NTV Telugu Site icon

Bhama Kalapam 2 Review : భామాకలాపం 2 రివ్యూ

Bhaama Kalapam 2 Review

Bhaama Kalapam 2 Review

Priyamani Bhama Kalapam 2 Review : భామాకలాపం అంటూ గతంలో ఆహాలో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన ఒక సినిమా మంచి పేరు తెచ్చుకుంది. అది స్టాండలోన్ ఫిలిం అని అందరూ అనుకున్నారు. అయితే సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో దానికి సెకండ్ పార్ట్ కూడా చేసేశారు. సైలెంటుగా షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాను మళ్ళీ ఆహాలో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. మొదటి పార్ట్ లో నటించిన ప్రియమణి, శరణ్య ప్రదీప్ లతో పాటు ఈ సినిమాలో సీరత్ కపూర్ కూడా నటిస్తున్నట్టు అనౌన్స్ చేయడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా టీజర్, ట్రైలర్ ఉండడంతో ప్రేక్షకులు ఆసక్తిగా సినిమా కోసం ఎదురు చూశారు. ఇక ఈ సినిమా ఎట్టకేలకు ఆహాలో రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం పదండి.

కథ:
భామా కలాపం -1లో వంటల యూట్యూబ్‌ ఛానెల్‌ తో పేరు తెచ్చుకున్న అనుపమ (ప్రియమణి).. కోల్‌కతా మ్యూజియంలో మాయమైన ఒక విలువైన కోడిగుడ్డు దెబ్బతో ఇబ్బందుల్లో పడుతుంది. ఆ ఇబ్బందుల నుంచి బయటపడిన అనుమప ఫ్యామిలీ ఇల్లు మారడంతో భామా కలాపం -2 మొదలవుతుంది. అలా ఇల్లు మారేప్పుడు ఇతరుల విషయాలను అస్సలు పట్టించుకోనని భర్తకు ప్రామిస్ చేసిన అనుపమ తన యూట్యూబ్‌ ఛానల్​ ద్వారా వచ్చిన ఆదాయంతో ఓ హోటల్‌ ప్రారంభిస్తుంది. తన పాత పనిమనిషి శిల్ప (శరణ్య)ను పార్ట్నర్​గా చేసుకుని అనుపమ ఘుమఘుమ అనే హోటల్ నడుపుతూ ఉండగా కుకింగ్ ఐడల్ 2023 అనే నేషనల్ లెవల్ కుకింగ్ కాంపిటీషన్​లో పాల్గొనే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆ కాంపిటీషన్​ నిర్వహించే ఆంటోని లోబో (అనూజ్ గుర్వారా) ఈ కుకింగ్ ఐడల్ ట్రోఫీని ఇటలీలో చేయిస్తున్నానని చెప్పి అక్కడి నుంచి ట్రోఫీ పేరుతో యూరోప్ నుంచి డ్రగ్స్‌ను తెప్పిస్తాడు. ఇవేమీ తెలియక కుకింగ్ షో కోసం ప్రిపేర్ అవుతున్న అనుపమ, శిల్ప ఒక సమస్యలో చిక్కుకుంటారు. దాని పరిష్కారం కోసం ఒక నార్కోటిక్స్ అధికారి దగ్గరకు వెళ్లి ఆ సమస్యను మరింత జటిలం చేసుకుంటారు. అయితే కుకింగ్ షోలో పాల్గొనేందుకు వెళ్లిన అనుపమకు రూ.1000కోట్ల విలువ గల కోడి పుంజు బొమ్మ​ను కొట్టేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఈ క్రమంలో విలన్​ గ్యాంగ్ నుంచి ఆమెకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఈ పరిస్థితి ఎదురైనప్పుడు ఆమె ఏం చేసింది? ఇక ఈ సినిమాలో అసలు జుబైదా?(సీరత్ కపూర్​) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే..

విశ్లేషణ: మొదటి సినిమాలో గుడ్డు చుట్టూ ఒక మర్డర్ మిస్టరీ స్టోరీ అల్లుకున్న మేకర్స్ రెండో సినిమాలో కథను కోడి పుంజు బొమ్మను చుట్టూ తిప్పారు. ఒకరకంగా ఈ మధ్య వస్తున్న మూస కథల టెంప్లేట్ లోనే ఈ సినిమా కూడా సాగింది. అనుకోకుండా చిక్కుల్లో పడి ఆ చిక్కుల నుంచి బయటపడడం మాత్రమే కాదు పోలీసులు, రక్షణ సిబ్బంది కూడా చేయలేని పనులు కూడా చేసినట్టు చూపడం ఒక అలవాటుగా మారింది. ఇక్కడ ఈ కథలో కూడా సేమ్ అంశం రిపీట్ చేశారు. కారు డ్రైవింగ్ నేర్చుకునే క్రమంలో చేసిన తప్పు వలన అనుపమ కొన్నేళ్ల నుంచి నార్కోటిక్స్ బృందాలను ముప్పతిప్పలు పెడుతున్న గ్యాంగ్ స్టర్ ను ఎలా పట్టించింది? అనేది సినిమా లైన్. ఇక ఈ సినిమాకి కొత్త పాత్రలు జుబేదా, ఆంటోనీ లోబోలను ఇంట్రడ్యూస్ చేస్తూ.. ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్ళి ఆ మధ్యలో అనుమప-శిల్పల కామెడీతో బండి నడిపించాడు డైరెక్టర్. జుబేదా పాత్రలో సీరత్ గ్లామర్ తో ఆకట్టుకోగా.. స్లో నెరేషన్ ప్రేక్షకులకు బోర్ కొట్టించే అంశం. ఇక విలన్ గా తాషీర్, మాణిక్యం, నార్కోటిక్స్ అధికారి సదాశివన్, దీదీ వంటి ఒక్కో క్యారెక్టర్ రావడంతో.. ఒక్కో అంశం ప్రేక్షకుడికి ఆసక్తి రేకెత్తించేలా రాసుకున్నాడు డైరెక్టర్. ప్రీ క్లైమాక్స్ వరకు కథను ఎంగేజింగ్ గా తీసుకొచ్చి.. చివర్లో తుస్సుమనిపించిన ఫీలింగ్ కలుగుతుంది. చివరి ఫైట్ లో అందరికీ తుపాకులు ఇచ్చేయడంతో ఎవరు ఎవరిని, ఎందుకు చంపుతున్నారు? అర్థం కాక ప్రేక్షకులు కన్ప్యూజన్ కు గురవుతారు. అలాగే క్లైమాక్స్ లో కోడి పుంజు బొమ్మ ఏమైందో కూడా చూపించకపోవడంతో ఎందుకో అర్దాంతరంగా ముగించిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక చివర్లో భామా కలాపం 3 ఉంటుందని ఏకంగా ‘రా’ నుంచి ఫోన్ రప్పించి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు కానీ మొదటి సినిమాకి రెండో సినిమాకే చాలా తేడా ఇంటెన్స్ విషయంలో కనిపించింది. నిజానికి సినిమాలో కొన్ని సన్నివేశాలు మరీ ల్యాగింగ్​గా అనిపించాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే అనుపమ అనే ఒక సగటు హౌస్ వైఫ్ పాత్ర ప్రియమణిలో జీవించింది. ఇక శిల్ప పాత్రలో శరణ్య తెరపై కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు అన్నట్టు క్యారెక్టర్ డిజైన్ ఉంది. ఇక హీరోయిన్‌ కావాలనే ఆశగల అమ్మాయిగా సీరత్‌ కపూర్‌ కి గ్లామర్ షో చేసే పాత్ర దొరికింది. ఆంటోనీ లోబో, తాషీర్‌, సదాశివన్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్ గా చూస్తే ప్రశాంత్‌ ఆర్‌.విహారి బ్యాక్​ గ్రౌండ్ మ్యూజిక్​, దీపక్‌ సినిమాటోగ్రఫీ, విప్లవ్‌ నైషధం ఎడిటింగ్‌ బాగా సెట్ అయ్యాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా బాగున్నాయి.

ఫైనల్ గా: ఓటీటీ అంటే బూతు అన్నట్టు మారిన ఈరోజుల్లో ఈ సినిమాని కుటుంబంతో కలిసి చూడొచ్చు. అదీ అంచనాల్లేకుండా!