NTV Telugu Site icon

Pathaan Review: పఠాన్ మూవీ రివ్యూ (హిందీ)

Pathan Movie Review

Pathan Movie Review

యాభై ఏళ్ళకు పైగా చరిత్ర కలిగిన యశ్ రాజ్ ఫిలిమ్స్ దశాబ్ద కాలంగా స్పై యాక్షన్ మూవీస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే ఆ సంస్థ నుంచి ‘ఏక్ థా టైగర్, టైగర్ జిందాహై, వార్’ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ‘పఠాన్’ రూపుదిద్దుకుంది. ‘వార్’ను తెరకెక్కించిన ఆనంద్ సిద్ధార్థ్‌ ‘పఠాన్’ చిత్రాన్నీ కూడా దాదాపు అదే బాటలో నడిపాడు. ఇందులో ‘బేషరమ్ రంగ్’ సాంగ్‌తో రేగిన చిచ్చు కారణంగా అందరి దృష్టి ‘పఠాన్’పై పడింది. దేశవ్యాప్తంగా జరిగిన వాడీ వేడీ చర్చతో మూవీపై క్రేజ్ పెరిగింది. ‘జీరో’ తర్వాత షారూఖ్ ఖాన్ నటించిన సినిమా కావడంతో భారీ ఓపెనింగ్స్ లభించాయి. హిందీలో పాటు ‘పఠాన్’ తెలుగు, తమిళ భాషల్లోనూ డబ్ అయ్యి బుధవారం జనం ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ విషయానికి వస్తే అనాథ అయిన పఠాన్ (షారూఖ్ ఖాన్) దేశాన్నే తన తల్లిగా భావిస్తాడు. ఆమె రుణం తీర్చుకోవడానికి ఇండియన్ ఆర్మీలో చేరతాడు. ఓ ఆపరేషన్ నిమిత్తం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినప్పుడు తృటిలో చావు తప్పించుకుని కోమాలోకి వెళ్తాడు. తమ ప్రాణాలను కాపాడిన అతన్ని అక్కడి వారు సొంత బిడ్డగా ఆదరించి, ‘పఠాన్’ అని పిలుచుకుంటారు. అప్పటి నుండీ అదే అతని అసలు పేరుగా మారుతుంది. ఇదిలా ఉంటే… ఓ సీక్రెట్ ఆపరేషన్ లో చనిపోయాడని భావించిన భారత్ ‘రా’ ఏజెంట్ జిమ్ (జాన్ అబ్రహం), శత్రు దేశాలకు చెందిన ఏజెంట్స్ తో ప్రైవేట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ప్రారంభిస్తాడు. పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్ రుబీనా ఖాన్ (దీపికా పదుకునే) సైతం అతనితో చేతులు కలుపుతుంది. వీరంతా కలిసి భారత్ కు వ్యతిరేకంగా చేపట్టిన కుట్రను ఛేదించడానికి పఠాన్ రంగంలోకి దిగుతాడు. డాక్టర్ చదివిన రుబీనా ఖాన్ పాక్ ఏజెంట్ గా ఎందుకు మారింది? తన సొంత దేశాన్నే నాశనం చేయాలని జిమ్ ఎందుకు కంకణం కట్టుకున్నాడు? జిమ్ అండర్ లో వర్క్ చేసే రుబీనా… పఠాన్ తో ఎందుకు చేతులు కలిపింది? ఆమె సాయంతో పఠాన్ ఈ దేశాన్ని ఎలా రక్షించాడన్నదే మిగతా కథ.

ఓ దేశాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు ప్రత్యక్ష యుద్ధానికి దిగకుండా, వైరస్ తో దెబ్బ తీస్తున్న సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. ఈ తరహా కథాంశాలతో గత కొన్నేళ్ళుగా చాలా చిత్రాలు వచ్చాయి. అయితే… స్వదేశానికి చెందిన ఓ ఏజెంట్, వ్యక్తిగత కక్షతో దీనికి పాల్పడటం, అతనికి మరో ఏజెంట్ బుద్ధి చెప్పడమే ఇందులో ప్రథానాంశం. చిత్రం ఏమంటే… ‘వార్’ సినిమా కథ కూడా ఇదే తరహాలో సాగుతుంది. తనకు దేశం అన్యాయం చేసిందని భావించిన ఓ వ్యక్తి, ఆ తర్వాత నిజం తెలుసుకుని మారతాడు. కానీ ఇందులో మాత్రం మారడు. దాదాపుగా అదే లైన్ లో ‘పఠాన్’ సాగింది. కథ మీద ఆనంద్ సిదార్థ్ మరింత దృష్టి పెట్టి ఉంటే ఇంకాస్తంత బెటర్ మూవీగా ‘పఠాన్’ ఉండేది. దాని మీద కంటే యశ్ రాజ్ ఫిలిమ్స్ హిట్ కాంబినేషన్, క్రేజీ స్టార్ స్పెషల్ అప్పీయరెన్స్ మీద ఎక్కువ బేస్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే తన గత చిత్రాల ఏజెంట్ టైగర్ (సల్మాన్ ఖాన్)నూ ఇందులో రంగంలోకి దింపింది. ఈ మధ్య బాలీవుడ్ లో ఇది ఓ ట్రెండ్ గా మారింది. దేశంలోని టెర్రిరిస్ట్ కార్యకలాపాలను అదుపులోకి తీసుకురావడం కోసం అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ సినిమాలోకి అజయ్ దేవ్ గన్, రణవీర్ సింగ్ ను తీసుకొచ్చినట్టే… ఇందులో కూడా టైగర్ పాత్రధారి సల్మాన్ ఖాన్ ను ఓ కీలక సందర్భంలో ప్రవేశ పెట్టారు. అయితే ఆ సమయంలో ట్రైన్ మీద చిత్రీకరించిన యాక్షన్ సీన్స్ మాత్రం బొమ్మలాటలా దారుణంగా ఉన్నాయి. బట్… సల్మాన్ ఖాన్ ప్రెజెన్స్ ను మాస్ ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు. క్లయిమాక్స్ లోనూ వీరిద్దరి మధ్య పెట్టిన సరదా సంభాషణ కూడా బాగానే ఉంది.

యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ స్పై యాక్షన్ మూవీస్ ను ఇంకా కొనసాగిస్తోంది కాబట్టి… రాబోయే సినిమాల్లో టైగర్, పఠాన్, కబీర్ పాత్రలన్నింటినీ కూడా కలిపి ఓ యూనివర్స్ లా చూపించే ఛాన్స్ లేకపోలేదు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ నాన్ స్టాప్ యాక్షన్ తో ‘పఠాన్’ సాగింది. కొన్ని పాత్రలకు సెంటిమెంట్ జత చేసినా పెద్దగా పండలేదు. షారూఖ్ ఖాన్ లో మునుపటి ఛార్మ్ కనిపించలేదు. బట్ స్క్రీన్ ప్రెజెన్స్ ఓకే… అయితే అతని పక్కన దీపికా పదుకునే ఆ లోటును చాలావరకూ కవర్ చేసింది. సూపర్ హిట్ పెయిర్ అయిన వీరిద్దరి మీద రెండు పాటలే ఉండటం.. ఒకటి రోలింగ్ టైటిల్స్ పై రావటం అభిమానులను నిరుత్సాహ పరుస్తుంది. ప్రథమార్ధంలో వచ్చే బేషరమ్ పాటతో పాటు రోలింగ్ టైటిల్స్ లో వచ్చే పాట కూడా చిత్రీకరణ పరంగా బాగున్నాయి. దీపికా పోషించింది సీక్రెట్ ఏజెంట్ పాత్ర. పైగా తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకునే క్యారెక్టర్. బట్ అవసరానికి మించిన అందాల ఆరబోత చేయించారు. నిజానికి ఆ పాత్రను మరింత బాగా డిజైన్ చేయొచ్చు. ఆ పని జరగలేదు. జిమ్ గా జాన్ అబ్రహం బాగా చేశాడు. ఇలాంటి పాత్రలు తనకు కొత్త కాదు. మరో రెండు కీలక పాత్రలను డింపుల్ కపాడియా, అశుతోష్ రాణా పోషించారు. సల్మాన్ ఖాన్ ఎంట్రీ అదిరింది. అక్కడి యాక్షన్ సన్నివేశాలను మరింత రియలిస్టిక్ గా తీసిఉంటే బాగుండేది. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మొత్తం ‘కమ్ సెప్టెంబర్’ మూవీలోని నేపథ్య సంగీతాన్నే అనుసరించటం గమనార్హం. మొత్తం మీద షారుఖ్ అభిమానులతో పాటు యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ‘పఠాన్’ నచ్చుతుంది. వన్ టైమ్ వాచ్ బుల్ మూవీ కేటరిగిలో ‘పఠాన్’ను చేర్చొచ్చు.

రేటింగ్: 2.5 / 5

ప్లస్ పాయింట్స్
షారూఖ్‌ ఖాన్ ప్రెజెన్స్
అచ్చివచ్చిన హీరోయిన్
రెండు పాటల చిత్రీకరణ
యాక్షన్ కొరియోగ్రఫీ

మైనస్ పాయింట్స్
కొత్తదనం లేని కథ
బోర్ కొట్టించే ఫ్లాష్ బ్యాక్

ట్యాగ్ లైన్: రొటీన్ పఠాన్!

Show comments