యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, డైరెక్టర్ చందూ మొండేటి కాంబినేషన్ లో ‘కార్తికేయ’ చిత్రం వచ్చి చూస్తుండగానే ఎనిమిదేళ్ళు గడిచిపోయాయి. వీరిద్దరి కాంబోలో మళ్ళీ ఇంతకాలానికి ‘కార్తికేయ -2’ రూపుదిద్దుకుంది. నిజానికి ఇది మొదటి సినిమాకు సీక్వెల్ కాదు. కార్తికేయ పాత్రను మాత్రమే ఇందులో క్యారీ చేశారు. ఈ లేటెస్ట్ మూవీని అభిషేక్ అగర్వాల్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రకరకాల కారణాలతో అనేకసార్లు వాయిదా పడిన ‘కార్తికేయ -2’ ఎట్టకేలకు శనివారం జనాల ముందుకు వచ్చింది.
శ్రీకృష్ణ నిర్యాణంతో ఈ సినిమా కథ మొదలవుతుంది. నిషాదుని బాణంతో తనువు చాలించే ముందు శ్రీకృష్ణుడు తన కాలు కడియాన్ని ఉద్ధవునికి ఇచ్చి, రాబోయే కలియుగంలో చాలా ఘోరాలు జరుగుతాయని, వాటిని నివారించే శక్తి ఇందులో నిబిడీకృతమైందని చెబుతాడు. ఇక ప్రస్తుతానికి వస్తే… శ్రీకృష్ణుడి కడియంలోని గొప్పతనం తెలుసుకున్న ఆర్కియాలజిస్ట్ ప్రొఫెసర్ రంగనాథ రావ్ గ్రీస్ లైబ్రరీలోని ఓ గ్రంధం నుండి దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తాడు. ప్రొఫెసర్ రావ్ తనతో చేతులు కలపకపోవడంతో సైంటిస్ట్ శాంతను (ఆదిత్య మీనన్) ఆ కడియం కోసం ప్రొఫెసర్ రావ్ ను హతమార్చేందుకు ప్రయత్నిస్తాడు. ఇదే సమయంలో నాస్తికుడైన, డాక్టర్ కార్తికేయ (నిఖిల్) తన తల్లి ఒత్తిడి మేరకు ఓ మొక్కు తీర్చుకోవడానికి ద్వారక నగరానికి వస్తాడు. శాంతను మనుషుల చేతిలో హతమవ్వడానికి ముందు ప్రొఫెసర్ రావ్ అనుకోకుండా కార్తికేయను చివరిసారి కలుస్తాడు. దాంతో శాంతను మనుషులతో పాటు, శ్రీకృష్ణ భక్తులు అభీరులకు సైతం కార్తికేయ టార్గెట్ అవుతాడు. ప్రొఫెసర్ రావ్ మనవరాలు ముగ్థ (అనుపమా పరమేశ్వరన్) సాయంతో వారందరిని తప్పించుకుని కార్తికేయ అంచలంచెలుగా హిమాలయాలకు చేరి అక్కడి చంద్రశిల శిఖరంలోని శ్రీకృష్ణుడి కడియాన్ని ఎలా పొందాడన్నదే మిగతా కథ.
దర్శక నిర్మాతలు మొదటి నుండి చెబుతున్నట్టు ‘కార్తికేయ’కు ఈ చిత్ర కథకు ఎలాంటి సంబంధం లేదు. ఇది మొత్తంగా వేరే కథ. అందులో కార్తికేయ మెడికో అయితే… ఇందులో అతను డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తుంటాడు. అందువల్ల చాలా కొత్త పాత్రలు మనకు కనిపిస్తాయి. శ్రీకృష్ణుడి కాలి కడియంకు ఉన్న శక్తి ఎలాంటిది, దానిని ఈ తరం ఎలా ఉపయోగించుకుంది అనే దానికంటే కూడా ఆ కడియాన్ని ఓ సామాన్యమైన డాక్టర్ ఎలా పొందాడు? అనే దాని మీదనే దర్శకుడు దృష్టి పెట్టాడు. పూజా పునస్కారాలను, మంత్రాలను, హోమాలను విశ్వసించని ఓ డాక్టర్… కృష్ణుడి గొప్పతనాన్ని గురించి ఓ ప్రొఫెసర్ ద్వారా తెలుసుకుని సమాజ హితం కోసం తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టడానికి ప్రయత్నించాడన్నదే ఈ చిత్రం. కథ హైదరాబాద్ నుండి ద్వారక, మధుర మీదుగా హిమాలయాలకు సాగడమనేది ఆసక్తికరంగా ఉంది. ఒక్కే ప్రదేశంలో ఒక్కో క్లూను తీసుకుని, హీరో తన బృందంతో కలిసి హిమాలయాలకు చేరి అక్కడ కృష్ణుడి కాలి కడియం పొందడం అనేది చందమామ కథను తలపించేలా ఉంది. సినిమా ప్రారంభం నుండి దాదాపు ఒకే స్కేల్ లో సాగుతుంది. ఎక్కడా అప్ అండ్ డౌన్స్ ఉండవు. అలాంటి సమయంలో అనుపమ్ ఖేర్ పాత్ర ప్రవేశించిన తర్వాత ఒక్కసారిగా మూవీ గ్రాఫ్ పెరిగిపోయింది. అక్కడ నుండి క్లయిమాక్స్ వరకూ వేగంగా సాగిపోయింది. దాంతో అప్పటి వరకూ సో… సో… గా ఉందని భావించిన ప్రేక్షకులు సైతం అబ్బురానికి గురవుతారు. విశేషం ఏమంటే… ఈ కథను ఇంతటితో ఆపేయకుండా దీనికి కొనసాగింపు కూడా ఉంటుందన్నట్టు ముగించారు.
నటీనటుల విషయానికి వస్తే నిఖిల్ వైవిధ్యమైన పాత్రను సమర్థవంతంగా చేశాడు. దైవశక్తి మీద పెద్దంత విశ్వాసం లేని ఓ వైద్యుడు దైవకార్యంలో నిమగ్నం కావడం అనేది ఆసక్తిని కలిగించేదే. ఆ పాత్రను ఆకళింపు చేసుకుని చక్కగా నటించాడు. అనుపమా పరమేశ్వరన్ పాత్ర ఎంట్రీ లేట్ గా జరిగింది కానీ అక్కడ నుండి అది చివరి వరకూ కొనసాగుతుంది. హీరో మేనమావగా శ్రీనివాసరెడ్డి, ట్రక్ డ్రైవర్ గా వైవా హర్ష చక్కని వినోదాన్ని అందించే ప్రయత్నంచేశారు. వారూ కథతో పాటే ట్రావెల్ అవుతారు. అలానే ఆదిత్య మీనన్, వెంకట్ ప్రతినాయకులుగా మెప్పించారు. హీరో తల్లిగా తులసి నటన బాగుంది. సినిమా ప్రారంభంలో కో-డాక్టర్స్ గా సత్య, ప్రవీణ్ కాస్తంత కామెడీ పండించారు. అనుపమ్ ఖేర్ పాత్ర ఇంకా రాలేదేమిటీ అనుకుంటూ ఉండగా ఆయన ఎంట్రీ జరుగుతుంది. అనుపమ్ ఖేర్ వర్త్ ఫుల్ క్యారెక్టర్ చేశారు. మూవీని ఒక్కసారిగా పైకి లేపారు. సాంకేతిక నిపుణుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీతో పాటు ఎడిటింగ్ చేసిన కార్తిక్ ఘట్టమనేని గురించి. అతని విజువల్సే కాదు… ఎడిటింగ్ సైతం షార్ప్ గా ఉంది. ఇక కాలభైరవ తన నేపథ్య సంగీతంతో మూవీలోని ప్రతి సన్నివేశానికీ ప్రాణం పోశారు. ఓ సాధారణమైన సన్నివేశం సైతం కాలభైరవ, కార్తిక్ ఘట్టమనేని కారణంగా ఆసక్తికరంగా తెరపై కనిపించాయి. నిజానికి ఈ కథను మరింత ఆసక్తికరంగా, మరింత గ్రిప్పింగ్ గా తీయొచ్చు. డైరెక్టర్ చందూ మొండేటి తన ప్రతిభను పూర్తి స్థాయిలో ఉపయోగించలేదేమో అనిపిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన మరో హైలైట్ మణిబాబు కరణం సంభాషణలు. ఎంతో ఉత్తేజభరితంగానూ, అర్థవంతంగానూ ఉన్నాయి. సీజీ వర్క్ సైతం చాలా బాగుంది. నిర్మాణ విలువలకూ కొదవలేదు. రొటీన్ రొట్టకొట్టుడు సినిమాలను చూసి బోర్ ఫీలవుతున్న ప్రేక్షకులకు ‘కార్తికేయ -2’ ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుందనడంలో సందేహం లేదు.
రేటింగ్: 3 / 5
ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథ
కార్తిక్ సినిమాటోగ్రఫీ
కాలభైరవ నేపథ్య సంగీతం
నిర్మాణ విలువలు
మైనెస్ పాయింట్
ఆసక్తి కలిగించని కథనం
సరిగా లేని హీరో క్యారెక్టరైజేషన్
మిస్ అయిన ‘వావ్’ ఫీలింగ్
ట్యాగ్ లైన్: జై శ్రీకృష్ణ!