NTV Telugu Site icon

రివ్యూ: మోనికా ఓ మై డార్లింగ్ (హిందీ)

Monica Oh My Darling1

Monica Oh My Darling1

‘బధాయ్ దో’, ‘హిట్’ చిత్రాలతో రాజ్ కుమార్ రావ్ కు ఈ యేడాది చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో అతని లేటెస్ట్ మూవీ ‘మోనికా… ఓ మై డార్లింగ్’ శుక్రవారం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. మరి ఈ థ్రిల్లింగ్ మర్డర్ మిస్టరీ ఎలా ఉందో తెలుసుకుందాం.

రోబోలను తయారు చేసే యూనికార్న్ కంపెనీలో ఓ హత్య జరుగుతుంది. అందుకు సెక్యూరిటీ చీఫ్‌ ను బాధ్యుడిని చేసి, ఉద్యోగం నుంచి తొలగిస్తారు. అందులో తన తప్పులేదని, ఎవరో కావాలని రోబోతో ఆ హత్య చేయించారని సెక్యూరిటీ చీఫ్‌ ఎంత మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోరు. ఇది జరిగిన ఆరు నెలలకు అదే కంపెనీలో పనిచేసే రోబోటిక్స్ ఎక్స్ పర్ట్ జయంత్ (రాజ్ కుమార్ రావ్) కు డైరెక్టర్ గా ప్రమోషన్ లభిస్తుంది. సి.ఇ.వో. సత్యనారాయణ అధికారి (విజయ్ కెంక్రే) కూతురు నిక్కీ (ఆకాంక్ష రంజన్ కపూర్)తో అప్పటికే జయంత్ ప్రేమాయణం సాగిస్తుంటాడు. ఇది సీఇవో కొడుకు నిషికాంత్ (సికిందర్ ఖేర్)కు ఏ మాత్రం ఇష్టం ఉండదు. ఇదిలా ఉంటే… అప్పటికే జయంత్ కు అదే కంపెనీలోని సీఇవో పర్శనల్ సెక్రటరీ మోనికా (హుమా ఖురేషీ)తో అక్రమ సంబంధం ఉంటుంది. అతని వల్ల తాను తల్లిని కాబోతున్నానని మోనికా చెప్పగా, జయంత్ షాక్ కు గురవుతాడు. నిక్కీతో పెళ్ళికి తాను అడ్డురానని, అడిగినప్పుడల్లా తనకు డబ్బులు ఇస్తుండమని మోనికా బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఇదే సమయంలో తనలానే నిషికాంత్, అక్కౌంట్స్ డిపార్ట్ మెంట్ లోని అరవింద్ (భగవతి పెరుమాళ్‌) సైతం మోనికా ట్రాప్ లో చిక్కుకుని, బ్లాక్ మెయిల్ కు గురవుతున్న విషయం జయంత్ కు తెలుస్తోంది. ఈ ముగ్గురూ కలిసి ఆమెను హతమార్చడానికి పక్కా ప్రణాళిక సిద్థం చేస్తారు. కానీ వీళ్ళ ప్లాన్ బెడిసి కొడుతుంది. మోనిక కాకుండా నిషికాంత్ హత్యకు గురవుతాడు. అంతేకాదు… కంపెనీకి చెందిన ఉన్నతాధికారులు ఒకరి తర్వాత ఒకరు అనమానస్పద పరిస్థితులలో ప్రాణాలు కోల్పోతారు. ఈ మొత్తం హత్యల వెనుక ఉన్నది ఎవరు? రోబోతో చేయించిన మొదటి హత్యకు వీటికీ ఏమిటి సంబంధం? మనుషులు రోబోలను కంట్రోల్ చేసినట్టుగా, మనుషులనే రోబోలుగా మార్చి కంట్రోల్ చేస్తోంది.. ఎవరు? ఈ మొత్తం వ్యవహారంలో ఇన్వెస్టిగేషన్ అధికారిణి ఎసీపీ నాయుడు (రాధికా ఆప్టే) పాత్ర ఏమిటీ? అనేదే మిగతా సినిమా!

కార్పొరేట్ రంగంలోని కుట్రలు కుతంత్రాలు, అక్రమ సంబంధాలు, ప్రతి మనిషిలో ఉండే గ్రే షేడ్స్… ఇవన్నీ మిళితమైతే ఎలాంటి ఘోర పరిణామాలు చోటు చేసుకుంటాయన్నదే ‘మోనికా ఓ మై డార్లింగ్’. ఓ సాధారణ పల్లెటూరి నుండి, ఏదో సాధించాలనే కసితో కార్పొరేట్‌ వరల్డ్ లోకి అడుగుపెట్టిన ఐఐటీ గ్రాడ్యుయేట్ జీవితాన్ని ఇందులో చూపించారు. ఆశ, అత్యాశ, దురాశ, నిరాశ మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇందులో మనం చూడొచ్చు. నెట్ ఫ్లిక్స్ తో కలిసి దీన్ని సంజయ్ రౌత్రే, సరితా పాటిల్ నిర్మించారు. ఓటీటీ విడుదల కాబట్టి యదేశ్చగా బూతు పదాలను వాడేశారు. అక్రమ సంబంధాల వంకతో అవసరం లేకున్నా ఒకటి రెండు శృంగార సన్నివేశాలను పెట్టేశారు! వాటిని పరిహరరించి ఉంటే ఈ థ్రిల్లర్ మూవీని ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయొచ్చు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ కథ గ్రిప్సింగ్ తో సాగింది. అయితే అసలు కారకులు ఎవరనే విషయాన్ని చాలా క్యాజువల్ గా ఎసీపీ నాయుడు పాత్రతో చెప్పించడం నిరాశకు గురిచేస్తుంది. ఇక చివరి షాట్ లో ఏం జరిగిందనేది వ్యూవర్స్ థాట్ కే వదిలేశారు.

‘అంధాధూన్’ చిత్ర రచయితల్లో ఒకరైన యోగేశ్‌ చంద్ కర్ ఓ జపాన్ నవల ఆధారంగా ఈ కథను రాశాడు. దాన్ని బాగానే ఇండియనైజ్ చేశాడు. అయితే శ్రీరామ్ రాఘవ ‘అంధాధూన్’ను చూసిన కళ్ళతో దీన్ని చూస్తే అంతగా నచ్చదు. ఆయన టీమే ఈ సినిమాకూ పనిచేసింది కాబట్టి శ్రీరామ్ రాఘవ మూవీస్ తో దీనిని పోల్చుకోవడం కామన్! ఓల్డ్ మూవీ ‘మోనికా ఓ మై డార్లింగ్’ కోసం ఆర్.డి. బర్మన్ స్వరపరిచిన ‘పియా తూ అబ్ తో ఆజా’ అనే గీతాన్ని సినిమా అంతటా తమకు కావాల్సినట్టుగా దర్శకుడు వాడేశాడు, మూవీ టైటిల్ తో సహా! నటీనటుల విషయానికి వస్తే… రాజ్ కుమార్ రావ్ కు మరోసారి తన సత్తాను చాటుకునే ఛాన్స్ లభించింది. అయితే ప్రధమార్థంలో ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యం ద్వితీయార్థంకు వచ్చేసరికీ తగ్గిపోయింది. ఇక తమిళ డబ్బింగ్ సినిమాలు ‘కాలా’, ‘వాలిమై’ తో తెలుగు వారికీ సుపరిచితురాలైన హుమా ఖురేష్ ఇందులో మోనికగా అత్యద్భుతమైన నటన ప్రదర్శించింది. పలు తెలుగు చిత్రాలలో నటించిన రాధికా ఆప్టే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఎసీపీ నాయుడుగా యాక్ట్ చేసింది. చూయింగ్ గమ్ నములుతూ కామెడీ చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె కాస్తంత కొత్తగా అనిపించింది. ఇతర ప్రధాన పాత్రలను విజయ్ కెంక్రే, సికిందర్ ఖేర్, సుకాంత్ గోయల్, ఆకాంక్ష రంజన్ కపూర్, భగవతి పెరుమాళ్ తదితరులు పోషించారు. దర్శకుడు వాసన్ బాలా తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ చూసి భారీ అంచనాలు పెట్టుకున్న వారికి కొంత నిరాశ తప్పదు. అయితే మర్డర్ మిస్టరీలను, థ్రిల్లర్ మూవీస్ ను ఇష్టపడే వారికి ‘మోనికా… ఓ మై డార్లింగ్’ నచ్చే ఆస్కారం ఉంది.

రేటింగ్: 2.5/ 5

ప్లస్ పాయింట్స్
డిఫరెంట్ స్టోరీ లైన్
ఆకట్టుకునే స్క్రీన్ ప్లే
నటీనటుల నటన

మైనెస్ పాయింట్స్
క్యారెక్టరైజేషన్ సరికా లేకపోవడం
బలమైన రీజన్ లేని మర్డర్స్
తేలిపోయిన క్లయిమాక్స్

ట్యాగ్ లైన్: మోనికాస్ ట్రాప్!