NTV Telugu Site icon

Macherla Niyojakavargam Movie Review : మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం రివ్యూ

Macharla Niyajikavragam Review

Macharla Niyajikavragam Review

గ‌త సంవ‌త్స‌రం మూడు చిత్రాల‌తో సంద‌డి చేసిన నితిన్ ఈ యేడాది `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`తో జ‌నం ముందుకు వ‌చ్చాడు. “భీష్మ‌, రంగ్ దే“ త‌రువాత నితిన్ మ‌ళ్ళీ స‌క్సెస్ రూటులో సాగుతున్నాడు. ఈ నేప‌థ్యంలో విడుద‌లైన సినిమా కావ‌డంతో `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం` చిత్రానికి ముందు నుంచీ బ‌జ్ నెల‌కొంది. అదీగాక నితిన్ ను ఎన్నో ఏళ్ళ త‌రువాత విజ‌య‌ప‌థంలో నిలిపింది గ‌తంలో ఆయ‌న తండ్రి, సోద‌రి నిర్మించిన చిత్రాలే. ఈ సినిమాకు కూడా నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి, సోద‌రి నికితా రెడ్డి నిర్మాత‌లు కావ‌డంతో జ‌నాల్లో మ‌రింత ఆస‌క్తి నెల‌కొంది. అందువ‌ల్ల `మాచర్ల నియోజ‌క‌వ‌ర్గం`పై చిత్ర‌సీమ‌లోనూ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఇక క‌థ విష‌యానికి వ‌స్తే- మూడు ద‌శాబ్దాల క్రితం త‌న తండ్రి చ‌నిపోవ‌డంతో రాజ‌ప్ప (స‌ముతిర క‌ని) బై ఎల‌క్ష‌న్స్ లో గెలుస్తాడు. అక్క‌డ నుండి ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేసి, తానే ఏక‌గ్రీవంగా ఎన్నిక‌వుతాడు. అప్ప‌టి నుండి అక్క‌డ అత‌నిదే రాజ్యం. మ‌రో వ్య‌క్తి పోటీ చేసే ప్ర‌స‌క్తే లేదు. అలాంటి ఓ నియంత నియోజ‌క‌వ‌ర్గంలో కొత్త‌గా క‌లెక్ట‌ర్ అయిన సిద్దార్థ్ రెడ్డి ఎలా ఎన్నిక‌లు జ‌రిపించాడు? అందుకు ఎలాంటి ఎత్తులు వేశాడ‌న్న‌దే ఈ చిత్ర క‌థ‌.
చిన్న పాయింట్ ను, ఒకే ఒక్క థ్రిల్లింగ్ ఎలిమెంట్ ను ద‌ర్శ‌కుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి బేస్ గా తీసుకుని ఈ సినిమాను తెర‌కెక్కించాడు. దాంతో ప్ర‌థ‌మార్ధం అంతా హీరోయిన్ల‌తో రొమాన్స్ తో గ‌డిపేశాడు. అందుకోసం అవ‌స‌రం లేక‌పోయినా నిధి (కేథ‌రిన్) పాత్ర‌ను పెట్టుకున్నాడు, అలానే స్వాతి (కృతిశెట్టి)ని మాచ‌ర్ల నుండి వైజాగ్ ర‌ప్పించాడు. అక్క‌డ ఫ‌స్ట్ హాఫ్ అయిన త‌ర్వాత అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. హీరోహీరోయిన్ల ప్రేమాయ‌ణం, రాజ‌ప్ప ను సిద్ధార్థ్ రెడ్డి ఎదుర్కొవ‌డంలో ఎలాంటి కొత్త‌ద‌నం లేదు. దాంతో సినిమా చూస్తున్నంత సేపు పాత సినిమాల్లో స‌న్నివేశాలు ఫ్రెష్ గా తీసిన‌ట్టు ఉన్నాయి త‌ప్పితే ఏదీ థ్రిల్లింగ్ క‌లిగ‌చ‌ని ప‌రిస్థితి. ఇంత చిన్న పాయింట్ ను బేస్ చేసుకుని ద‌ర్శ‌కుడు ఇంత సినిమా ఎలా? ఎందుకు చేశాడ‌నిపిస్తుంది. పైగా క్యారెక్ట‌రైజేష‌న్స్ విష‌యంలోనూ ద‌ర్శ‌కుడు ఎలాంటి శ్ర‌ద్ధ పెట్ట‌లేదు. ఉదాహ‌ర‌ణ‌కు హీరోని వెతుక్కుంటూ వైజాగ్ నుండి మాచ‌ర్ల వ‌చ్చే అతని త‌ల్లిదండ్రులు, ప్రియురాలు నిధి ఉన్న‌ట్టుండి అంత‌ర్థాన‌మైపోతారు. అలానే తన అన్న హ‌త్య‌కు ప్ర‌తీకారంగా ఎలాగైనా మాచ‌ర్ల‌లో ఎన్నిక‌లు జ‌రిగాల‌ని ప్ర‌భుత్వ అధికారుల‌ను క‌లిసి, ఓ క‌ద‌లిక తెచ్చే స్వాతి… జాత‌ర అంటే త‌న‌కు భ‌యం అని చెప్ప‌డం మ‌రీ కామెడీగా ఉంది. రెడ్డీ పాట చివ‌ర‌లో `రాను రానంటూనే చిన్న‌దో` అనే ప‌ల్ల‌విని జ‌త చేయ‌డం కోసం ఆమెతో ఆ డైలాగ్స్ పెట్టార‌నిపిస్తుంది. ఇలాంటివి చాలనే పొర‌పాట్లు ఉన్నాయి.

ప్ర‌థ‌మార్ధంలోని పాట‌లు పెద్దంత‌గా లేవు. అయితే ద్వితీయార్థంలోని పాట‌లు కాస్తంత మెరుగు. అంజ‌లి ఐట‌మ్ సాంగ్, క్ల‌యిమాక్స్ ముందు వ‌చ్చే పాట‌కు థియేట‌ర్ల‌లో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సంగీత ద‌ర్శ‌కుడు మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ బాణీల్లో అక్క‌డ‌క్క‌డా ఆయ‌న తండ్రి మ‌ణిశ‌ర్మ పోక‌డ‌లు క‌నిపించ‌క పోవు. ప్ర‌సాద్ మూరెళ్ళ సినిమాటోగ్ర‌ఫిలో కొన్ని సీన్స్ లో గ్రామ‌ర్ ను బాగానే ఫాలో అయినా, మ‌రికొన్ని చోట్ల అది క‌నిపించ‌దు. గ‌తంలో ప‌లు చిత్రాల‌కు ఎడిట‌ర్ గా ప‌నిచేసిన అనుభ‌వంతో ద‌ర్శ‌కుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి కొన్ని స‌న్నివేశాల‌ను ప‌ట్టుతోనే సాగేలా చేశారు. నితిన్ త‌న పాత్ర‌ను ర‌క్తి క‌ట్టించేందుకు కృషి చేశార‌నే చెప్పొచ్చు. కృతి శెట్టి బ‌దులు ఇందులో కేథ‌రిన్ తో గ్లామ‌ర్ పండించే ప‌ని చేశారు. స‌ముతిర క‌ని పాత్ర‌కు సంబంధించిన ఓ స‌ర్ ప్రైజ్ అయితే ఉంది. అది రివీల్ చేస్తే… ఉన్న ఒక్క థ్రిల్లింగ్ ఎలిమెంట్ గురించి చెప్పేసిన‌ట్టు అవుతుంది. యాక్ష‌న్ మూవీస్ ను ఇష్ట‌ప‌డే వారికి, నితిన్ అభిమానుల‌కు ఈ సినిమా ఓ మేర‌కు న‌చ్చ‌వ‌చ్చేమో… కానీ మిగిలిన వారికి ఇది న‌చ్చే ఆస్కారం లేదు.

ప్ల‌స్ పాయింట్స్:
– నితిన్ , కృతి శెట్టి జోడీ
– అల‌రించిన సంగీతం
– ఆక‌ట్టుకునే యాక్ష‌న్ పార్ట్

మైన‌స్ పాయింట్స్:
– బ‌ల‌మైన క‌థ లేక‌పోవ‌డం
– నీర‌సంగా సాగే క‌థ‌నం
– కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం

రేటింగ్: 2.25 /5
ట్యాగ్ లైన్: డిపాజిట్లు క‌ష్ట‌మే!

Show comments