NTV Telugu Site icon

Samajavaragamana Review: ‘సామజవరగమన’ రివ్యూ

Samajavaragamana Review Ntv

Samajavaragamana Review Ntv

Samajavaragamana Review: కెరీర్ మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సినిమాల మీద ఆసక్తితో సినీ హీరోగా మారాడు శ్రీవిష్ణు. ముందుగా పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన శ్రీ విష్ణు ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో హీరోగా మారాడు.. అలా మారిన అనంతరం అనేక సినిమాల్లో హీరోగా నటించారు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, నీది నాది ఒకే కథ లాంటి సినిమాలతో హిట్లు అందుకున్న ఆయన ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. రామ్ అబ్బరాజు డైరెక్షన్లో శ్రీవిష్ణు హీరోగా రెబ్బా మోనికా జాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఇక హాస్య మూవీస్ బ్యానర్ మీద దండ రాజేష్ నిర్మించిన ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రిలీజ్ చేయనుంది. సినిమా మీద నమ్మకంతో సోమవారం నుంచే ప్రీమియర్స్ వేస్తోంది సినిమా యూనిట్. మరి ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

కథ:
బాల సుబ్రహ్మణ్యం అలియాస్‌ బాలు(శ్రీవిష్ణు) థియేటర్‌ టికెట్ కౌంటర్లో ఉద్యోగిగా పని చేస్తూ ఉంటాడు. బాలు తండ్రి ఉమామహేశ్వరరావు(నరేష్)కు వందల కోట్ల ఆస్తి ఉంటుంది కానీ డిగ్రీ పాసైతే అతనికి చెందాలని వీలూనామా ఉంటుంది. దీంతో కొడుకు డిగ్రీ పూర్తయి ఉద్యోగం చేస్తున్నా తన తండ్రిని ఎలాగైనా డిగ్రీ పాస్‌ చేయించాలని అనేక తంటాలు పడుతూ ఉంటాడు. ఓ సారి ఎగ్జామ్‌ హాల్‌లో ఉమామహేశ్వరరావుకు డిగ్రీ పరీక్షలు రాసేందుకు వచ్చిన సరయు(రెబా మౌనికా జాన్‌) పరిచయం అవుతుంది. ముందు గొడవ అయినా హాస్టల్‌లో ఉండడం ఆమెకు ఇష్టం లేక బాలు ఇంట్లోకి పెయింగ్‌ గెస్ట్‌గా వచ్చి చేరుతుంది. ఒక లవ్ ఫెయిలయూర్ వల్ల అమ్మాయిల మీదనే విరక్తి పెంచుకున్న బాలు అనుకోకుండా సరయు ప్రేమలో పడతాడు. ఇక సరయు ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడమే తరువాయి అనుకుంటున్న సమయంలో బాలు మేనత్త కొడుకు ఎంగేజ్మెంట్ కోసం రాజమండ్రి వెళ్తాడు.. అక్కడికి వెళ్ళాక మేనత్త కొడుకు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సరయు సోదరి అని ఆ పెళ్లి అయితే సరయు తనకు సోదరి వరుస అవుతుందని తెలుస్తుంది. మరి బాలు, సరయు ప్రేమ ఏమైంది? సరయు సోదరి పెళ్లి క్యాన్సిల్ చేశారా? వీరి పెళ్లి విషయంలో ఉమామహేశ్వరరావు ఏం చేశాడు? అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:
‘సామజవరగమన’ అంటే ఇదేదో సంగీతానికి సంబంధించిన సినిమా అంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఈ సినిమా ఒక ఫుల్ లెన్త్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్. నిజానికి మన జీవితాల్లోకి జబర్దస్త్ లాంటి షోలు ఎంట్రీ ఇచ్చాక కామెడీ మరీ చేరువైపోయింది. ఒకరకంగా సినిమాల్లో ప్రేక్షకులను నవ్వించాడనికి పెద్ద యజ్ఞమే చేస్తున్నారు నేటి దర్శక నిర్మాతలు. అయితే ఈ ‘సామజవరగమన’ మాత్రం ఆద్యంతం నవ్విస్తుంది, ఆలోచింపచేస్తుంది ఇంటికి వెళ్లెవరకూ మన మనసుల్లో తిరుగుతూ ఉంటుంది. అరెరే ఇలాంటి పరిస్థితి మనకు కూడా వస్తే? మన పరిస్థితి ఏంట్రా? అని ఆలోచింప చేస్తుంది. నిజానికి ఇది కొత్త కథ ఏమీ కాదు, గతంలో ఇలాంటి పాయింట్ ఉన్న సినిమాలు వచ్చాయి కానీ ఒక ఫ్రెష్ ఫీల్ తో ఆకట్టుకుంది ఈ ‘సామజవరగమన’. సినిమా పరంగా కొన్ని లాజిక్స్ పక్కన పెట్టేస్తే సినిమా సాగుతున్నంత సేపు కడుపారా నవ్వుకోవచ్చు. కథలో కొత్తదనం లేకున్నా చక్కటి స్క్రీన్‌ప్లేతో, డైలాగులతో మనం కనెక్ట్ అయ్యేలా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు డైరెక్టర్.

ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టే నిబ్బా-నిబ్బీ, అమ్మాయిల ప్రేమ, మన కులం వంటి వాటిని ఎంచుకుని మనసారా ఎలాంటి బూతు లేకుండా నవ్వుకునేలా కథను రాసుకున్నాడు. అలా అని పూర్తిగా కామెడీ మీదనే బేస్ అవ్వలేదు షడ్రుచుల సమ్మేళనంలా ఒక పక్క ఫ్యామిలీ ఆడియన్స్‌ కోసం ఎమెషనల్‌ సీన్స్, యూత్ కోసం కామెడీతో పాటు లవ్ సీన్స్, లిప్ లాక్స్ ఇలా అన్నిటినీ కలబోసి ఒక మంచి ఎంటర్టైనర్ మనకి అందించారు. ఎదిగి ఉద్యోగం చేసుకుంటున్న ఒక కొడుకు తండ్రిని డిగ్రీ పరీక్ష పాస్‌ చేయించడం కోసం కొడుకు పడే తిప్పలతో మొదలైన సినిమా ఆ తరువాత ప్రేమలో పడడం, ఆమె చెల్లయ్యే ప్రమాదం పొంచి ఉండడంతో సినిమాలో కామెడీకి మంచి స్కోప్ దొరికింది. నరేష్-శ్రీవిష్ణు కాంబినేష్, శ్రీ విష్ణు కామెడీ టైమింగ్, అమ్మాయిల మోసాల గురించి ఒక లాంగ్ స్ట్రెచ్ డైలాగ్, ట్యూషన్‌ సెంటర్‌లో రఘుబాబు-నరేష్ కామెడీ బాగా వర్కౌట్ అయ్యాయి. బాద్ షా గా సుదర్శన్ కామెడీ, ‘కుల’ శేఖర్‌గా వెన్నెల కిశోర్‌ కామెడీ కూడా బాగా వర్కౌట్‌ అయింది. చాలా సినిమాల్లోని హిట్ సీన్లను పేరడీ చేసి నవ్వించారు.

నటీనటులు ఎలా చేశారంటే?
నటీనటుల విషయానికి వస్తే శ్రీవిష్ణు ఒక నేచురల్ యాక్టర్ ఇక ఈ సినిమాలో కూడా ఎప్పటిలాగే శ్రీవిష్ణు చాలా ఈజ్ తో నటించి ఆకట్టుకున్నాడు. శ్రీవిష్ణు కామెడీ టైమింగ్‌ అయితే సినిమాకు బాగా వర్కౌట్ అయింది. హీరోయిన్ కూడా పాత్రను ఓన్ చేసుకుని చేసినట్టు అనిపించింది. ఇక శ్రీవిష్ణు తర్వాత అంత స్కోప్ దొరికిన పాత్ర నరేష్ ది. ఎదిగొచ్చిన కొడుక్కి తండ్రిగా నటించిన పాత్రలు నరేష్ కి కొత్తేమి కాదు కానీ ఈ సినిమాలో తండ్రి పాత్ర మాత్రం కొత్తగా అనిపించింది, కాస్త పెట్టుడు మీసం ఎబ్బెట్టుగా అనిపించినా ఈ పాత్రకు నరేశ్‌ మాత్రమే న్యాయం చేయగలడేమో అనేలా జీవించాడు. ఇక నటి ప్రియా గడుసు మేనత్త పాత్రలో అదరకొట్టింది.

హీరో ఫ్రెండ్‌గా సుదర్శన్‌ తన కామెడీతో అదరకొట్టాడు. కుల శేకర్‌గా వెన్నెల కిశోర్‌ సెకండాఫ్ లో డామినేట్ చేశాడు. హీరోయిన్‌ తండ్రిగా శ్రీకాంత్‌ అయ్యంగార్‌తో పాటు అతని బావమరిదిగా రాజీవ్‌ కనకాల, తమ్ముళ్లుగా దేవీ ప్రసాద్, సుభాష్, జెమిని సురేష్ తమ తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. ఇక టెక్నీకల్ టీమ్ విషయానికి వస్తే గోపీసుందర్‌ సంగీతం విషయంలో పాటలు అంతగా ఆకట్టుకోలేదు కానీ నేపథ్య సంగీతం అదిరిపోయింది. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అదనపు అందాన్ని జోడించింది. భాను అందించిన డైలాగ్స్‌ ఈ సినిమాకు చాలా ప్లస్‌ అయ్యాయి. కథ కూడా ఎక్సలెంట్ గా కుదిరింది. కెప్టెన్ ఆఫ్ ది షిప్ రామ్ కూడా ఆకట్టుకున్నారు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:
కామెడీ
నరేష్ – శ్రీవిష్ణు నటన
ట్రెండ్ కు తగిన డైలాగ్స్

మైనస్ పాయింట్స్
సాంగ్స్
నిడివి

బాటమ్ లైన్: సామజవరగమన ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో కలిసి ఒక సారి హ్యాపీగా చూసేయచ్చు