NTV Telugu Site icon

Korameenu Movie Review: కొరమీను మూవీ రివ్యూ

Korameenu Movie

Korameenu Movie

‘నెపోలియన్’ మూవీతో నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆనంద్ రవి. ఇప్పుడు లేటెస్ట్ మూవీ ‘కొరమీను’ విషయానికి వచ్చేసరికీ మెగాఫోన్ ను తన శిష్యుడు శ్రీపతి కర్రికి అప్పగించాడు. ఇందులో కీ-రోల్ ప్లే చేయడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే, మాటలను ఆనంద్ రవినే అందించాడు. పెళ్ళకూరు సమన్య రెడ్డి నిర్మించిన ‘కొరమీను’ మూవీ శనివారం థియేటర్లలో విడుదలైంది. సో… ఎలా ఉందో చూద్దాం!

‘మీసాల రాజుకు మీసాలు ఏమయ్యాయి?’ అనే ప్రశ్నతో ‘కొరమీను’ సినిమా ప్రచారం ఆసక్తికరంగా మొదలైంది. ఆ తర్వాత వచ్చిన ట్రైలర్ కూడా మూవీలోని ఇంటెన్సిటీని తెలిపింది. రొటీన్ కు భిన్నంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఈ మూవీని దర్శక నిర్మాతలు తీశారనే భావన ప్రేక్షకులకు కలిగింది. ఇంతకూ ‘కొరమీను’ కథేమింటంటే… విజయవాడ నుండి వైజాగ్ వచ్చిన పోలీస్ ఆఫీసర్ సీతారామరాజు ను అందరూ ముద్దుగా, గౌరవంగా ‘మీసాల రాజు’ అని పిలుస్తుంటారు. వైజాగ్ వచ్చి రాగానే, జాలరిపేటలోని కొందరు మీసాల రాజును వలవేసి బంధించి, మూతి మీద మీసాలు తొలగిస్తారు. దాంతో అవమానభారంతో అతను రగిలిపోతాడు.

దానికి కారకులైన వ్యక్తుల గురించి ఆరా తీస్తుంటాడు. జాలరి పేటలో యువరాజుగా మెలిగే కరుణ (హరీశ్ ఉత్తమన్) మీదకు అతని దృష్టి పోతుంది. తండ్రి అండదండలు, పొలిటీషియన్స్ సహకారంతో కరుణ చేయని చెత్తపని లేదని మీసాల రాజుకు తెలుస్తుంది. అదే సమయంలో కరుణ నుండి దూరమైన డ్రైవర్ కోటి (ఆనంద్ రవి), అతని ప్రియురాలు మీనాక్షి (కిశోరి దాత్రక్) మధ్య కూడా ఓ కోల్డ్ వార్ సాగుతోందని అర్థమౌతుంది. కోటి స్నేహితుడు ముత్యం (జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్) ద్వారా జాలరిపేట వివరాలు సేకరించి, కరుణ ను ట్రాప్ చేయడానికి మీసాల రాజు ప్రయత్నిస్తాడు. కానీ… కొంత కథ సాగే సరికీ తానే వాళ్ళ ట్రాప్ లో పడ్డాననే విషయం బోధపడుతుంది. అసలు మీసాల రాజు మీసాలు ఎవరు కట్ చేశారు? కరుణ – కోటి మధ్య ఇగో క్లాషెస్ కు రీజన్ ఏమిటీ? మీసాల రాజును ట్రాప్ చేయాల్సిన అవసరం ఎవరికి? ఎందుకు వచ్చింది? విజయవాడ నుండి వైజాగ్ వచ్చిన మీసాల రాజుకూ వ్యక్తిగత క్షక్షలు ఏమైనా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా.

‘ప్రతినిధి’, ‘నెపోలియన్’ చిత్రాలతో తన కలం బలాన్ని నిరూపించాడు ఆనంద్ రవి. ఇందులోనూ నేటివిటీ ఉన్న, బలమైన క్యారెక్టర్స్ ను సృష్టించాడు. మీసాల రాజు, కరుణ, కోటి పాత్రలతో పాటు ఇందులో హీరోయిన్ మీనాక్షి, ఆమె అక్క సుజాత పాత్రలు కూడా చాలా బలమైనవే. అలానే కరుణ తండ్రి వీరభద్రమ్, కోటి తండ్రి దేవుడు పాత్రలూ కథలో కీలకమైనవే. ఇక సి.ఐ. కృష్ణ పాత్ర ఊహకందని విధంగా సాగుంది. ప్రతి అరగంటకూ ప్రేక్షకుల ఊహకు అందని విధంగా కథ మలుపు తిరుగుతుంది. మూవీ మొదలైన కొద్ది సేపటికే… హీరోతో పాటు థియేటర్లోని ఆడియెన్ కూ హీరోయిన్ షాక్ ట్రీట్ మెంట్ ఇస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ చిన్న ట్విస్టులతో సాగితే… ప్రీ క్లయిమాక్స్ లోని ట్విస్ట్ మూవీకి ఆయువు పట్టు. ఎవరి ట్రాప్ లో ఎవరు పడ్డారో కొద్దిసేపు అర్థమే కాదు! మొత్తం మీద ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో కథను కంచికి చేర్చుతాడు దర్శకుడు.

ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ నటీనటులు, సాంకేతిక నిపుణులు. ప్రధాన పాత్రలు పోషించిన ఆరేడు మంది ఆయా పాత్రలకు చక్కటి న్యాయం చేకూర్చారు. వాళ్ళ ఎక్స్ ప్రెషన్స్ ను కార్తిక్ కొప్పెర కెమెరా బాగా క్యాచ్ చేసింది. సిద్ధార్థ్‌ సదాశివుని నేపథ్య సంగీతం బాగుంది. అనంత నారాయణన్ స్వరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తమ ఇగోను శాటిస్ ఫై చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసే పాత్రల్లో ఆనంద్ రవి, హరీశ్ ఉత్తమన్ పోటీ పడి నటించారు.

మొత్తం కథకు దారంలాంటి పాత్ర మీసాల రాజుది. హీరోయిన్ పాత్ర రొటీన్ కు భిన్నంగా, కొత్తగా డిజైన్ చేయడం జరిగింది. మొదటి సినిమానే అయినా కిశోరి దాత్రక్ చక్కటి నటన కనబరిచింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఇతర ప్రధాన పాత్రలను రాజా రవీంద్ర, గిరిధర్, ఇమ్మాన్యుయేల్, ఇందు కుసుమ, ఆర్. కె. నాయుడు తదితరులు పోషించారు. ఆనంద్ రవి రాసిన సంభాషణలు ఆలోచింపచేసేలా ఉన్నాయి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ గురించి చెప్పే డైలాగ్ హార్ట్ టచింగ్ ఉంది. ఓ సింపుల్ స్టోరీని నేటివిటీ టచ్ తో ఆసక్తికరంగా మలచడంలో శ్రీపతి కర్రి సక్సెస్ అయ్యాడు. అయితే… ఈ తరహా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ ఆడియెన్స్ ను థియేటర్లకు ఏ మేరకు రప్పిస్తాయన్నది చూడాలి! ఇగో క్లాషెస్ నేపథ్యంలో సాగే ‘కొరమీను’ ప్రేక్షకుల ఇగోని శాటిస్ ఫై చేస్తుంది!!

ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న అంశం
నటీనటుల నటన
క్లయిమాక్స్ ట్విస్ట్

మైనస్ పాయింట్స్
వినోదం లేకపోవడం
వీక్ గా ఉన్న ప్రథమార్థం

ట్యాగ్ లైన్: మీసం కోసం!