NTV Telugu Site icon

Mister King Movie Review: మిస్టర్ కింగ్ మూవీ రివ్యూ

Mister King

Mister King

టాలీవుడ్ లో వారసులకు కొదవలేదు. తాజాగా ఈ జాబితాలోకి శరణ్‌ కుమార్ వచ్చి చేరాడు. ప్రముఖ నటి, దర్శక నిర్మాత విజయ నిర్మలకి ఇతను మనవడు. సీనియర్ నటుడు నరేశ్ కజిన్ రాజ్ కుమార్ కు కొడుకు. శరన్‌ కుమార్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ బి. ఎన్. రావు నిర్మించిన సినిమా ‘మిస్టర్ కింగ్’. ఈ మూవీతో శశిధర్‌ చావలి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.

కొత్త హీరోతో సినిమా అంటే ఎవరైనా లవ్ స్టోరీని తీసుకుంటారు. లేదంటే అతనిలోని టాలెంట్ మొత్తాన్ని బయటపెట్టేలా యాక్షన్ ఎంటర్ టైనర్ ను ఎంచుకుంటారు. కానీ డెబ్యూ డైరెక్టర్ శశిధర్ అందుకు భిన్నంగా ఫ్యామిలీ డ్రామాను తీసుకున్నాడు. దానికో లవ్ స్టోరీని యాడ్ చేశాడు. మైండ్ గేమ్ తో మూవీని ప్రారంభించి, దానితోనే ముగించాడు. కథగా చెప్పుకోవాలంటే… ఇది కాస్తంత కాంప్లికేటెడ్ స్టోరీనే!

శివరామరాజు (శ్రీనివాస్ బోగిరెడ్డి), సీతారామరాజు (మురళీ శర్మ) అన్నదమ్ములు. చెస్ ప్లేయర్ అయిన సీతారామరాజు తిమ్మిని బమ్మిని చేయగల నేర్పరి. ఎదుటివారి ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో దిట్ట. తల్లి కన్నుమూస్తున్న సమయంలో కుట్ర చేసి ఆమె ఆస్తి మొత్తాన్ని సొంతం చేసుకుంటాడు. అందుకోసం తన కూతురుకి ఉమాదేవి (యశ్విక నిష్కల) అని తల్లిపేరే పెడతాడు. సీతారామరాజు సోదరుడు శివరామరాజుకు వెన్నెల (ఊర్వీ సింగ్) అనే కూతురుంటుంది. ఇక హీరో శివ ఇంజనీరింగ్ చేసి, ఆర్జేగా పనిచేస్తుంటాడు. ‘ప్రాజెక్ట్ వాయు’ అనేది అతనికి లైఫ్ టైమ్ డ్రీమ్! శివ పక్కింట్లోనే ఉండే వెన్నెల ఆమె సోదరి ఉమాదేవి అతని వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయి ప్రేమలో పడతారు. కూతురు ఉమాదేవి.. శివను ప్రేమించడాన్ని తట్టుకోలేని సీతారామరాజు వారికి చెక్ పెట్టడానికి వెన్నెలను పావుగా వాడుకుంటాడు. సీతారామరాజు ఆడిన మైండ్ గేమ్ ను శివ ఎలా ఎదుర్కొన్నాడు? ‘ప్రాజెక్ట్ వాయు’ను సక్సెస్ చేయడంతో పాటు ఉమాదేవి ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అనేది మిగతా కథ.

ఇవాళ్టి జనరేషన్ కు దేనిమీద, ఎందుకు ఫోకస్ పెట్టాలనే విషయంలో క్లారిటీ లేదు. పేరెంట్స్ చదివిస్తున్నారని ఇంజనీరింగ్ చేసే వాళ్ళే మనకు లక్షల్లో కనిపిస్తుంటారు. ఆ తర్వాత దానికి ఏమాత్రం సంబంధం లేని ఏదో ఒక జాబ్ లో సెటిల్ అయిపోయి జీవితాన్ని నిస్సారంగా గడిపేస్తుంటారు. కనీసం నచ్చిన పని చేయడానికి కూడా వీళ్ళు కష్టపడరు. అలాంటి కుర్రాళ్ళకు పూర్తి భిన్నమైన క్యారెక్టర్ ఇందులో శివది. ఓ రకంగా చెప్పాలంటే… ఈ మధ్య కాలంలో హీరో క్యారెక్టరైజేషన్ ను ఇంత నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా ఇటీవల ఏ సినిమాలోనూ చూపించలేదు. స్ట్రయిట్ ఫార్వర్డ్ గా ఉండే శివకు బోలెడన్ని కష్టాలు ఎదురవుతాయి. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఇటు కెరీర్ పరంగా, అటు లవ్ పరంగా అతను ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడనే దాన్ని వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం డైరెక్టర్ శశిధర్ చేశాడు. బట్… ఏ సీన్ కు ఆ సీన్ ఆకట్టుకునేలా ఉంది తప్పితే, ఓవర్ ఆల్ గా చూసినప్పుడు మూవీ చాలా ఫ్లాట్ గా సాగిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. తెర మీద కనిపించే ఎమోషన్స్ కు ఆడియెన్ కనెక్ట్ అయ్యే పరిస్థితి లేదు.

నటీనటుల విషయానికి వస్తే… శరణ్ నటనలో ఇంకా పరిపక్వత రావాలి. ఇప్పటికే ఒకటి రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి కాబట్టి మెరుగయ్యే ఛాన్స్ ఉంది. హీరోయిన్స్ యశ్విక, ఊర్వీసింగ్ నటన కూడా పెద్దంత గొప్పగా లేదు. సీనియర్ యాక్టర్ మురళీశర్మ పాత్ర చుట్టూనే ఈ సినిమా కథ తిరుగుతుంది. ఆయన వరకూ బాగానే చేశాడు. కానీ ఆ పాత్రను మరింత బాగా మలిచి ఉండాల్సింది. భరణీ పోషించిన లెక్చరర్ పాత్ర, ఆయన నటన బాగున్నాయి. హీరో శరణ్‌ తండ్రి రాజ్ కుమార్ ఇందులోనూ హీరో తండ్రిగానే నటించాడు. నటనలో పెద్దంత అనుభవం లేకపోయినా బాగానే చేశారు. ఇక ఇతర పాత్రధారుల విషయానికి వస్తే… సునీల్ ను కథ నడపడానికి, ఓ పాటకూ ఉపయోగించుకున్నారు. ‘వెన్నెల’ కిశోర్ తో కొంత వినోదాన్ని పండించే ప్రయత్నం చేశారు.

ఇతర పాత్రలను శ్రీనివాస్ బోగిరెడ్డి, మిర్చి కిరణ్, జబర్దస్త్ ఫణి, ఐడ్రీమ్ అంజలి, శ్రీనిధి, శ్వేత, రోషన్ రెడ్డి తదితరులు పోషించారు. ఎస్.ఎస్. కాంచి అండ్ టీమ్ తో చేయించిన కామెడీ పెద్దంత పండలేదు. రచయితలు ఆకెళ్ళ రాఘవేంద్ర, జోశ్యుల సూర్యప్రకాశ్ అతిథి పాత్రల్లో మెరిశారు. సంగీత దర్శకుడు మణిశర్మ పేరు చూసి అంచనాలు పెట్టుకుంటే నిరాశకు గురికాక తప్పదు. తన్వీర్ అన్జుమ్ సినిమాటోగ్రఫీ ఓకే. స్క్రీన్ ప్లే గొప్పగా లేకపోయినా… డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఆత్మాభిమానం ఉన్న కుర్రాడి కథను రైటర్ కమ్ డైరెక్టర్ బాగానే రాసుకున్నాడు. బట్… దాన్ని ఇంట్రెస్టింగా ప్రెజెంట్ చేయలేకపోయాడు. డబ్బులు, సమయమూ వెచ్చించి థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుడిని సీటుకు కట్టిపడేసే సీన్స్ లేకపోవడమే ‘మిస్టర్ కింగ్’లోని మెయిన్ డ్రాబ్యాక్!

ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథ
సీనియర్స్ నటన
అలరించే సంభాషణలు

మైనస్ పాయింట్స్
ఆసక్తి కలిగించని స్క్రీన్ ప్లే
ఆకట్టుకోని సంగీతం

ట్యాగ్ లైన్: కాంప్లికేటెడ్ కింగ్

Show comments