NTV Telugu Site icon

Mr. Bachchan Review: మిస్టర్ బచ్చన్ రివ్యూ

Mr Bachchan

Mr Bachchan

Mr. Bachchan Movie Review: రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. దానికి కారణం స్వతహాగా రవితేజ అమితాబ్ బచ్చన్ అభిమాని కావడం. అయితే సినిమా అనౌన్స్ చేసిన తర్వాత మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి సినిమా గురించి అనేక రకాల చర్చలు జరుగుతూ వచ్చాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అనేక అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం

మిస్టర్ బచ్చన్ సినిమా కథ:
బచ్చన్(రవితేజ) ఒక నిజాయితీ గల ఇన్కమ్ టాక్స్ అధికారి. ఒక పవర్ఫుల్ వ్యక్తి మీద ఇన్కమ్ టాక్స్ రైడ్ చేయడంతో సస్పెన్షన్ కి గురవుతాడు. సస్పెండ్ అయిన తర్వాత ఇంటికి వెళ్లి తాను ఇన్కమ్ టాక్స్ అధికారిగా సెలెక్ట్ అవ్వకముందు లానే హిందీ పాటల ఆర్కెస్ట్రాలో పని చేస్తూ ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవుతూ ఉంటాడు. ఇదే క్రమంలో ఆ ఊరి అమ్మాయి జిక్కి(భాగ్యశ్రీ)తో ప్రేమలో పడతాడు. ఈ విషయం ఇద్దరి ఇళ్లలో తెలిసిపోయి అరేంజ్డ్ మ్యారేజ్ కూడా ఫిక్స్ చేస్తారు. సరిగ్గా అదే సమయానికి సస్పెన్షన్ ఎత్తివేసి మరో పవర్ఫుల్ వ్యక్తి మీద ఇన్కమ్ టాక్స్ రైడ్ చేయాలని బచ్చన్ ను పిలిపిస్తారు పై అధికారులు. అలా బచ్చన్ ను పిలిపించిన పై అధికారులు ఎవరి ఇంటి మీద రైడ్ చేయించారు? నిజాయితీగల బచ్చన్ ఆ ఇంటి మీద రైడ్ చేసి ఎలా బయటపడ్డాడు? అసలు ఆ పవర్ ఫుల్ వ్యక్తి ఎవరు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన రైడ్ అనే సినిమాకి రీమేక్ అని మేకర్స్ లీకులు ఇచ్చారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే సినిమా పూర్తయిన తర్వాత మాత్రం రైడ్ నుంచి ఒక కీలక సన్నివేశం మాత్రమే తీసుకున్నామని మిగతాదంతా రవితేజ ఇమేజ్ కి, తెలుగు మార్కెట్ కి తగినట్లు మార్పులు చేర్పులు చేసామని చెబుతూ వచ్చారు. అయితే సినిమా ఓపెనింగ్ నుంచి కాస్త ఆసక్తికరంగా కథను నడిపించడంలో డైరెక్టర్ కొంతవరకు సఫలమయ్యాడు. నిజానికి హరీష్ శంకర్ గద్దలకొండ గణేష్ సినిమా చేసి చాలా కాలమైంది. ఆ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఎదురు చూశారు. హరీష్ శంకర్ మార్క్ డైలాగులు మాత్రం సినిమాలో మెండుగా ఉన్నాయి. అయితే ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే అసలు రవితేజకు ఈ బచ్చన్ అనే పేరు ఎందుకు వచ్చింది? బచ్చన్ క్యారెక్టర్ ఏంటి? జిక్కితో ప్రేమ, పెళ్లికి దారి తీసే పరిస్థితులు అంటూ సరదా సరదాగానే సాగిపోతుంది. మధ్యలో సత్య అండ్ బ్యాచ్ చేసే హడావుడితో సరదా సరదాగా సాగిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత ప్రేక్షకుల సహనానికి పరీక్ష ఏమో అన్నట్టుగా సినిమా సాగుతుంది. ఎందుకంటే ఒరిజినల్ సినిమాలో సినిమా ఓపెనింగ్ లోనే రైడ్ మొదలవుతుంది. కానీ ఈ తెలుగులో మాత్రం ఇంటర్వెల్ నుంచి రైడ్ మొదలైనట్లు చూపించారు. అయితే ఒకానొక దశలో ఈ రైడ్ సీన్స్ చూస్తే ప్రేక్షకులకు గతంలో చూసిన సినిమానే చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో రాసుకున్న కొన్ని కామెడీ ట్రాక్స్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు అనిపించింది. నిజానికి హరీష్ శంకర్ కామెడీ కూడా చాలా బాగా రాస్తాడని పేరుంది. గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం, మిరపకాయ, గద్దల కొండ గణేష్ లాంటి సినిమాలలో సైతం ఇలాంటి కామెడీ ట్రాక్స్ ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా విషయంలో కాస్త డబుల్ మీనింగ్ డోస్ ఎక్కువై కొన్ని కామెడీ సీన్స్ పట్టాలు తప్పి క్రింజ్ అనిపించేలా ఉన్నాయి. అయితే ఓవరాల్ గా సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా తీర్చిదిద్దడంలో హరీష్ శంకర్ పూర్తి స్థాయిలో సఫలమయ్యాడు అనలేం కానీ కొంతవరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. నిజానికి ఇదంతా ఒక కమర్షియల్ ఫార్మాట్ లో చేసిన సినిమా. లవ్ ట్రాక్, కామెడీ, ఫైట్లు, పాటలు ఇలా అన్ని సమపాళ్లలో రాసుకున్నారు కానీ పూర్తిస్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విషయంలో కాస్త తడబడ్డారు. కానీ ఈ సినిమాకి ఒకరకంగా ఏ సెంటర్ కంటే బీ,సీ సెంటర్ల ఆడియన్స్ కీలకం. వాళ్లకి ఇంత విశ్లేషించే ఓపిక ఉండదు సినిమా చూస్తున్నంత సేపు ఎంటర్టైన్ అయ్యామా లేదా అనేదే చూస్తారు. అలాంటి వాళ్లకు సినిమా ఎక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

నటీనటుల విషయానికి వస్తే బచ్చన్ అనే పాత్రలో రవితేజ ఎప్పటిలాగే తనదైన ఎనర్జీతో రెచ్చిపోయాడు. ముఖ్యంగా డాన్స్లు, ఫైట్లు అయితే ఒక రేంజ్ లో ఆడేసుకున్నాడు. భాగ్యశ్రీ తో కెమిస్ట్రీ కూడా తెరమీద భలే అందంగా కనిపించింది. భాగ్యశ్రీ కూడా తనదైన స్క్రీన్ ప్రజన్స్ తో రవితేజను కొన్నిచోట్ల డామినేట్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆమె డబ్బింగ్ కొన్నిచోట్ల పరవాలేదు అనిపించినా కొన్నిచోట్ల వేరే ఎవరితోనైనా చెప్పిస్తే బాగుండు అనిపించేలా ఉంది. అయితే రవితేజతో ఆమె చేసిన డాన్స్ మాత్రం ఒక రేంజ్ లో వర్కౌట్ అయింది. వీరిద్దరి కెమిస్ట్రీ సాంగ్స్ లో కూడా చూడముచ్చటగా అనిపించింది. సిద్దు జొన్నలగడ్డ పాత్ర ఇరికించినట్లే అనిపించినా ఉన్నంతలో కాసేపు థియేటర్లో ప్రేక్షకులను విజిల్స్ వేయించేలా చేసుకున్నాడు. మధ్యలో దేవి శ్రీ ప్రసాద్ కూడా ఒక పాటలో ఇలా వచ్చే అలా వెళ్ళిపోతాడు అనుకోండి. ఇక తనికెళ్ల భరణి, గౌతమి, సచిన్ కేడ్కర్, జగపతిబాబు సహా మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.. అయితే సత్య, ప్రవీణ్, సుదర్శన్, చంద్ర వంటి చాలామంది కమెడియన్లు ఉన్న ఎందుకో సత్య, చంద్రాలకే కామెడీ చేసే స్కోప్ దక్కింది. అన్నపూర్ణమ్మ కూడా సరదాగా కాసేపు నవ్వించింది. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే డైలాగ్ రైటర్ ఈసారి హరీష్ శంకర్ తో కలిసి పెద్ద రచ్చే చేశారు. చాలా డైలాగులు చాలామందికి తగిలేలా రాసుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే కొంత డబ్బులు మీనింగ్ డోస్ కూడా ఎక్కువ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక సినిమాటోగ్రఫీ భలే ఆసక్తికరంగా అనిపించింది. దాదాపు అన్ని ఫ్రేమ్స్ ని కలర్ఫుల్ గా చూపించడంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యాడు. మ్యూజిక్ గురించి చెప్పాల్సింది ఏముంది? పాటలు ఇప్పటికే చాట్ బస్టర్స్ అయ్యాయి. అవి స్క్రీన్ మీద కూడా ఎంతో అందంగా కనిపించాయి. అయితే నిడివి విషయంలో కొంత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి.

ఫైనల్లీ మిస్టర్ బచ్చన్ ఒక హానెస్ట్ ఆఫీసర్ కథ.. అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్తే కొందరికి కనెక్ట్ అవ్వచ్చు.

Show comments