NTV Telugu Site icon

Ponniyin Selvan Review: పొన్నియన్ సెల్వన్ -1 (తమిళ డబ్బింగ్)

Ps 1

Ps 1

Ponniyin Selvan Review: మొత్తానికీ ప్రముఖ దర్శకుడు మణిరత్నం చిరకాల వాంఛ నెరవేర్చింది. చారిత్రక నవల ‘పొన్నియన్ సెల్వన్’ను వెండితెరపై ఆవిష్కరించాలనే ఆయన కోరిక ఇంత కాలానికి తీరింది. తమిళ దిగ్గజ నటీ నటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో మణిరత్నం ఈ సినిమా తొలి భాగాన్ని వివిధ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ప్రముఖ రచయిత ‘కల్కి’ కృష్ణమూర్తి 1955లో రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవలకు ఇది తెర రూపం. ఐదు భాగాలుగా వచ్చిన ఆ నవలను మణిరత్నం రెండు భాగాల చిత్రంగా మలిచారు. నవలలో కళ్ళకు కట్టినట్టు వివరించిన సంఘటనలను, తెరపైకి మలిచే క్రమంలో సన్నివేశాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడమనేది అనివార్యం. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాను చూడాలి. తమిళనాట విశేష ఆదరణ పొందిన ఆ నవల కారణంగా ఈ సినిమా కథ ఏమిటనేది వారికి ఇప్పటికే తెలుసు. ఎటొచ్చీ తెలుగుతో పాటు ఇతర ప్రాంతీయులకు చోళుల గురించి ఇంత లోతైన పరిజ్ఞానం ఉండదు. వారిలో ఈ సినిమా గందరగోళాన్ని సృష్టించే ఆస్కారం ఉంది. అయితే వీలైనంత వరకూ చోళ రాజుల కాలం నాటి పరిస్థితులను, సామంతుల కుయుక్తులను విడమర్చి చెప్పే ప్రయత్నం మణిరత్నం చేశాడు.

తొలి భాగం కథను చెప్పుకోవాలంటే… తన చుట్టుపక్కల రాజ్యాలను జయించిన సుందర చోళ చక్రవర్తి (ప్రకాశ్‌ రాజ్) అనారోగ్యంతో మంచం పడతాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. పెద్ద కొడుకు ఆదిత్య కరికాలన్ (విక్రమ్) వ్యక్తిగత కారణాలతో రాజధానిని వదిలి, సామ్రాజ్య విస్తరణకు ఉత్తరం వైపు బయలు దేరతాడు. ఒక్కో రాజ్యాన్ని గెలుస్తూ ముందుకు సాగుతుంటాడు. రెండో కొడుకు అరుల్మోళి (‘జయం’ రవి) లంకను హస్తగతం చేసుకోవడానికి వెళతాడు. తండ్రి దగ్గర లోనే యువరాణి కుందవై (త్రిష) ఉంటుంది. అయితే చోళ రాజ్యంలోనే ముసలం పుడుతుంది. సామంతులను తనవైపు తిప్పుకుని చక్రవర్తిని వధించి అయినా రాజ్యానికి అధిపతి కావాలని చోళ చక్రవర్తి పెద్దన్నయ్య కొడుకు మధురాంతకుడు (రెహమాన్) ప్రయత్నిస్తుంటాడు. అతనికి తన భార్య నందిని (ఐశ్వర్యరాయ్) సలహాతో పెళువెట్టరాయల్ (శరత్ కుమార్) సాయం చేస్తుంటాడు. ఈ విషయాన్ని ఆదిత్య వేగు అయిన వల్లవ రాయన్ (కార్తి) చక్రవర్తికి చేరవేస్తాడు. ఇద్దరు కొడుకులూ వేర్వేరు దిశలలో రాజ్య విస్తరణ చేస్తున్న సమయంలో సుందర చోళుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తండ్రి వెనక్కి రమ్మని కోరినా ఆదిత్య కరికాలన్ ఎందుకు రానన్నాడు? అతనికి నందినికీ మధ్య ఉన్న బంధం ఏమిటీ? శ్రీలంకను జయించిన అరుల్మోళిని బందీగా అయినా రాజధానికి తీసుకురమ్మని సుందర చోళుడు ఎందుకు చెప్పాడు? చోళ వంశీయులను అంతమొందిచడానికి పాండ్య రాజ్య సైనికులు ఎలాంటి కుట్రలు పన్నారు? అనేది ప్రధమాభాగం కథ.

చిరంజీవి వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ సినిమా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోతుంది. యుద్ధానికి యుద్ధానికి మధ్య ఓ పాట అన్నట్టుగా మణిరత్నం వాటితోనే ప్రేక్షకులకు కాస్తంత రిలీఫ్ ఇచ్చారు. కానీ ఆ పాటలు ఏ మాత్రం ఆకట్టుకునేలా లేవు. అయితే శ్రీకృష్ణ కంస వధ నృత్యరూపకం కొంతలో కొంత ఆకట్టుకునేలా ఉంది. తెర మీద తమిళ కథానాయకులు, కథానాయికలు కనిపిస్తుంటే… ప్రేక్షకులకు కనువిందుగానే అనిపిస్తుంది. ఇందులోని అత్యధిక పాత్రలలో గ్రే షేడ్స్ ను చూపించారు. కానీ వారు ఆ రకంగా ప్రవర్తించడానికి కారణం ఏమిటనే దానిని మరు క్షణంలోనే రివీల్ చేయడంతో ఆ యా పాత్రలపై ప్రేక్షకులకు కోపం కానీ దయ గానీ జాలి గానీ కలిగే ఆస్కారం లేకపోయింది. కార్తి పోషించిన వేగు పాత్ర ఇందులో కీలకమైంది. ఈ ప్రధమార్థంలోని ఒక్కో పాత్రను లింక్ చేస్తూ కార్తీ పాత్ర సాగింది. నటీనటులంతా ప్రాణం పెట్టి తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. కానీ వారి అభిమానులకు మాత్రం అసంతృప్తి అనేది మిగిలిపోతుంది.

సాంకేతిక నిపుణులలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రవి వర్మన్ సినిమాటోగ్రఫీ. అలానే శేఖర్ ప్రసాద్ ఎడిటింగ్. ఈ కథను మణిరత్నం ఎంత నిడివిలో తీశాడో ఊహించుకోవచ్చు. కానీ దానిని శేఖర్ ప్రసాద్ షార్ట్ ఎడిటింగ్ చేసి ప్రేక్షకుల ముందు పెట్టాడు. పాటల విషయంలోనూ కొంత కోత పడినట్టు అర్థమౌతోంది. ఎ. ఆర్. రెహమాన్ విషయంలో పెద్ద అసంతృప్తి ప్రేక్షకులకు కలుగుతుంది. పాటల బాణీలు, నేపథ్య సంగీతం కూడా ఆశించిన స్థాయిలో లేవు. మణిరత్నం సినిమాలకు రెహ్మాన్ ఇలాంటి సంగీతం అందించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. తెలుగులో ఈ సినిమాకు ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ళ భరణి సంభాషణలు రాశారు. తెలుగుదనాన్ని ఆయా పాత్రలకు అద్దే ప్రయత్నం చేశారు. ‘మట్టికి తలవంచే వాడు ఆకాశానికి ఎదుగుతాడు’ వంటి చక్కని మాటలు ఇందులో ఎన్నో వున్నాయి. ఇందులో నంబి పాత్రధారి అయిన జయరాంకు భరణినే డబ్బింగ్ చెప్పారు. ప్రధమార్థంలో విక్రమ్ పాత్రపై ఫోకస్ పెట్టిన దర్శకుడు మణిరత్నం, ద్వితీయార్ధంలో ‘జయం’ రవి పాత్రకు ప్రాధాన్యమిచ్చారు. యుద్థ సన్నివేశాలు పెద్దంత ఆకట్టుకునేలా చిత్రీకరించలేకపోయారు. ‘బాహుబలి’ని చూసిన కళ్ళతో వీటిని చూస్తే వెలవెల బోయినట్టుగా అనిపించింది. ఇక సాగరంలో చిత్రీకరించిన పతాక సన్నివేశం బాగానే ఉన్నా…. ‘టైటానిక్’ మూవీనే ఆ టైమ్ లో ఆడియెన్స్ కళ్లముందు మెదులుతుంది. మొత్తం మీద మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ తమిళులను ఆకట్టుకోవచ్చునేమో కానీ, ఇతరులను మెప్పించడం కష్టం. విశేష ఆదరణ పొందిన చారిత్రక నవలను వెండితెర ఆవిష్కరించడం కత్తిమీద సాములాంటిది. అందులో మణిరత్నం లాంటి దర్శక దిగ్గజం కూడా విఫలమయ్యారనే చెప్పాలి.

రేటింగ్: 2.25 / 5

ప్లస్ పాయింట్స్
పాపులర్ నవల కావడం
ప్రముఖ నటీనటులు నటించడం
మణిరత్నం దర్శకుడు కావడం

మైనెస్ పాయింట్స్
సహనాన్ని పరీక్షించే కథనం
ఆకట్టుకోని రెహ్మాన్ సంగీతం

ట్యాగ్ లైన్: చారిత్రక తప్పిదం!

Show comments