NTV Telugu Site icon

Mukhachitram Movie Review Telugu : ముఖచిత్రం

Mukha Chitram

Mukha Chitram

Mukhachitram Movie Review Telugu : మన కంటి కనిపించేది మాత్రమే ఎప్పటికీ వాస్తవం కాదు! ఆదర్శ దంపతుల్లా అనిపించినంత మాత్రాన, కొందరిది అన్యోన్య దాంపత్యం అనుకోలేం! మనిషి లోపలి మనిషి గురించి తెలుసుకోవడం అంత సులభమూ కాదు! ఇదే అంశం మీద తెరకెక్కింది ‘ముఖచిత్రం’ సినిమా! ‘కలర్ ఫోటో’తో జాతీయ స్థాయిలో అవార్డును అందుకున్నదర్శకుడు సందీప్ రాజ్ ‘ముఖచిత్రం’కు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. ఎస్.కె.ఎన్. సమర్పణలో ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మించిన ఈ మూవీతో గంగాధర్ డైరెక్టర్ గా పరిచయమయ్యాడు.

ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ రాజ్ శేఖర్ (వికాశ్ వశిష్ట) లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మాదిరిగా మహతి (ప్రియ వడ్లమాని) అనే అమ్మాయి ఫోటో చూసి ప్రేమలో పడి, పెళ్ళి చేసేసుకుంటాడు. అయితే స్కూల్ డేస్ నుండే రాజ్ ను ప్రేమిస్తున్న రైటర్ మాయ (ఆయేషా ఖాన్)కు ఇది కంటగింపుగా మారుతుంది. ఆ టైమ్ లోనే మాయకు యాక్సిడెంట్ అయ్యి, ఆమె ఫేస్ డిఫామ్ అయిపోతుంది. సరిగ్గా అప్పుడే రాజ్ భార్య మహతి డాబా మీద నుండి పడి చనిపోతుంది. భార్య మరణంతో డీలా పడ్డ రాజశేఖర్ చివరకు గుండె దిటవు చేసుకుని, మహతి ముఖంతో మాయకు ప్లాస్టిక్ సర్జరీ చేస్తాడు. ఇదంతా చదువుతుంటే… కథను రివీల్ చేసేసిన ఫీలింగ్ కలిగే ఆస్కారం లేకపోలేదు. అయితే… మూవీ ట్రైలర్ లో ఈ విషయాలన్నీ డైరెక్టరే రివీల్ చేశాడు. ఎందుకంటే… ఇంతవరకూ జరిగిందంతా మనం గతంలో వచ్చిన కొన్ని సినిమాల్లో చూసిందే… కొన్ని కథలు, నవలల్లో చదివిందే! చిత్రం ఏమంటే… ఇలా ఒకరి ఫేస్ ను మరొకరికి మార్చిన తర్వాతే ఈ స్టోరీ ఊహించని ట్విస్ట్స్ అండ్ టర్న్స్ తీసుకుంటుంది. తనను ప్రేమించిన ప్రియురాలికి భార్య ముఖాన్ని అమర్చిన తర్వాత డాక్టర్ రాజశేఖర్ కు ఎదురైన అనుభవాలు ఏమిటీ!? తన ‘ముఖ చిత్రం’ మారిపోయిన తర్వాత మాయ చేసిన వింతలు, విచిత్రాలు ఏమిటీ!? వీరిద్దరూ కోర్టు తలుపు ఎందుకు తట్టారు!? అక్కడ ఎలాంటి తీర్పు వచ్చింది!? అనేదే అసలు కథ.

ఇందులో కథానుగుణంగా ప్రియా వడ్లమాని ఫస్ట్ హాఫ్ లో మహతిగా కనిపిస్తే, సెకండ్ హాఫ్‌ లో మాయగా మారిపోతుంది. ఆమెది డ్యుయల్ రోల్ కాకపోయినా… టోటల్ కాంట్రాస్ట్ ఉన్న రెండు పాత్రలను చేసింది. ప్రథమార్ధంలో మహతిగా ఆకట్టుకున్న ప్రియా, ద్వితీయార్థంలోనూ అంతే చక్కగా నటించి, మెప్పించింది. మాయ పాత్రతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయేషా ఖాన్ ముఖంలో అసూయ బాగానే కనిపించింది. ‘సినిమా బండి’తో నటుడిగా గుర్తింపు పొందిన వికాశ్ వశిష్ట ఇందులో ప్లాస్టిక్ సర్జన్ గా నటించాడు. అతని పాత్రలోని వేరియేషన్స్ ఇంట్రస్టింగా ఉన్నాయి. ఇక ఫ్రెండ్ గా నటించిన చైతన్య రావ్ తన ఇమేజ్ కు పూర్తి భిన్నమైన పాత్రను చేశాడు. ‘కలర్ ఫోటో’లో విలన్ గా కీలక పాత్ర పోషించిన సునీల్ సెంటిమెంట్ గా కావచ్చు, ఇందులో డాక్టర్ గా గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. ఇతర ప్రధాన పాత్రలను మీర్, శ్రుతి, తేజ కాకుమాను, స్రవంతి చొక్కారపు, రాఘవ, సత్తిపండు తదితరులు పోషించారు.

ఇదిలా ఉంటే… ఈ మూవీ ప్రీ-క్లయిమాక్స్ కోర్ట్ డ్రామాను రక్తి కట్టించింది మాత్రం ఇద్దరే ఇద్దరు! ఒకరు రవిశంకర్ కాగా, మరొకరు విశ్వక్ సేన్. ఈ మూవీలో విశ్వక్ సేన్ పాత్ర లేట్ ఎంట్రీ ఇచ్చినా… అతని క్యారెక్టర్ ను కథతో లింక్ చేసిన తీరు బాగుంది. సినిమా ప్రారంభం నుండి ఆ పాత్ర తాలుకు ఐడెంటిటీని ఇన్ డైరెక్ట్ గా చెబుతూనే ఎండ్ టైటిల్స్ కు ముందు రివీల్ చేసిన విధానం ఆకట్టుకుంది. బట్… రవిశంకర్ లాంటి జెగాంటిక్ పర్సనాలిటీని విశ్వక్ సేన్ కు పోటీగా పెట్టి ఉండాల్సింది కాదు! రవిశంకర్ ఆహార్యం, అభినయం ముందు విశ్వక్ సేన్ తేలిపోయాడు. అతని వాదన బేలగా, పీలగా అనిపించింది. దానికి తోడు రచయిత తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, దీటుగా కాకుండా ఓ లెక్చర్ రూపంలో ఇవ్వడంతో సీన్ సాగదీసినట్టు అయ్యింది.

సాంకేతిక నిపుణుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ గురించి. ఉన్నవి మూడు పాటలే అయినా… వాటి ట్యూన్స్, రీ-రికార్డింగ్ బాగున్నాయి. శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉంది. మూవీ రన్ టైమ్ ను ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్ కంట్రోల్ లో పెట్టిన విషయం అర్థమౌతోంది. రైటర్ సందీప్ రాజ్, డైరెక్టర్ గంగాధర్ తాము కన్వే చేయాలనుకున్న విషయాన్ని ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా ఆడియెన్స్ ముందు పెట్టారు. నిజం చెప్పాలంటే వైవాహిక అత్యాచారాన్ని మౌనంగా భరిస్తున్న మహిళలకు ఈ మూవీ క్లయిమాక్స్ గొప్ప ఊరటను ఇస్తుంది. అయితే… ఈ పాయింట్ కు ఎంతమంది కనెక్ట్ అవుతారన్నదే సందేహం! ఇలాంటి సినిమాలకు థియేటర్ కంటే ఓటీటీ రైట్ ప్లాట్‌ ఫామ్!!

రేటింగ్: 2.5 / 5

ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
ఊహకందని ట్విస్ట్స్
కాలభైరవ రీ-రికార్డింగ్

మైనెస్ పాయింట్స్
రొటీన్ గా సాగిన ప్రథమార్థం
తేలిపోయిన విశ్వక్ సేన్ పాత్ర
కథానుగుణమైన పరిమితులు

ట్యాగ్ లైన్: మృగాడు!