NTV Telugu Site icon

Love Today Movie Review: లవ్ టుడే రివ్యూ (తమిళ డబ్బింగ్)

Love Today Movie Review

Love Today Movie Review

నటీనటులు: ప్రదీప్ రంగనాథన్, ఇవన, సత్యరాజ్, రాధిక, యోగిబాబు, రవీనా రవి, ఫైనల్లీ భరత్, ఆదిత్య కదిర్, విజయ్ వరదరాజ్ తదితరులు
సినిమాటోగ్రఫి: దినేశ్ పురుషోత్తమన్
సంగీతం: యువన్ శంకర్ రాజా
పంపిణీదారులు: దిల్ రాజు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రదీప్ రంగనాథన్

రెండంటే రెండు చిత్రాలతో తమిళనాట తనదైన బాణీ పలికిస్తున్నాడు యువదర్శకుడు ప్రదీప్ రంగనాథన్. మనిషిని చూస్తే అంతగా ఆనడు కానీ, నటనతోనూ, దర్శకత్వంతోనూ ఆకట్టుకున్నాడు ప్రదీప్. ఆయన దర్శకుడుగా జయం రవితో తెరకెక్కించిన తొలి చిత్రం ‘కోమాలి’ తమిళనాట అలరించింది. ఈ యేడాది తమిళనాట నవంబర్ 4వ తేదీన విడుదలై విజయఢంకా మోగించిన సినిమాగా ప్రదీప్ రెండవ చిత్రం ‘లవ్ టుడే’ నిలచింది. ఐదు కోట్ల బడ్జెత్ తో నిర్మితమైన ఈ చిత్రం అక్కడ ఇప్పటికే రూ.70 కోట్లు పోగేసింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమ ‘యస్.వి.సి.’ పంపిణీ సంస్థ ద్వారా ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగునాట విడుదల చేశారు.

ప్రస్తుతం మనిషి జీవితంలో సెల్ ఫోన్ ఓ భాగమై పోయింది. ఇంకా చెప్పాలంటే కొందరి శరీరంలోనే భాగమై పోయిందనవచ్చు. ఆ సెల్ ఫోన్ చుట్టూ అల్లుకున్న టెక్నాలజీతో ఎలాంటి ప్రమాదం ఉందో చెబుతూనే ప్రదీప్ రంగనాథన్ ఓ ప్రేమకథను నడిపిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కథ ఏమిటంటే – ఉత్తమన్ ప్రదీప్ అనే 24 ఏళ్ళ కుర్రాడు కాగ్నిజెంట్ లో డెవలపర్. తనతో పనిచేసే నికితతో ప్రేమాయణం సాగిస్తుంటాడు. ప్రదీప్ తల్లియే వారింటికి పెద్ద. తల్లిలేని నికిత, ఆమె చెల్లెలుకు తండ్రి వేణు శాస్త్రియే దిక్కు. వేణుశాస్త్రి మోడరన్ నాలెడ్జ్ ఉన్నా, సంప్రదాయవాది. ప్రదీప్ అక్క దివ్యకు డాక్టర్ యోగితో పెళ్ళి నిశ్చయమై ఉంటుంది. అనాకారి అయిన డాక్టర్ యోగిని ఎలా ఒప్పుకున్నావని ప్రదీప్ అక్కను నిలదీస్తాడు. అతని మంచి మనసు నచ్చిందని చెబుతుంది. నికిత, ప్రదీప్ ను ప్రేమిస్తోందని తెలిసిన ఆమె తండ్రి అతణ్ణి పిలుస్తాడు. అయితే వేణు శాస్ర్తి వారిద్దరినీ సెల్ ఫోన్స్ మార్చుకోమని, ఓ ఇరవై నాలుగు గంటలు ఒకరి ఫోన్ మరొకరి దగ్గర పెట్టుకుంటే చాలని షరతు విధిస్తాడు. సరే అంటారు ప్రేమికులు. ఆ తరువాత తన అక్క దివ్య పెళ్ళి పనుల్లో పడతాడు ప్రదీప్. తన పనికి తాను వెళ్తుంది నికిత. అక్కడ నుండీ ఒకరి ఫోన్లలో ఉన్న విషయాలు మరొకరు తెలుసుకొని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ సాగుతారు. అదే సమయంలో దివ్యకు కూడా తన కాబోయే భర్త ఫోన్ చూడాలని అనిపిస్తుంది. అందుకు డాక్టర్ యోగి అంగీకరించడు. ఇలా ఈ రెండు జంటల కథ సెల్ ఫోన్స్ కోసం సాగుతూ ఉండగా, ప్రదీప్ సెల్ లో సెక్స్ మూవీస్ సంగతి నికితకు తెలుస్తుంది. అదే నంబర్ అడ్మిన్ గా ఉన్న దగ్గర నుంచే తనకూ, తన చెల్లికి అసభ్యమైన మెసేజెస్ వచ్చేవని అర్థం చేసుకుంటుంది. కానీ, అవి తాను పంపినవి కావని లబోదిబోమంటాడు ప్రదీప్. ఎలాగైనా వాటిని డిలీట్ చేయాలని తన మిత్రుల సాయం కోరతాడు ప్రదీప్. అలాగే తన మిత్రులనూ అనుమానిస్తాడు, అవమానిస్తాడు. అదే సమయంలో ప్రదీప్, నికిత్ కాంటాక్ట్స్ కు నికిత ఒకరితో శారీరక సౌఖ్యం అనుభవిస్తున్న వీడియో వైరల్ అవుతుంది. అది చూసి వేణుశాస్త్రి కూతురును చితక్కొడతాడు. నికిత ఇంట్లోంచి వెళ్తుంది. ఆ తరువాత ఏమయింది? నికిత, ప్రదీప్ కలుసుకున్నారా? లేదా? అన్నదే సినిమా.

సినిమాలో ద్వంద్వార్థాలు ఉన్నాయే కానీ, ఎక్కడా అసభ్యత, అశ్లీలం లేకుండా సాగుతుంది. ఇక సెల్ ఫోన్స్ ద్వారా పలువురు ఎదుర్కొనే సమస్యలు, టెక్నాలజీతో ఎలాంటి పనులు చేయవచ్చు అన్న అంశాలనూ కథకుడు, దర్శకుడు అయిన ప్రదీప్ రంగనాథన్ చక్కగా పొందు పరిచారు. అతణ్ణి చూడగానే ఇతడు హీరో ఏంటి, డైరెక్టర్ ఏంటి అనిపిస్తుంది. కానీ, ఎక్కడా ఆ ఊసు తలెత్తకుండా కథను భలేగా నడిపించారు. నికిత పాత్రలో ఇవాన చక్కగా ఒదిగిపోయింది. ఈ సినిమాకు డ్రా బ్యాక్ ఏదైనా ఉందంటే అది ద్వితీయార్ధంలో ఫోన్ లో ఒకరినొకరు దెప్పి పొడుచుకోవడమే! అంతే తప్ప ఎక్కడా బోర్ కొట్టదు. సత్యరాజ్, రాధిక పాత్రలు సినిమాకు ఎస్సెట్. యువన్ శంకర్ రాజా బాణీలు ఆకట్టుకొనేలా ఉన్నాయి. తెలుగులోనూ “పిల్లా పడేశావే…”, “చెప్పు బుజ్జి కన్నా…”, “ప్రాణం పోతున్నా…” అంటూ సాగే పాటలు అలరిస్తాయి. తమిళనాట విడుదలైన మూడు వారాలకే తెలుగునేలపై ఈ చిత్రాన్ని విడుదల చేశారు దిల్ రాజు. అయితే టైటిల్ కార్డ్స్ విషయంలో అంత శ్రద్ధ చూపినట్టు లేదనిపిస్తుంది. తెలుగులో టైటిల్స్ తప్పుల తడకలా ఉన్నాయి. ఏది ఏమైనా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ‘లవ్ టుడే’ విశేషంగా మురిపిస్తుందని చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్:
– కథ, కథనం, దర్శకత్వం
– నటీనటుల నటన
– యువన్ శంకర్ రాజా సంగీతం

మైనస్ పాయింట్స్:
– పదే పదే ఒకరినొకరు అనుమానించుకోవడం
– సరైన ప్రచారం లేకపోవడం

రేటింగ్: 3.5/5

ట్యాగ్ లైన్: యూత్ టుడే!

Show comments