NTV Telugu Site icon

Koose Munisamy Veerappan Review: వీరప్పన్ మంచివాడా చెడ్డవాడా? ఆయనే ఒప్పుకున్న నిజం ఇదే!

Koose Munisamy Veerappan Review

Koose Munisamy Veerappan Review

Koose Munisamy Veerappan – Unseen Veerappan Tapes review: వీరప్పన్ అనే పేరు తెలియని భారతీయలు ఉండరు, అంతలా ఆయన తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. గంధపు చెక్కల స్మగ్లర్‏గా పేరున్న వీరప్పన్ గురించి ఇప్పటివరకు చాలా సినిమాలు, సీరియల్స్ ప్రజల ముందుకు వచ్చాయి. అయితే అవన్నీ ఆయనను సంప్రదించిన పోలీసులు చెప్పిన కథలు, ఆయన గురించి తెలుసుకున్న విలేకరులు చెప్పిన కథలు, అలాగే ఆయనతో ప్రయాణం చేసిన వ్యక్తులు చెప్పిన కథలు మాత్రమే, ఇప్పటివరకు జనాల ముందుకు వచ్చాయి. అయితే వీరప్పన్ స్వయంగా తన గురించి, తన జీవితం గురించి చెప్పిన అంశాల ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ సిరీస్ ‘కూసీ మునుసామి వీరప్పన్’. 1993, 1996 మధ్యకాలంలో వీరప్పన్‏ను ఇంటర్వ్యూ చేయడానికి అడవిలోకి వెళ్లిన గోపాల్ అనే విలేకరి షూట్ చేసిన వీడియోస్, వీరప్పన్ చెప్పిన తన జీవిత కథ ఆధారంగా ఈ సిరీస్‏ను రూపొందించారు. ట్రైలర్ తో ఆసక్తి రేకెత్తించిన ఈ డాక్యుమెంటరీ సిరీస్ ఎలా ఉంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

కథ : మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే ఇది వీరప్పన్ స్వయంగా తన గురించి, తన జీవితం గురించి చెప్పిన కథ. వేటగాళ్ల కుటుంబంలో ఐదుగురు పిల్లలలో రెండో వాడిగా పుట్టిన కూసే మునిసామి వీరప్పన్ చిన్నవయసులోనే తన ఆకలిని జయించడానికి మొదట కుటుంబ వృత్తి అయిన వేటాడడం మొదలు పెట్టాడు. ముందు ఆకలి తీర్చుకోవడం కోసమే వేట మొదలు పెట్టినా కాలక్రమేణా అదే వేట కారణంగా కోట్లాది రూపాయలు డబ్బు సంపాదించాడు. అనేక దశాబ్దాలు వీరప్పన్ తమిళనాడు – కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న అడవులను దోచుకున్నాడు, కంటపడిన ప్రతి గంధపు చెట్టును తొలచి, ఏనుగులను చంపి దంతాలు అమ్మేవాడు. ఈ క్రమంలో ఆయన వందల మందిని చంపాడు, తనకి వ్యతిరేకంగా నిలబడిన పోలీసు అధికారులను, వారికి ఇన్ఫార్మర్ అని అనుమానం వచ్చిన వారిని కూడా వదల్లేదు. అయితే ఇలా ఎందుకు మారాను? తన జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాలు అన్నీ తన నోటి తోనే చెప్పాడు. ఇక అవన్నీ సిరీస్ లో చూస్తేనే బాగుంటుంది.

విశ్లేషణ: ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు-తమిళ-కన్నడ సరిహద్దుల్లో పోలీసులు, అటవీ అధికారులను ముప్పతిప్పలు పెట్టిన వీరప్పన్ గురించి ఆయన జీవిత చరిత్ర గురించి ఎన్నో సినిమాలు, డాక్యుమెంటరీలు ఉన్నాయి. అయితే Zee5 ఒరిజినల్ కూసే మునిసామి వీరప్పన్ (అన్‌సీన్ వీరప్పన్ టేప్స్) ఈ జాబితాలో చేరిన కొత్త డాక్యుమెంటరీ. ఏది ఏమైనప్పటికీ, ఇది వాటన్నిటికీ భిన్నమే, ఎందుకంటే ఒకరకంగా ఇది వీరప్పన్ సొంతంగా నేరేట్ చేసుకున్న కథ. ప్రముఖ తమిళ పరిశోధనాత్మక పత్రిక అయిన నఖీరన్ వ్యవస్థాపకుడు – సంపాదకుడు గోపాల్ వీరప్పన్‌ ఉన్నప్పుడు వీరప్పన్ చేసిన కొన్ని ప్రత్యేక వీడియో ఇంటర్వ్యూల ఆధారంగా దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. గోపాల్ మరియు అతని బృందం వీరప్పన్ జీవితాన్ని కెమెరాలో రికార్డ్ చేసినందున, షో మొత్తాన్ని అన్ సీన్ టేప్స్ అని పేర్కొన్నారు. నిజానికి వీరప్పన్‌తో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రమేయం ఉన్న వ్యక్తులను చూపించే డాక్యుమెంటరీ కాదు. ఆయన కుమార్తె విద్యతో సహా మరికొందరు ఉన్నా మెయిన్ లీడ్ మాత్రం వీరప్పన్‌ మాత్రమే.

వీరప్పన్ మీద 6-ఎపిసోడ్స్ డాక్యుమెంటరీగా రిలీజ్ అయిన ఈ కూసే మునిసామి వీరప్పన్ – అన్‌సీన్ వీరప్పన్ టేప్స్ వెబ్ సిరీస్‌లాగా అనిపిస్తాయి. మొదటి మూడు ఎపిసోడ్‌లలో వీరప్పన్ పేదరికంలో కూరుకుపోయిన తన బాల్యం గురించి, వేటతో అతని పరిచయం, ఆకలి బాధలను తీర్చుకోవడం కోసం వేటాడిన రోజు నుంచి అదే ప్రధాన ఆదాయ వనరుగా మారిన క్రమం, అతను చేసిన చాలా హత్యల వెనుక ఉన్న ట్రిగ్గర్ పాయింట్లని సావధానంగా వివరించాడు. ఉదాహరణకు,ఆ కాలంలోని ఉత్తమ అటవీ అధికారులలో ఒకరిగా పరిగణించబడే DFO శ్రీనివాస్ హత్యకు తన సోదరి మరణం ఎలా కారణం అయింది లాంటి విషయాలను ఆయన తన నోటితోనే క్లారిటీ ఇచ్చాడు. ఇక వీరప్పన్ తన హత్యాకాండ మొత్తం మీద ఒక్క హత్యను కూడా తాను చేయలేదని ఖండించలేదు. అతను తన ముఠా సభ్యులకు లేదా అతను తిరుగుతున్న అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామస్థులకు హాని కలిగించిన పోలీసు అధికారులను చంపినట్టు అతను అంగీకరించాడు. తన కోసం వేటాడేందుకు వచ్చిన గ్రామస్తుల పట్ల కూడా వీరప్పన్‌కు గొప్ప కరుణ ఉండేది. కానీ పోలీసు ఇన్‌ఫార్మర్లుగా మారిన వారిపై మాత్రం ఆటను కనికరం చూపలేదు.

అలా అతను మారటానికి కూడా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా ఎపిసోడ్ 4 అయితే సున్నిత మనస్కులు చూడటం చాలా కష్టతరమే, ఎందుకంటే అందులో పోలీసులు ఇచ్చే థర్డ్-డిగ్రీ హింసను ప్రధానంగా చూపించాడు. ప్రధానంగా వీరప్పన్‌కి సహాయకులని, అతని కదలికల గురించి తెలుసని భవిస్తూ కర్ణాటక MM హిల్స్, చుట్టుపక్కల వారిపై అనుమానం ఉన్న వారిపై పోలీసుల దమనకాండ, వారే స్వయంగా తాము అనుభవించిన చెప్పలేనంత దారుణాలను వివరిస్తారు. వారి జననాంగాలపై కరెంటు షాక్‌లు నుంచి దారుణమైన లైంగిక వేధింపుల వరకు అన్నీ ఈ డాక్యూ సిరీస్ లో ప్రస్తావించారు. అలా తన మనుషులుగా చెప్పి అమాయకులను చంపిన వైనం, పోలీసులు తన వారీగా చెబుతూ సామాన్యుల మీద జరిపిన దారుణాలు అన్నీ బాధకు గురి చేసేలా ఉన్నాయి. ఇక ఎపిసోడ్ 5లో తను తీవ్రవాది కాదని చెప్పుకున్నా తన ఆచూకీ గురించి పోలీసులకు చెప్పిన ఇన్ఫార్మర్ల కేసులలో తానే న్యాయమూర్తి, ఉరిశిక్షకుడని, వారిని చంపేస్తానని చెప్పుకొచ్చాడు. కొన్ని సమయాల్లో పిల్లలను కూడా విడిచిపెట్టడట, వీరప్పన్ చిన్నపిల్లలకు హాని చేస్తాడని ఏమాత్రం ఊహించని నఖీరన్ గోపాల్‌ కూడా ఆ మాటకు చిగురుటాకులా వణికేలా చేసింది.

ఇక చివరి ఎపిసోడ్‌లో, వీరప్పన్‌ను ఒక వర్గం ప్రజలు ఎలా ఆరాధించారు? అతని రాజకీయ సిద్ధాంతాలు, ముఖ్యంగా జయలలితపై అతనికి వ్యతిరేకత ఎందుకు? MK కరుణానిధి వంటి రాజకీయ నాయకుల బహిరంగ మద్దతు, అతని సోదరుడు అర్జునన్ పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు జరిగిన మరణం గురించి, క్షమాభిక్ష కోసం అతని చివరి అభ్యర్ధన గురించి ప్రధానంగా ప్రస్తవించారు. దివంగత జయలలిత తన 1996 ఎన్నికల్లో ఓటమికి వీరప్పన్ ఇంటర్వ్యూ కారణమని అంగీకరించిన వాస్తవంతో సహా జీర్ణించుకోలేని ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇక మొదటి సీజన్ లో చాలా విషయాలు ప్రస్తావించినా ఇంకా చాలా విషయాలు మిగిలి ఉన్నాయి సో రెండవ సీజన్‌ కోసం లెట్స్ వెయిట్ అండ్ సీ

కూసే మునిసామి వీరప్పన్ – అన్‌సీన్ వీరప్పన్ టేప్స్ అనేది చాలా కేర్ తీసుకుని చేసిన డాక్యూ సిరీస్. దొరికిన ఫుటేజీతో పాటు కొన్ని సీన్స్ రీక్రియేట్ చేసిన వీడియోలను అలాగే వీరప్పన్ గురించి తెలిసిన వారి ఇంటర్వ్యూలను కలపడం కూడా సిరీస్ కి బాగా ప్లస్ అయింది. ఇక మొదట్లో ఏదైనా పని మధ్యలో చూడాలని అనుకున్నా, ఒక ఎపిసోడ్ మధ్యలోకి వచ్చేసరికి అన్ని పనులు పక్కన పెట్టి మరీ చూసేందుకు సిద్ధం అవుతారు. టెక్నీకల్ గా చాలా బ్రిలియంట్ గా చేసిన డాక్యూ సిరీస్ ఇది.

ఫైనల్లీ: కూసే మునిసామి వీరప్పన్ బింగే వాచ్ చేయాల్సిన డాక్యూ సిరీస్.. వీరప్పన్ గురించి వచ్చిన బెస్ట్ డాక్యుమెంటరీలలో ఇది ఒకటి.

Show comments