NTV Telugu Site icon

Pancha Tantram Movie Review: పంచతంత్రం

Pancha Tantram

Pancha Tantram

Pancha Tantram Movie Review: ప్రస్తుతం వస్తున్న కొన్ని మూవీస్ ను చూస్తుంటే, అన్ని వర్గాలను ఆకట్టుకోవాలనే ఆలోచనకు దర్శక నిర్మాతలు తిలోదకాలు ఇచ్చారేమో అనిపిస్తోంది. మల్టీప్లెక్స్ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తూ కొందరు, ఓటీటీలో పాస్ అవుతామనే ధీమాతో మరికొందరు సినిమాలు చేస్తున్నట్టుగా ఉంది. తాజాగా యంగ్ డైరెక్టర్ హర్ష పులిపాక తీసిన ‘పంచతంత్రం’ కూడా ఆ కోవకు చెందిన మూవీనే! అఖిలేష్ వర్థన్, సృజన్ ఎరబోలు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.

ఆల్ ఇండియా రేడియోలో పదవీ విరమణ చేసిన వేదవ్యాస మూర్తి (బ్రహ్మానందం) కథలు రాసి, వాటిని పబ్లిష్ చేసి, పాఠకులకు సరికొత్త అనుభూతిని కలిగించాలని చూస్తాడు. అయితే అతన్ని కూతురు డాక్టర్ రోషిణి (స్వాతి) నిరుత్సాహపరుస్తుంది. కుర్రాళ్ళను మెప్పించే కథలు చెప్పడం మీవల్ల కాదు అని తండ్రిని తక్కువ అంచనా వేస్తుంది. కానీ పబ్లిషర్స్ కోరిన కథలు చెప్పగలనని నమ్మిన వేదవ్యాసమూర్తి.. స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్ కు వెళతాడు. అక్కడో అయిదు కథలు చెబుతాడు. వాటికి ఇంటర్ లింక్ ఉండాలని నిర్వాహకులు చెప్పడంతో పంచేద్రియాలను బేస్ చేసుకుని ఆ కథలను చెబుతాడు. అలా మొదలైన ఐదు కథల మీదుగా సినిమా సాగుతుంది.

ఇందులో మొదటి కథ సాగర తీరాన్ని చూడాలని తపన పడే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ది కాగా, రెండోది చిన్నప్పుడు ఇష్టపడిన అమ్మాయిని తలుచుకుని ఆ జ్ఞాపకాలను మరోసారి తడిమి చూడాలని తాపత్రయపడే యువకుడిది. ఇవి రెండూ ఫీల్ గుడ్, యూత్ ఫుల్ స్టోరీస్. మూడోది అందుకు పూర్తి భిన్నమైంది. తనకు జన్మనిస్తూ చనిపోయిన తల్లిని కూతురులో చూసుకుని, ఆమె డెలివరీ టైమ్ కు మానసిక రోగానికి గురయ్యే వ్యక్తి కథ ఇది. ఇక నాలుగోది మధ్యతరగతి మనుషుల వ్యథ.  కొత్తగా పెళ్ళి అయిన దంపతులకు ఊహించని కష్టం వచ్చి, వారి జీవితాలు అల్లకల్లోలం కావడమే దీని సారాంశం. లాస్ట్ ది ఇన్ స్పైరింగ్ స్టోరీ! ఆ కథలోని నాయిక లక్షణాలను వేదవ్యాస మూర్తి కూతురు తనలో చూసుకుంటుంది. ఐదు కథలనూ అత్యద్భుతంగా చెప్పిన తన తండ్రిని ఆమె అభినందించడంతో సినిమా ముగుస్తుంది. ఈ మూవీని చూస్తుంటే అప్పుడెప్పుడో వచ్చిన ‘చందమామ కథలు’ సినిమా గుర్తుకు వస్తుంది. అలానే ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు, తమిళ యాంథాలజీలూ మదిలో మెదులుతాయి. అయితే.. ఇది అచ్చ తెలుగు యాంథాలజీ అని చెప్పొచ్చు. సముతిర కని లాంటి ఒకరిద్దరు తప్పితే మిగిలిన నటీనటులంతా తెలుగు వారే. తెలుగు నేటివిటీతో దీన్ని మలిచిన తీరు బాగుంది. దర్శకుడు హర్ష పులిపాక పాత్రోచితమైన సంభాషణలు రాసి మెప్పించారు. రెండో కథలో రాహుల్, శివాత్మిక మధ్య సాగే సంభాషణలు సూపర్!

నటీనటుల విషయానికి వస్తే.. మొదటి ఎపిసోడ్ లో నరేశ్‌ అగస్త్య, శ్రీవిద్య మహర్షి ప్రధాన పాత్రలు పోషించగా, రెండో దానిలో రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ వి కీలక పాత్రలు. మూడో కథలో సముతిర ఖని, దివ్యవాణి కీ-రోల్స్ ప్లే చేశారు. నాలుగో కథలో దివ్య శ్రీపాద, వికాస్ ముప్పల మెయిన్ రోల్స్ చేయగా, ఐదు కథలో ఉత్తేజ్, కలర్స్ స్వాతి, ఆదర్శ్ బాలకృష్ణలవి కీలక పాత్రలు. ఈ ఐదు కథలను ప్రేక్షకులకు తెలిపే సంధానకర్తగా బ్రహ్మానందం నటించారు. ఇతర పాత్రలను సింగర్ మధు, మిర్చి హేమంత్, సురభి ప్రభావతి, రూపలక్ష్మి, బేబీ ప్రణయ పి. రావ్ తదితరులు పోషించారు. నటీనటులందరి నుండి సహజ నటనను దర్శకుడు రాబట్టుకున్నాడు. బట్.. సముతిర ఖని డబ్బింగ్ కాస్తంత ఇబ్బందికరంగా అనిపించింది.

సాంకేతిక నిపుణుల్లో ప్రశాంత్ ఆర్ విహారి, శ్రవణ్ భరద్వాజ్ అందించిన సంగీతం, గ్యారీ బి. హెచ్. ఎడిటింగ్, రాజ్ కె నల్లి సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే. అయితే… పంచేంద్రియాలను బేస్ చేసుకుని ఈ కథలను చెబుతున్నట్టు ప్రారంభంలో వేద వ్యాసమూర్తి అంటాడు. ఈ ఐదు కథల్లో వాటి ప్రాధాన్యతను మరింత ఎఫెక్టివ్ గా చూపించి ఉండాల్సింది. అలానే మూవీ చూస్తుండగా కలిగే చాలా ప్రశ్నలకు సమాధానాలు లభించవు. కొన్ని ఎపిసోడ్స్ ను అర్థాంతరంగా ముగించారనిపిస్తుంది. కొన్నింటి ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాదు. చివరి కథలోని నాయికతో వేదవ్యాసమూర్తి కూతురు ఎందుకంతగా కనెక్ట్ అయ్యిందో తెలియదు. ఇలాంటి సందేహాలు ఎన్నో కలుగుతాయి. డైరెక్టర్ హర్ష తన మనసులోని భావాలను ప్రభావంతంగా సిల్వర్ స్క్రీన్ మీదకు ప్రెజెంట్ చేయలేదనిపిస్తుంది. ఏదేమైనా.. థియేటర్లో కంటే ఓటీటీలో ఈ మూవీని చూస్తే కలిగే ఫీలింగ్ వేరు!!

రేటింగ్: 2.75 / 5

ప్లస్ పాయింట్స్
డిఫరెంట్ థీమ్స్ కావడం
ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్
మ్యూజిక్, సినిమాటోగ్రఫీ

మైనెస్ పాయింట్స్
ఆకట్టుకోని కొన్ని కథలు
లింక్ లేకుండా సాగే వైనం

ట్యాగ్ లైన్: పసలేని తంత్రం!