NTV Telugu Site icon

Shekar Movie Review: శేఖర్

Shekar

Shekar

డాక్టర్ రాజశేఖర్ నటించిన ‘కల్కి’ తర్వాత చెప్పుకోదగ్గ చిత్రమేదీ రాలేదు. ప్రస్తుతం రాజశేఖర్ మూడు, నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి ‘శేఖర్’. నాలుగేళ్ళ క్రితం మలయాళంలో రూపుదిద్దుకుని ప్రజాదరణతో పాటు అవార్డులూ అందుకున్న ‘జోసఫ్‌’ను జీవిత దర్శకత్వంలో శివానీ, శివాత్మికతో పాటు సుధాకర్ రెడ్డి, బొగ్గారం వెంకట శ్రీనివాస్ రీమేక్ చేశారు. ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ స్కామ్ నేపథ్యంతో తెరకెక్కిన ‘శేఖర్’ ఎలా ఉందో తెలుసుకుందాం.

శేఖర్ (రాజశేఖర్) ఓ ఇన్వెస్టిగేటివ్ అధికారి. ఎలాంటి క్లిష్టమైన కేసునైనా నిమిషాల్లో సాల్వ్ చేసి, క్రిమినల్స్ ను ఐడెంటిఫై చేయగలిగే సత్తా ఉన్నవాడు. అయితే అతని జీవితంలోనే ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటాయి. తాను ప్రేమించిన కిన్నెర (ముస్కాన్)ను వివాహం చేసుకోలేక పోతాడు. జీవితంలో రాజీపడి కిన్నెర అభ్యర్థన మేరకు ఇందు (ఆత్మీయ రాజన్)ను పెళ్ళి చేసుకుంటాడు. వాళ్ళకో కూతురు పుడుతుంది. అదే సమయంలో కిన్నెర హత్యకు గురౌతుంది. తన కారణంగానే ఆమె చనిపోయిందనే గిల్టీనెస్ తో శేఖర్ ఉద్యోగం వదిలేస్తాడు. భార్యకూ విడాకులిస్తాడు. అయితే కూతురు గీత (శివానీ రాజశేఖర్)ను మాత్రం తన దగ్గరే ఉంచుకుని అల్లారు ముద్దుగా పెంచుతాడు. జీవితం సజావుగా సాగుతున్న సమయంలోనే ఇటు కూతురు గీత, అటు మాజీ భార్య ఇందు ఇద్దరూ రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతారు. వాళ్ళ మరణాల వెనుక మిస్టరీ ఏమిటీ? దాన్ని శేఖర్ ఎలా ఛేదించాడు? ఆ క్రమంలో తన జీవితాన్ని ఎలా పణంగా పెట్టాడు? అన్నదే మిగతా కథ.

మలయాళంలో ‘జోసఫ్’ చిత్రం విడుదలైనప్పుడు అక్కడి వైద్యులు కొందరు ఆ సినిమా కథపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అవయవదానమనేది పెద్ద సమస్యగా మారిన ఈ సమయంలో అభూత కల్పనలతో ఇలాంటి సినిమా తీయడం కరెక్ట్ కాదని వాదించారు. అయితే..  ఆర్గాన్ డొనేషన్ విషయంలో కొన్ని పెద్ద హాస్పిటల్స్ సిండికేట్‌ గా ఏర్పడి అవినీతికి, అక్రమాలకూ పాల్పడుతున్నాయనే వార్తలు మీడియాలో తరచూ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా కథ కూడా దాని చుట్టూ తిరిగేదే! ఆర్గాన్ డొనేషన్ స్కామ్ నేపథ్యంలో గతంలో కొన్ని సినిమాలుగా వచ్చినా.. ఓ ఇన్వెస్టిగేటివ్ అధికారి తన జీవితాన్నే పణంగా పెట్టి..  ఈ స్కామ్ ను వెలికిదీయడం అనేది ఇందులోని ప్రత్యేకత. అయితే రాజశేఖర్ కు ఉన్న యాంగ్రీ హీరో ఇమేజ్ కు ఇది పూర్తిగా భిన్నమైంది. ఆయన నుండి అవుట్ అండ్ యాక్షన్ చిత్రాలను అభిమానులు కోరుకుంటారు. అయితే అదే సమయంలో ‘గోరింటాకు’ వంటి సినిమాలో రాజశేఖర్ సెంటిమెంట్ ను పండించినా, ఆడియెన్స్ యాక్సెప్ట్ చేశారు. బహుశా అదే నమ్మకం, ధైర్యంతో రాజశేఖర్, జీవిత ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేసి ఉండొచ్చు.

కరోనాతో చావు అంచుల వరకూ వెళ్ళి వచ్చిన రాజశేఖర్.. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశంలోనూ ఆచి తూచి అడుగులు వేసినట్టే నటించారు. ఎక్కడా అతి అనిపించలేదు. అయితే ఆయన పోషించిన పాత్ర కూడా విచారగ్రస్తమైనదే కావడంతో ఆ లుక్ బాగా సూట్ అయ్యింది. తండ్రీ కూతుళ్ళ పాత్రల్లో రాజశేఖర్, శివానీ చక్కగా ఇమిడిపోయారు. మలయాళ మాతృకలో నటించిన ఆత్మీయ రాజన్ ఇందులోనూ అదే పాత్ర పోషించింది. ‘జార్జిరెడ్డి’ ఫేమ్ ముస్కాన్ కు పెద్దంత ప్రాధాన్యమున్న పాత్ర దక్కలేదు. రాజశేఖర్ అనుయాయులుగా సమీర్, భరణీ శంకర్, రవివర్మ నటించారు. వీళ్లను కేవలం సహాయకులుగానే ఉంచడం బాగాలేదు. ఆ టీమ్ లో కాస్తంత చురుకైన పాత్ర అభినవ్ గోమటంకే దక్కింది. ఇతర ప్రధాన పాత్రలను కిశోర్, పోసాని, కృష్ణంరాజు, శ్రావణ్ రాఘవేంద్ర తదితరులు పోషించారు. కవిత, ప్రసన్న కుమార్ జడ్డీలుగా అతిథి పాత్రల్లో మెరిశారు. చివరిలో అడ్వకేట్ గా ప్రకాశ్ రాజ్ ఎంట్రీ ఇవ్వడం బాగుంది. దేశంలో జరుగుతున్న ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ స్కామ్ గురించి అతని ద్వారా చెప్పించడంతో ఆడియెన్స్ కు అది రీచ్ అయ్యే అవకాశం ఏర్పడింది. లక్ష్మీ భూపాల్ సంభాషణలు సహజంగా ఉన్నాయి. అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతంతో పాటు స్వరపరిచిన గీతాల్లో ‘కిన్నెర.. ఓ కిన్నెర’ పాట బాగుంది. మల్లికార్జున్ సినిమాటోగ్రఫీ ఓకే.

నిజానికి ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీస్ ను చకచకా నడిపించాలి. తాబేలు నడక మాదిరి సాగితే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అవుతుంది. పైగా రాజశేఖర్ లాంటి ఫెరోషియస్ హీరోని మన్నుతిన్న పాము మాదిరిగా తెర మీద చూపిస్తే జనం తట్టుకోలేరు. విలువైన అంశాన్నే దర్శకురాలు జీవిత ఎంచుకున్నా, దాన్ని తెరకెక్కించడం, చూసే ప్రేక్షకుడిలో ఉత్సుకత కలిగించడంలో విఫలమయ్యారు. ప్రధానమైన ఆర్గాన్ డొనేషన్ స్కామ్ ని క్లయిమాక్స్ వరకూ రివీల్ చేయక పోడవం పెద్ద మైనస్. చివరి పది నిమిషాలు బాగుందనిపించినా అప్పటి వరకూ ఆడియన్స్ ఓపికగా కూర్చోవడం అసాధ్యమైన విషయం. ఈ తరహా సినిమాలలో తర్వాత సీన్ లో ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఉండాలి. ఇందులో అదే కొరవడింది. సినిమాకు అదే పెద్ద డ్రా బ్యాక్. థియేటర్లలో కాకుండా ఓటీటీలో కనీసం స్లో సీన్స్ ను స్కిప్ చేసుకునే అవకాశం ఉండేది. ఇటీవల వచ్చిన రాజశేఖర్ చిత్రాలతో పోల్చితే, కథ పరంగా ఇది మంచి సినిమానే!

రేటింగ్ : 2.25 / 5

ప్లస్ పాయింట్స్
రాజశేఖర్, శివానీ తండ్రీకూతుళ్ళుగా నటించడం
ఎంచుకున్న అంశం
ఆకట్టుకునే సంగీతం

మైనెస్ పాయింట్స్
సహనాన్ని పరీక్షించే కథనం
ఊహకందే పతాక సన్నివేశం

ట్యాగ్ లైన్: శేఖర్.. వెరీ స్లో!