబ్రహ్మణ్యం(సుధీర్ బాబు) వస్తాడు. కుప్పం పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేస్తూ ఉండగా ఒకరోజు శరత్ రెడ్డి మనిషితో గొడవ అయ్యి కాలేజీ నుంచి సస్పెండ్ చేయబడతాడు. ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో తనకు స్నేహితుడైన సస్పెండెడ్ కానిస్టేబుల్ పళని స్వామి(సునీల్) దగ్గర ఒక తుపాకీ చూస్తాడు. ఆ తుపాకీతో పాటు ఒక బ్లూ ప్రింట్ కూడా దొరకడంతో తనకున్న మెకానికల్ తెలివితేటలతో తాను ఎందుకు గన్ తయారు చేయకూడదు అనే ఆలోచనతో గన్ తయారీ మొదలు పెడతాడు. అలా గన్ తయారీ మొదలుపెట్టిన సుబ్రహ్మణ్యం అదే ఊరిలో తన ఉద్యోగం పోవడానికి కారణమైన శరత్ రెడ్డితో ఎందుకు చేతులు కలిపాడు? ఊరు మొత్తం అసహ్యించుకునే శరత్ రెడ్డితో అసలు సుబ్రహ్మణ్యం కలవాల్సిన అవసరం వచ్చింది? చివరికి సుబ్రహ్మణ్యం ఏం చేశాడు? ఊరు మొత్తం అసహ్యించుకునే శరత్ రెడ్డితో చేతులు కలిపిన సుబ్రహ్మణ్యం ఆ ఊరు మొత్తానికి దేవుడు ఎలా అయ్యాడు? చివరికి సుబ్రహ్మణ్యం ఏం చేశాడు? అసలు ఈ సినిమాకి హరోం హర అనే టైటిల్ ఎందుకు పెట్టారు? లాంటి విషయాలు మాత్రం బిగ్ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ: బతకడానికి పొట్ట చేత పట్టుకుని వేరే ఊరు నుంచి వచ్చిన ఒక అమాయకపు కుర్రాడు అప్పటివరకు ఆ ఊరిని శాసిస్తున్న దుర్మార్గుల ముఠా బారి నుంచి ఊరిని రక్షించి ఆ ఊరు మొత్తానికి దేవుడు అయిన లైనులో ఇప్పటికే తెలుగు సినిమా చరిత్రలో పదుల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. దాదాపుగా హరోం హర సినిమా కూడా అదే లైన్ లో తెరకెక్కింది. కుప్పం అనే ప్రాంతానికి బతుకు తెరువు కోసం వచ్చిన సుబ్రహ్మణ్యం ఆ కుప్పం మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్న ఇద్దరు అన్నదమ్ముల ముఠాను ఎలా ఆట కట్టించాడు? ఆ ప్రాంతానికి స్వయంగా దేవుడు ఎలా అయ్యాడు అనే లైన్ లోనే ఈ సినిమా తెరకెక్కింది. అయితే కథలో కొత్తదనం లేకపోయినా దర్శకుడు తాను చెప్పాలనుకున్న పాయింట్ను నేరుగా చెబుతూనే దానికి అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ జోడించాడు. ఈ మధ్యకాలంలో సినిమా లైన్ చాలా ఈజీగానే ఉన్నా అర్థమయిపోయేలా ఉన్నా ఎంగేజ్ చేసే యాక్షన్ సీక్వెన్స్, అబ్బురపరిచే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంటే బండి నడిచేస్తుంది.. ఈ విషయాన్ని ఇప్పటికే కేజిఎఫ్, పుష్ప, జైలర్, విక్రమ్ లాంటి సినిమాలు నిరూపించాయి. ఆ కోవలో ఇప్పుడు సుధీర్ బాబు హరోం హర కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగానే ఉంది. నిజానికి ఈ సినిమా మొదలైన చాలాసేపటి వరకు అసలైన కథలోకి తీసుకువెళ్లలేదు దర్శకుడు. అయితే కథలోకి తీసుకువెళ్లే సమయానికి ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ వచ్చేస్తుంది. ఒక్కసారిగా ఆ ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ అబ్బురపరుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. అయితే సినిమా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విషయంలో మాత్రం ఎందుకో పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు అనిపించింది. ఇప్పుడు పుష్ప అయినా, కేజిఎఫ్ అయినా సాధారణమైన కథలే కానీ ఎమోషన్స్ వర్కౌట్ కావడంతో అవి బ్లాక్ బస్టర్లు అయ్యాయి..దాదాపుగా అలాంటి కథతోనే వచ్చిన ఈ సినిమా ఎమోషన్స్ విషయంలో కాస్త వెనకబడింది. అయితే సినిమాలో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ లు, భారీ వైలెన్స్ మాత్రం యాక్షన్ లవర్స్ కి ఒక రకమైన ఫీస్ట్ అనే చెప్పాలి. కే జి ఎఫ్ లో మొదలైన పెద్దమ్మ వాడకం ఈ సినిమాలో కూడా గట్టిగానే కనిపించింది. చిన్న రివాల్వర్తో మొదలుపెట్టి రాకెట్ లాంచర్ వరకు వాడిన తీరు ఆసక్తికరంగా అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ ఊహించే విధంగా ఉండటం కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే కే జి ఎఫ్, పుష్ప టెంప్లేట్ అనిపించినా అబ్బురపరిచే యాక్షన్ సీక్వెన్స్ లతో రాసుకున్న ఒక మంచి యాక్షన్ డ్రామా ఈ సినిమా. సుధీర్ బాబు యాక్షన్, ఫిజిక్ సినిమాకి బాగా ప్లస్ అయింది. సినిమా మొత్తాన్ని బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళి పోయింది. కొన్ని షాట్స్ క్రింజ్ అనిపించినా వాటిని పక్కన పెట్టేసి చూస్తే సినిమా ఆకట్టుకునేలా ఉంది.

నటీనటుల విషయానికి వస్తే ఇప్పటివరకు నైట్రో స్టార్ గా అందరికీ సుపరిచితుడు సుధీర్ బాబు. ఈ సినిమా తర్వాత నుంచి నవ దళపతిగా మారిపోతున్నాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు నటన చాలా ఈజ్ తో చేసినట్లు ఉంది. మనది కాని యాస మాట్లాడుతున్నప్పుడు కొంత ఇబ్బంది అనిపిస్తుంది కానీ సుధీర్ బాబు ఎంత హోంవర్క్ చేశాడో కానీ కుప్పం యాసను భలే పట్టేశాడు. ఆయనకు జోడీగా నటించిన మాళవిక శర్మ కూడా ఏమాత్రం తగ్గకుండా నటించింది. జయప్రకాశ్ సహా రవి కాలే, అర్జున్ గౌడ వంటి వాళ్లు తమదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సునీల్ కి చాలా కాలం తర్వాత మళ్లీ ఒక మంచి ఫుల్ లెంత్ రోల్ పడింది. ఉన్నంతలో సునీల్ ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు. అక్షర గౌడ పాత్ర చిన్నది అయిన పోలీస్ ఆఫీసర్గా ఆకట్టుకుంది. ఇక మిగతా పాత్రల పాత్రధారులు తమ తమ పరిధి మేరకు నటించారు. సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీతో పాటు కలర్ డిఐ చేసిన వారికి స్పెషల్ అప్రిసియేషన్ దక్కాల్సిందే. అలాగే 1980లనాటి కుప్పాన్ని మళ్లీ రీ క్రియేట్ చేసిన ఆర్ట్ టీం కష్టం కూడా ప్రతి ఫ్రేమ్ లో కనబడింది.. కుప్పం యాస విషయంలో తీసుకున్న జాగ్రత్తలు సినిమాకి ప్లస్ పాయింట్లలో ఒకటిగా నిలుస్తాయి. సినిమా మొత్తానికి సినిమాటోగ్రఫీతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ప్లస్ అయింది. ఎడిటింగ్ కూడా క్రిస్పీ గానే ఉంది. నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా వరకు రియల్ లొకేషన్స్ లో షూట్ చేసినా సెట్ వర్క్ ఆకట్టుకునేలా ఉంది.

ఫైనల్ గా చెప్పాలంటే హరోం హర వైలన్స్ పాళ్లు ఎక్కువగా ఉన్న ఒక యాక్షన్ ఎంటర్టైనర్.. యాక్షన్ సీక్వెన్స్ లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం అయినా ఒకసారి హ్యాపీగా చూసేయొచ్చు.

Show comments