ప్రముఖ హీరో నాని సోదరి దీప్తి ఘంటా దర్శకత్వంలో రూపొందిన ఐదు లఘు చిత్రాల సమాహారం ‘Meet-Cute’. అసలు ‘మీట్ క్యూట్’ అంటేనే ఇద్దరు వ్యక్తులు కొత్తగా కలుసుకున్నా, ఎంతో అనుబంధం ఉన్నవారిలా అనుభవాలను పంచుకోవడం అని అర్థం. అదే తీరున ఐదు కథలనూ రూపొందించి తెరకెక్కించారు. ‘సోనీ లైవ్’లో ఈ ఆంథాలజీ నవంబర్ 25 నుండి ప్రసారమవుతోంది.
ఇందులో మొదటి కథ ‘Meet the Boy’లో ఎమ్.బి.ఏ. చదవాలనుకున్న అమ్మాయి తల్లి బలవంతం మీద పెళ్ళిచూపులకు వెళ్ళడం ఓ డీల్ కుదుర్చుకోవడం ప్రధానాంశం. రెండో కథ ‘Old is Gold”లో ఓ అమ్మాయికి పాస్ట్ పోర్ట్ ఆఫీస్ లో ఓ ముసలాయనతో పరిచయం ఏర్పడుతుంది. ఆయనతో మాటామంతీ కలిపాక జీవితపు అసలు రహస్యం తెలుసుకొని ఆనందంగా వెళ్తుంది. మూడో కథ ‘In L(aw)ove’లో ఓ తల్లి తన తనయుడు ఓ అమ్మాయిని ఓ డాగ్ కేర్ హౌజ్ లో దించడం చూస్తుంది. అక్కడకు వెళ్ళి అమ్మాయితో పరిచయం చేసుకొని, ముచ్చట్లు చెబుతుంది. చివరకు ఆ అమ్మాయిని తన కోడలుగా ఆహ్వానిస్తుంది. ఇక నాలుగో కథ ‘Star Struck’ అవార్డు ఫంక్షన్ కు వెళ్తూన్న అందాల తార షాలిని కారు వర్షం రాత్రి మధ్య దారిలో ఆగిపోతుంది. అమన్ లిఫ్ట్ ఇస్తాడు. నిశ్శబ్దాన్ని అనుభవించడం, మాట్లాడినంత ఆనందంగా ఉంటుందని అన్న అమన్ మాటలు షాలిని మదిలో నిలుపుకొని వెళ్తుంది. ఇక్కడి దాకా బాగానే సాగిన ఈ ఆంథాలజీ, చివరి కథ ‘Ex-Girlfriend’లో మాత్రం ఓ ఆత్మ వచ్చి, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ భార్యతో మాట కలుపుతుంది. అతని గొప్పతనం చెప్పి మాయమవడంతో ముగుస్తుంది.
కథలు పాతగానే అనిపిస్తాయి. కానీ, ప్రతి కథలోనూ వైవిధ్యం ప్రదర్శించే ప్రయత్నం చేశారు. మొదటి కథలో “ఇప్పటికీ ప్రేమగ ఉంటా… ఎప్పటిలా గౌరవమిస్తా…” అంటూ సాగే పాట అలరిస్తుంది. మూడో కథలో “పిల్లోడే పాపం ఇది అనుకుంటే… అమ్మో కావ్యాలే నడిపేటంత ఎదిగాడా…” అనే పదాలతో ఉన్న పాట కూడా ఆకట్టుకుంటుంది. సరదాగా చూడటానికి ఈ ‘మీట్-క్యూట్’లోకి వెళ్తే, కొన్ని అంశాలయినా మన జీవితాల్లోనివీ కనిపిస్తాయి. దీప్తి ఘంటా ఈ ప్రయత్నంలోనే తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్నారు. ఆమె ప్రయత్నానికి తగ్గట్టుగానే నిర్మాతలు ఖర్చు చేశారు.
ప్లస్ పాయింట్స్:
– దర్శకత్వ ప్రతిభ
– మేకింగ్ వేల్యూస్
– నటీనటుల అభినయం
మైనస్ పాయింట్స్:
– కథల్లో కొత్తదనం లేకపోవడం
– సాగదీసినట్టుగా ఉన్న కొన్ని సన్నివేశాలు
రేటింగ్: 2.75/5
ట్యాగ్ టైన్: మిక్స్డ్ స్వీట్!