NTV Telugu Site icon

Maa Nanna Superhero Review: మా నాన్న సూపర్ హీరో సినిమా రివ్యూ.. సుధీర్ బాబు హిట్ కొట్టాడా?

Ma Nanna Super Hero

Ma Nanna Super Hero

Maa Nanna Superhero Review in Telugu: సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన పోసాని సుధీర్ బాబు తనదైన శైలిలో సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఒకపక్క మాస్ మసాలా సినిమాలు చేస్తూనే మరో పక్క ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన మా నాన్న సూపర్ హీరో అనే ఒక సినిమా చేశాడు. లూజర్ వెబ్ సిరీస్ డైరెక్టర్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది వీ సెల్యులాయిడ్ బ్యానర్ మీద సునీల్ బలుసు నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. టీజర్, ట్రైలర్ తో ఒక మంచి ఎమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చేందుకు వస్తున్నామని ముందు నుంచి మేకర్స్ చెబుతూ వచ్చారు. అలాంటి సినిమాకి రెండు రోజులు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

మా నాన్న సూపర్ హీరో కథ:
తన కొడుకుని బాగా పెంచాలంటే కొద్ది రోజులు దూరంగా ఉండాల్సి రావడంతో ఒక అనాధ ఆశ్రమంలో వదిలి వెళ్తాడు ప్రకాష్( సాయిచంద్ త్రిపురనేని). అనుకోకుండా పాతికేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి రావడంతో కొడుక్కి దూరమైపోతాడు. మరోపక్క అదే కొడుకు జానీ(సుధీర్ బాబు)ను ఒక బిజినెస్ మాన్ అయిన శ్రీనివాస్(శాయాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. అయితే దత్తత తీసుకున్న తర్వాత తనకు దురదృష్టం మొదలయిందని భావించి జానీని చాలా నీచంగా చూస్తూ ఉంటాడు శ్రీనివాస్. అయితే తన కన్న తండ్రి అనాధాశ్రమంలో వదిలి వెళితే శ్రీనివాస్ బయటకు తీసుకొచ్చి ప్రేమగా చూసుకున్నాడని భావిస్తూ ఉండే జానీ తండ్రి ఎన్ని మాటలు అన్నా అతనంటే పంచప్రాణాలు పెట్టుకుని అతను చేసే అప్పులన్నీ తీరుస్తూ వస్తాడు. అనూహ్యంగా ఒకానొక సందర్భంలో 20 రోజుల్లో కోటి రూపాయలు లోకల్ లీడర్ కి కట్టాల్సి వస్తుంది. అప్పుడు అసలు జానీ ఏం చేశాడు? జానీ అసలు తండ్రి ఎందుకు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది? చివరికి తన కన్న తండ్రిని జానీ కలిశాడా? ఎంతో ప్రాణంగా ప్రేమించే తన పెంపుడు తండ్రిని ఇబ్బందుల నుంచి బయటపడేశాడా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ
సాధారణంగా సినిమాలో లవ్ స్టోరీ అనగానే హీరో హీరోయిన్ల మధ్యనే అనుకుంటాం. కానీ ఈ సినిమా విషయంలో కాస్త భిన్నంగా ఆలోచించాడు దర్శకుడు. నిజానికి అమ్మ ప్రేమ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. నాన్న ప్రేమ నేపథ్యంలో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ ఈ నాన్న ప్రేమలో కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. గతంలో లూజర్ అనే వెబ్ సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న అభిలాష్ మొదటి సినిమాని ఏదో కమర్షియల్ ఫార్మాట్లో కాకుండా తనదైన శైలిలో ప్రేక్షకులు గుండెలను హత్తుకునే విధంగా ఒక కథ చెప్పే ప్రయత్నం చేశాడు. మా నాన్న సూపర్ హీరో అనేది ఇద్దరు తండ్రులు ఓ కొడుకు మధ్య సాగే ఒక ఆసక్తికరమైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ. తన కొడుకుని చిన్నప్పుడే దూరం చేసుకుని ఎలా అయినా అతని కలవాలని ప్రయత్నం చేసే ఓ తండ్రి, అనాధాశ్రమం నుంచి ఆ కుర్రాడిని తెచ్చి ప్రేమగా పెంచి నష్టాల వల్ల అతని మీద మనసు విరిగిపోయిన మరో తండ్రి. చిన్ననాడే తనను కన్న తండ్రి వదిలేస్తే ఎంతో ప్రేమగా పెంచుకునే తండ్రి వ్యాపారంలో నష్టాల వల్ల తనను ఎన్ని మాటలు అంటున్నా అతన్ని కంటికి రెప్పలా కాచుకునే ఒక కొడుకు. ఇలా ఒక ఆసక్తికరమైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఈ సినిమా. తన కన్న కొడుకు కోసం ప్రకాష్ వెతుక్కుంటూ రావడంతో అసలు కథ మొదలవుతుంది. చిన్నప్పుడు విడిపోయిన తండ్రి కొడుకులు ఎలా కలుసుకుంటారా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సమయంలోనే కోటిన్నర రూపాయల లాటరీ టికెట్ అనే మరొక ఆసక్తికరమైన ఎలిమెంట్ తో కథ మరో మలుపు తీసుకుంటుంది. ఆ తండ్రి తన కొడుకుని చేరుకున్నాడా? తనను అసహ్యించుకునే తండ్రిని కూడా ప్రేమించేలా కొడుకు ఎలా చేసుకున్నాడు? లాంటి విషయాలను చాలా కన్విన్సింగ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఒకరకంగా చెప్పాలంటే ఇలాంటి కథను ఎంచుకోవడమే పెద్ద సాహసం. అటు హీరో కానీ ఇటు నిర్మాత కానీ దర్శకుడు చెప్పిన పాయింట్ని నమ్మి చేయడమే విజయానికి మొదటి మెట్టు అని చెప్పొచ్చు. ఏదో మెలో డ్రామా నడిపిస్తున్నట్లు కాకుండా నిజంగానే మన జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే మనం ఎలా బిహేవ్ చేస్తామో సినిమాలోని పాత్రలు కూడా అలానే బిహేవ్ చేస్తూ ఉండడం కొసమెరుపు. ఒక రకంగా కళ్ళతోనే ఎమోషన్స్ పండిస్తూ సీన్స్ రాసుకున్నాడు డైరెక్టర్ అభిలాష్, వాటిని అంతే ఈజ్ తో చేసేశారు నటునటులు.

నటీనటుల విషయానికి వస్తే సుధీర్ బాబు కెరీర్ లో ఇది ఒక భిన్నమైన పాత్ర. ఇప్పటివరకు మాస్ మసాలా రొటీన్ సినిమాల్లో హీరోగా చేసిన ఆయనని ఈ సినిమాలో ఒక సెటిల్డ్ రోల్ లో చూడడం కొత్తగా అనిపించింది. తనదైన సెటిల్ పెర్ఫార్మన్స్ తో సుధీర్ బాబు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కొన్ని సీన్స్ లో సుధీర్ నటన అబ్బురపరిచింది. షిండే క్యారెక్టర్ కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా అనిపిస్తుంది. సాయిచంద్ మాత్రం తనదైన శైలిలో స్క్రీన్ స్పేస్ దక్కించుకోవడమే కాదు మంచి నటనతో ప్రేక్షకులను కట్టిపడేసాడు. శశాంక్ సహా మిగతా పాత్రధారులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు అయితే హీరోయిన్ పాత్ర కేవలం ఒక సపోర్టింగ్ రోల్ లాగా మాత్రమే అనిపించింది. ఉన్నంతలో ఆమె పర్వాలేదనిపించింది. టెక్నికల్ టీం విషయానికి వస్తే సినిమాలో అండర్ కరెంట్ గా సంగీతం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఏదో కావాలని పాటలు ఇరికించినట్లు కాకుండా కథలో భాగంగా వచ్చేలా ఉన్నాయి. ఇక నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఎలాంటి కమర్షియల్ హంగులు జోలికి వెళ్లకుండా అసభ్యతకు తావు లేకుండా ప్రేక్షకుల మనసు హత్తుకునేలా ఈ సినిమాను చేయడం ఒక సాహసమే. కమర్షియల్ హంగుల కోసమే సినిమాలు చేస్తున్న ఈ రోజుల్లో ఇది ఒక భిన్నమైన ప్రయత్నం. కచ్చితంగా అభినందించి తీరాల్సిన ప్రయత్నం.

ఫైనల్లీ చిన్న చిన్న లోపాలు పక్కన పెడితే థియేటర్ కి వెళ్లి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ మా నాన్న సూపర్ హీరో.