NTV Telugu Site icon

Purushothamudu Review: పురుషోత్తముడు రివ్యూ!

Purushothamudu Review

Purushothamudu Review

Purushothamudu Review: గత కొద్దిరోజులుగా రాజ్ తరుణ్ అనూహ్యంగా ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన హీరోగా నటించిన పురుషోత్తముడు సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హాసిని సుధీర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాని రామ్ భీమన డైరెక్ట్ చేశారు. డాక్టర్ రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మాణంలో శ్రీ శ్రీదేవి మూవీస్ బ్యానర్ మీద నిర్మించబడిన ఈ సినిమా టీజర్, ట్రైలర్తో ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, మురళీ శర్మ వంటి స్టార్ యాక్టర్లు నటించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకున్నదా? సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

కథ :
పరశురామయ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ(మురళీ శర్మ) కుమారుడు రచిత్ రామ్(రాజ్ తరుణ్) లండన్ లో చదువుకుని తిరిగి హైదరాబాద్ వస్తాడు. అతన్ని సీఈఓ స్థానంలో కూర్చోబెట్టాలని మురళీ శర్మ సహా మిగతా కంపెనీలోని డైరెక్టర్లు అందరూ భావిస్తారు. అయితే మురళీ శర్మ అన్న భార్య(రమ్యకృష్ణ) ఆమె కుమారుడు విరాన్ ముత్తంశెట్టి కంపెనీ బైలాస్ లో ఉన్న ఒక లా కారణంగా సీఈవో అవ్వాలంటే 100 రోజులు ఎవరికి కనపడకుండా అజ్ఞాతంలో గడపాలని విషయాన్ని తెరమీదకు తీసుకొస్తారు. దీంతో అజ్ఞాతంలో గడపడానికి బయటకు వచ్చిన రాజ్ తరుణ్ కడియపులంక చేరతాడు. అక్కడ అమ్ములు (హాసిని ) పరిచయమవుతుంది. అక్కడి లోకల్ ఎమ్మెల్యే (జ్వాలా కోటి), అతని కుమారుడు (రాజ్ తిరందాసు) పూల రైతులను ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఆ రైతులందరూ రాజ్ తరుణ్ తమ పక్షాన పోరాడాలని కోరుతారు. అయితే అజ్ఞాతంలో ఉండాలనుకున్న రాజ్తో ఆ రైతుల పక్షాన పోరాడాడా? ఇంకా ఒక్కరోజు మాత్రమే అజ్ఞాతంలో గడిపితే కంపెనీ సీఈవో అయ్యే అవకాశం ఉన్న రాష్ట్రం 100వ రోజు ఎందుకు బయటకు వచ్చాడు? ఇంతకీ రాజ్ తరుణ్ సీఈఓ అయ్యాడా? లేదా? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
రాజ్ తరుణ్ కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ పెట్టి ఈ సినిమాని నిర్మించారు. నిజానికి టీజర్, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే సినిమా శ్రీమంతుడు జానర్ లో ఉండబోతుందని కొంత క్లారిటీ వచ్చింది. అయితే ప్రమోషన్స్ లో మాత్రం ఒక సరికొత్త పాయింట్ ను తీసుకుని ఈ సినిమా తెరకెక్కించామని అలాగే కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని ఆధారంగా చేసుకుని సినిమా తెరకెక్కించామని డైరెక్టర్ అలాగే ప్రొడ్యూసర్ చెబుతూ వచ్చారు. సినిమా కథ చూస్తే గతంలో మనం చూసిన శ్రీమంతుడు, బిచ్చగాడు, పిల్ల జమిందార్, అరుణాచలం లాంటివి జ్ఞప్తికి వస్తూ ఉంటాయి. అయితే రాజ్ తరుణ్ లెవెల్ కి ఈ సినిమా కథ ఆసక్తికరం అనిపిస్తుంది. అసలు కష్టమే తెలియకుండా పెరిగిన ఒక కుర్రాడు తండ్రి వద్దంటున్నా వినకుండా సీఈవో స్థానంలో కూర్చోవాలంటే అతి సామాన్య జీవితం గడిపితేనే కరెక్ట్ అని భావించి అజ్ఞాతంలో గడపడానికి సిద్ధమవుతాడు. అయితే ఆది కాస్తా కన్విన్సింగ్ గానే ఉన్నా అతను కడియపులంక చేరటం ఆ తర్వాత అక్కడ అమ్ములు దగ్గర పనిలో చేరటం వంటి అంశాలు కాస్త సినిమాటిక్ గా అనిపిస్తాయి. రియాలిటీకి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే ప్రవీణ్ తో కలిపి హీరోకి రాసుకున్న కామెడీ ట్రాక్ కూడా కొన్నిచోట్ల క్రింజ్ అనిపిస్తుంది. అలాగే రైతులు కాపాడమని వెంటపడుతుంటే ముందు అజ్ఞాతం నుంచి బయటికి రావాల్సి వస్తుందేమోనని వారికి దూరంగానే ఉంటున్న వాళ్ళ కష్టాలు విని చలించి వాళ్లకు ఒక దారి చూపించే ప్రయత్నం చేయడం వంటి విషయాలు కన్విన్సింగ్ గానే రాసుకున్నాడు డైరెక్టర్. ముఖ్యంగా సినిమాలో రాజ్ తరుణ్ చేత పలికించిన కొన్ని పద్యాలు, భాగవతంలోని కొన్ని శ్లోకాలు ఆహ్లాదకరమైన ఫీలింగ్ కలిగిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి రాజ్ తరుణ్ బయట ప్రస్తుతం ఫేస్ చేస్తున్న పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఈ సినిమాలో అతని పాత్ర డిజైనింగ్ ఉండడంతో కాస్త రియాలిటీ కి దూరం అనిపిస్తుంది. కానీ రాజ్ తరుణ్ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న వివాదం తెరమీదకు రాకుండా ఉంటే అతన్ని చూసే పాయింట్ ఆఫ్ వ్యూ మారి ఉండేదేమో. సినిమాలో కొన్ని సీన్స్ లో చిన్న చిన్న లోపాలు పక్కన పెట్టి చూస్తే రాజ్ తరుణ్ కెరియర్ లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ ఫ్యామిలీస్ తో కలిసి చూడగలిగే ఒక డీసెంట్ సినిమా అని చెప్పొచ్చు. అయితే కొన్ని క్రింజ్ మూమెంట్స్ అక్కడక్కడా ఎదురవుతాయి.

నటీనట్లు విషయానికి వస్తే:
రాజ్ తరుణ్ పురుషోత్తముడు లక్షణాలు ఉన్న రచిత్ రామ్ అనే పాత్రలో ఒదిగిపోయాడు. అతని కటౌట్ కి తగ్గట్టుగానే ఫైట్లు డాన్స్ కూడా కంపోస్ట్ చేయడంతో కాస్త సూటబుల్ పాత్ర అనిపిస్తుంది. అయితే అది బయట జరుగుతున్న వివాదం విషయం గుర్తు రానంత వరకే. అమ్ములు పాత్రలో హాసిని సుధీర్ కూడా తనదైన శైలిలో నటించింది. అమాయకపు పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక ప్రకాష్ రాజు, మురళీ శర్మ, రమ్యకృష్ణ, ముఖేష్ కన్నా వంటి వాళ్ళ పాత్రలు పరిమితమైన కనిపించినంత సేపు ఆ పాత్రల ఇంపాక్ట్ సినిమా మీద ఉంటుంది. ఇక విరాన్, జ్వాలా కోటి, రాజ్ తిరందాసు వంటి వాళ్ళు న్యాచురల్ గా నటిస్తూనే భయ పెడితే ప్రవీణ్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర వంటి వాళ్లు కనిపించింది కాసేపయినా నవ్వించారు. ఇక టెక్నికల్ విషయాలకు వస్తే సినిమాటోగ్రఫీ సినిమాలో కీలకమైన భాగాన్ని పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాకి రిచ్ లుక్ తీసుకు రావడంలో బాగా ఉపయోగపడింది. ఎడిటర్ మార్తాండ కే వెంకటేష్ ఎడిటింగ్ చాలా క్రిస్పీగా అనిపించింది. గోపి సుందర్ మ్యూజిక్ లోని పాటలు చాలా బాగున్నాయి. విజువల్ గా కూడా పాటలను అంతే బాగా చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి, సినిమాకి అనవసరంగా ఖర్చు పెట్టినట్టు అనిపించకుండానే మంచి రిచ్ లుక్ తీసుకొచ్చారు.

ఫైనల్లీ:
పురుషోత్తముడు కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే నచ్చొచ్చు.