NTV Telugu Site icon

Odela Railway Station Rating : ఓదెల రైల్వే స్టేషన్ (ఆహా) రివ్యూ

Odela Railway Station Rating

Odela Railway Station Rating

 

వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మధ్య కాలంలో పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అలాంటి సినిమానే ‘ఓదెల రైల్వే స్టేషన్’. తెలంగాణ పల్లె నేపథ్యంగా ఈ కథను ప్రముఖ దర్శకుడు సంపత్ నంది రాయగా, ఆయన శిష్యుడు అశోక్ తేజ ఈ మూవీతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. వశిష్ఠ సింహా, హెబా పటేల్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను కెకె రాధామోహన్ నిర్మించారు. గంటన్నర నిడివి ఉన్న ‘ఓదెల రైల్వే స్టేషన్’ మూవీ శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

సినిమా ప్రారంభమే ఓ దారుణమైన ఘటనతో మొదలవుతుంది. రాధ (హెబా పటేల్) ఓ వ్యక్తి తలను నరికి పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ. లక్ష్మణ్ (నాగ మహేశ్‌) టేబుల్ మీద పెడుతుంది. ఆ వ్యక్తి తాలుకు మొండెం ఊరి చివరి బావిలో ఉందని చెబుతుంది. అక్కడకు తన టీమ్ తో వెళ్ళిన ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ అనుదీప్ (సాయిరోనక్) కు హతుడి బాడీ లభిస్తుంది. అక్కడ నుండి కథ మూడు నెలల వెనక్కి వెళుతుంది. తిరుపతి (వశిష్ఠ), రాధ భార్యాభర్తలు. తాగుబోతు అయిన తిరుపతితో ఎలాగో కాపురం నెగ్గుకొస్తుంటుంది రాధ. ఆమెకో మరిది. అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న ఆ ఊరిలో కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు శోభనం మర్నాడే దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురవుతుంటారు. అలా మూడు హత్యలు జరిగిన తర్వాత ఇక లాభం లేదని హంతకుడిని ట్రాప్ చేయడం కోసం అనుదీప్ తానే ఓ పావుగా మారతాడు. తన ప్రియురాలు స్ఫూర్తి (పూజిత పొన్నాడ)ని పెళ్ళిచేసుకుని, అదే పల్లెటూరిలో కాపురం పెడతాడు. వారి శోభనం అయిన మర్నాడు స్ఫూర్తి.. హంతకుడి చేతిలో హతం అయ్యిందా? అనుదీప్ చేతికి హంతకుడు చిక్కాడా? మరి రాధ హత్య చేసింది ఎవరిని? అనేదే మిగతా కథ.

ఇలాంటి భయానక, బీభత్స చిత్రాలకు ఓటీటీనే బెటర్ అని దర్శక నిర్మాతలు గ్రహించారు. ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ కోసం తీసినా, మనసు మార్చుకుని ఓటీటీకి ఇచ్చేశారు. దాంతో డైలాగ్స్ తో పాటు కొన్ని జుగుప్సకర సన్నివేశాలను యధేచ్ఛగా ఉంచేశారు. మర్డర్ మిస్టరీగా మొదలైన ఈ మూవీ చివరికి వచ్చేసరికీ సైకలాజికల్ థ్రిల్లర్ గా మారిపోయింది. అయితే… సంపత్ నంది రాసుకున్న కథ కన్వెన్సింగ్ గా తెర మీదకు తీసుకురావడంలో దర్శకుడు అశోక్ తేజ ఫెయిల్ అయ్యాడు. ఊరిలోని అమ్మాయిలను శోభనం మర్నాడే అతి దారుణంగా చంపేసేందుకు ఆ పాత్ర చెప్పే లాజిక్ చాలా బలహీనంగా ఉంది. తన ప్రవర్తనకు కారణం భార్య అని చెప్పడం వల్ల… ఆమె పాత్ర కూడా పలచన అయిపోయింది. దాంతో ఎవరికి వారు తాము చేసే పనిని సమర్థించుకున్నట్టు అయిపోయింది. హంతకుడు ఎవరు అనే విషయంలో సస్పెన్స్ ను మెయిన్ టైన్ చేయడం కోసం డైరెక్టర్ రెండుమూడు పాత్రలను అనుమానించేలా తీర్చిదిద్దాడు. సినిమా ప్రారంభంలో ఓదెల గ్రామ చరిత్రను తెలియచేస్తూ ఒగ్గుకథను పెట్టారు. దానివల్ల ఈ సినిమా కథకు అదనంగా ఒనగూడిందేమీ లేదు!

కెరీర్ ప్రారంభంలో ‘అలా ఎలా, కుమారి 21 ఎఫ్, ఈడోరకం ఆడోరకం’ వంటి సినిమాల్లో బబ్లీ గర్ల్ గా నటించిన హేబా పటేల్ ఇందులో పూర్తి స్థాయిలో డీ గ్లామర్ రోల్ చేసింది. అతి తక్కువ మేకప్ తో ఓ పల్లెటూరి అమ్మాయిలా కనిపించింది. ఆమె పాత్ర బలమైనదే అయినా… క్లయిమాక్స్ కు వచ్చే సరికీ ఆ పాత్రను కూడా కథకుడు డైల్యూట్ చేసేశాడు. ‘కేజీఎఫ్’తో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వశిష్ఠ సింహా… ‘నారప్ప’లో కీలక పాత్ర పోషించాడు. ఇందులోనూ ఓ భిన్నమైన పాత్రను సమర్థవంతంగా చేశాడు. ఐపీఎస్ అధికారిగా సాయిరోనక్, అతని భార్యగా పూజిత పొన్నాడ, ఎస్.ఐ.గా నాగమహేశ్‌ చేసిన యాక్టింగ్ బాగుంది. ఇతర ప్రధాన పాత్రలను సురేందర్ రెడ్డి, గగన్ విహారి, భూపాల్, ‘జబర్దస్త్’ అప్పారావు, దివ్య సైరస్, ప్రియా హెగ్డే తదితరులు పోషించారు. అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం, సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. రియల్ సతీశ్ యాక్షన్ సీన్స్ రియలిస్టిక్ గా ఉన్నాయి. సహజత్వానికి దగ్గరగా సినిమా తీయాలని దర్శకుడు ప్రయత్నించాడు. మూవీ నిడివి గం.1.35 నిమిషాలకే పరిమితం కావడం మంచిదయ్యింది. క్రైమ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి ఇది నచ్చే ఆస్కారం ఉంది. బట్… ఓటీటీలో వస్తోంది కదాని ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చూస్తే కాస్తంత ఇబ్బంది పడాల్సి వస్తుంది!

రేటింగ్: 2.25 / 5

ప్లస్ పాయింట్స్
సైకలాజికల్ థ్రిల్లర్ కావడం
నేచురాలిటీకి దగ్గర ఉండటం
సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం

మైనెస్ పాయింట్స్
బలహీనమైన కథ
కన్వెన్సింగ్ గా లేని సంఘటనలు
గ్రిప్పింగ్ లేని స్క్రీన్ ప్లే

ట్యాగ్ లైన్: సైకలాజికల్ థ్రిల్లర్!