NTV Telugu Site icon

Sammathame Movie Review : సమ్మతమే రివ్యూ!

Sammathame Movie Review

Sammathame Movie Review

 

కిరణ్‌ అబ్బవరం ఇవాళ టాలీవుడ్ లో ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతవరకూ విడుదలైనవి మూడు చిత్రాలే అయినా… ప్రస్తుతం పలు అగ్ర నిర్మాణ సంస్థలు అతనితో సినిమాలు నిర్మిస్తున్నాయి. ‘రాజాగారు రాణివారు’తో హీరోగా పరిచయమైన కిరణ్ రెండో సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ చక్కని ఆదరణ పొందింది. అయితే మూడో చిత్రం ‘సెబాస్టియన్’ మాత్రం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో అతని నాలుగో సినిమా ‘సమ్మతమే’ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. గోపీనాథ్ రెడ్డిని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ అతని తల్లి కంకణాల ప్రవీణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

కథ విషయానికి వస్తే చాలా సింపుల్. కృష్ణ (కిరణ్‌ అబ్బవరం)కు చిన్నప్పుడే తల్లి చనిపోతుంది. తండ్రి (గోపరాజు రమణ) అతన్ని పెంచి పెద్దవాడిని చేస్తాడు. ఇంటిలో తమను చూసుకునే ఆడమనిషి లేని లోటును వారిద్దరూ ఫీలవుతారు. అందుకే త్వరగా పెళ్ళి చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోవాలని కృష్ణ కలలు కంటాడు. పెద్దలు కుదుర్చిన పెళ్ళి చేసుకుని, ఆ తర్వాతే తన జీవిత భాగస్వామిని ప్రేమించాలని భావిస్తాడు. అతని జీవితంలోకి ఊహించని విధంగా ఓ రోజు శాన్వి (చాందని చౌదరి) అడుగు పెడుతుంది. ఆమె ఈ తరం అమ్మాయి. మరి కృష్ణ కోరుకున్న లక్షణాలు ఆమెలో ఉన్నాయా? తనను మాత్రమే ప్రేమించాలనుకున్న కృష్ణ కోరిక నెరవేరిందా? అసలు ఈ కాలం అమ్మాయిలు కృష్ణ లాంటి వ్యక్తిని ఇష్టపడతారా? అనేదే ఈ సినిమా కథ.

ఓ థిన్ లైన్ ను తీసుకుని రెండు గంటల సినిమాగా సాగతీసే ప్రయత్నం చేశాడు దర్శకుడు గోపీనాథ్ రెడ్డి. దాంతో సినిమా క్లయిమాక్స్ కు చేరినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండిపోయింది. తనకు కావాల్సిన విధంగా శాన్విని కృష్ణ మార్చుకున్నాడా లేక శాన్వి రూట్ కే అతను వెళ్ళాడా అనేది ప్రేక్షకులకు తెలియాల్సిన పాయింట్. సినిమా ప్రారంభంలోనే వారిద్దరి మెంటాలిటీ ఎంత భిన్నమైందో చెప్పిన దర్శకుడు…. ప్రీ క్లయిమాక్స్ వరకూ దానినే ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్ళాడు. ఆమెతో జీవితం కొనసాగించడం కష్టమని భావించిన కృష్ణ, ఆ తర్వాత సన్నివేశంలోనే సింపుల్ గా కన్వెన్స్ అయిపోయినట్టు చూపించేశాడు. నిజానికి ఓ కన్ ప్లిక్ట్ తో విడిపోయిన వారిద్దరూ కలవడానికి చేసే ప్రయత్నాలను మరింత బలంగా చూపించి ఉండాల్సింది. తండ్రి చెప్పే ఒకే ఒక్క ఉదాహరణతో హీరోలో మార్చు వచ్చేయడమనేది సిల్లీగా అనిపిస్తుంది. దర్శకుడు గోపీనాథ్ రెడ్డి ఎంచుకున్న పాయింట్ మంచిదే. ‘ఎదుటి వారి పట్ల మనం చూపించే ప్రేమ అన్ కండీషనల్ గా ఉండాలి. అందులో ఇఫ్స్ అండ్ బట్స్ కు చోటివ్వకూడదు’ అని ఈ మూవీ ద్వారా చెప్పాలని అనుకున్నారు. ఈ పాయింట్ తో అమ్మాయిలు ఏకీభవిస్తారు. సో… ఇట్స్ గర్ల్ థింగ్ అనుకోవచ్చు. కానీ వారు చేసిన ప్రతిదీ మంచేనా, వారి మంచి కోరి చెప్పే వారి మాటకు వారు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదా అనేది కూడా ఆలోచించాల్సిన పాయింట్. దానిని దర్శకుడు పూర్తి గా పక్కన పెట్టేశాడు.

నటీనటుల విషయానికి వస్తే…. కిరణ్‌ అబ్బవరం మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రలో చక్కగా ఇమిడిపోయాడు. హిందీ పెద్దగా రాని అతను హైదరాబాద్ లో భాషతో పడే పాట్లు సరదాగా ఉన్నాయి. ఈ తరం అమ్మాయిగా చాందిని చౌదరి బాగా నటించింది. ఇంట్లోనే ఆమె సిగరెట్ తాగడం, మందు కొట్టడం ఎబ్బెట్టుగా ఉన్నాయనుకుంటే, ఆమె నాన్నమ్మకూ మందు అలవాటు ఉందని చూపించడం పీక్స్. చిత్రం ఏమంటే… ఆ ఫ్యామిలీలో ఆవిడ మాత్రమే తెలంగాణ యాసలో మాట్లాడుతుంది! ఇక ఇతర ప్రధాన పాత్రల్లో గోపరాజు రమణ, శివన్నారాయణ, సప్తగిరి, చమ్మక్ చంద్ర, సితార, అన్నపూర్ణ తదితరులు కనిపిస్తారు. ఈ మూవీతో సతీశ్ రెడ్డి మాసం సినిమాటోగ్రాఫర్ గా పరిచయం అయ్యాడు. అతని విజువల్స్ బాగానే ఉన్నాయి. శేఖర్ చంద్ర సమకూర్చిన బాణీలు ఏ విధంగానూ మెప్పించలేదు. ఇందులోని రెట్రో సాంగ్ లో దానిని పాడిన మల్లికార్జున్, మాళవిక కనిపించడం విశేషం. ఈ పాట పిక్చరైజేషన్ కూడా ఏమంత ఆకట్టుకునేలా లేదు. అలనాటి హీరోలను అనుకరిస్తూ కిరణ్‌ స్టెప్పులు మాత్రం వేశాడంతే. హీరో క్యారెక్టరైజేషన్ లో క్లారిటీ లేకపోవడం ఈ సినిమాకు సంబంధించిన మెయిన్ మైనస్ పాయింట్. వీలైనంత త్వరగా ఓ అమ్మాయి మెడలో తాళి కట్టి ఓ ఇంటిని ఏర్పాటు చేసుకోవాలనే అతని పాత్రను దర్శకుడు ఆ తర్వాత ఎటో ఎటో తీసుకెళ్ళిపోయాడు. దాంతో ప్రేక్షకుడికి అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. చివరిలో అమ్మాయిల మనోభావాలు గౌరవించమనే ఓ సందేశాన్ని చెప్పినా… అది మరీ ఆలస్యమైపోయింది. నిజానికి ఇది షార్ట్ ఫిల్మ్ కు ఎక్కువ, సినిమాకు తక్కువ! క్లయిమాక్స్ లో హీరో ‘సమ్మతమే… సమ్మతమే… సమ్మతమే’ అని ఐదారుసార్లు అన్నా…. ప్రేక్షకులు మాత్రం తమ సమ్మతిని తెలిపే పరిస్థితి లేదు!

 

ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న పాయింట్
రొమాంటిక్ లవ్ స్టోరీ కావడం
సినిమా నిడివి ఎక్కువ లేకపోవడం

మైనెస్ పాయింట్స్
పండని ఎమోషనల్ సీన్స్
ఆకట్టుకోని పాటలు
ఆసక్తి రేకెత్తించని కథనం

ట్యాగ్ లైన్: సమ్మతించలేం!