NTV Telugu Site icon

Bharateeyudu 2 Review: భారతీయుడు 2 రివ్యూ!

Bharateeyudu 2 Review

Bharateeyudu 2 Review

Bharateeyudu 2 Review and Rating: శంకర్ డైరెక్షన్లో కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు 96లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. సుమారు 28 ఏళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన భారతీయుడు 2 ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భారతీయుడు 2 సినిమాలో కమల్హాసన్ తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్, ఎస్జె సూర్య, సముద్రఖని, వివేక్, నెడుముడి వేణు, బాబీ సింహా వంటివాళ్లు కీలక పాత్రలలో నటించారు. పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తూ వచ్చిన సినిమా యూనిట్ ఈ భాగం కంటే మూడో భాగం ఇంకా అదిరిపోతుందని చెబుతూ వచ్చింది. అయితే తాజాగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కథ:
ఒక విజిలెన్స్ ఆఫీసర్(సముద్రఖని) కుమారుడు చిత్ర సిద్ధార్థ్ తన స్నేహితులు ప్రియ భవాని శంకర్ అండ్ గ్యాంగ్ తో కలిసి బార్కింగ్ డాగ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటాడు. రాష్ట్రంలో జరిగే కొన్ని అవినీతి కేసులను కార్టూన్ క్యారెక్టర్ ల ద్వారా చిత్రీకరించి ప్రజలలో అవేర్నెస్ తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక నిరుద్యోగి మరణంతో కడుపు మండి ఇండియన్ మళ్లీ తిరిగి వస్తే ఈ లంచాలు తీసుకోవడం ఆగిపోతుంది. దేశం బాగుపడుతుందంటూ అతని వెనక్కి రప్పించే ప్రయత్నంలో భాగంగా సోషల్ మీడియాలో కం బ్యాక్ ఇండియన్ అనే ఒక క్యాంపై మొదలు పెడతాడు. అది ఇండియన్ కమలహాసన్ వరకు చేరి ఇండియా వస్తాడు. అయితే అలా వచ్చిన ఇండియన్ తాను కొంతమంది లంచగొండులను శిక్షిస్తూనే మీ ఇళ్లను మీరే శుభ్రం చేసుకోవాలంటూ యువతకు ఒక మెసేజ్ ఇస్తాడు. అలా వచ్చిన ఇండియన్ ను మళ్లీ తిరిగి వెళ్ళిపోవాల్సిందిగా ఎందుకు కోరతారు? ఇండియన్ తిరిగి రావాలని కోరుకున్న వారే ఇండియన్ తిరిగి వచ్చాక అతని మీద ఎందుకు దాడి చేయాలనుకుంటారు? అతన్ని పట్టుకోవాలని ప్రయత్నించిన కృష్ణ స్వామి (నెడుమూడి వేణు) కుమారుడు సిబిఐ ఆఫీసర్ ప్రదీప్ (బాబీసింహ) పట్టుకోగలిగాడా? చివరికి సేనాపతి ఏమయ్యాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
96 లో వచ్చిన భారతీయుడు అనే సినిమా ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ మూవీగా ఉంటుంది. లంచగొండితాన్ని అరికట్టడానికి తన సొంత కొడుకుని చంపిన సేనాపతి క్యారెక్టర్ ని అప్పట్లో చాలామంది ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు అదే క్యారెక్టర్ ను బేస్ చేసుకుని ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు అనగానే అందరిలోనూ చాలా అంచనాలు ఏర్పడ్డాయి. సుమారు నాలుగు ఐదు ఏళ్ల క్రితమే అనౌన్స్ చేసిన ఈ సినిమాని 2024 లో రిలీజ్ చేశారు. అయితే భారతీయుడు మ్యాజిక్ ను మరోసారి ఈ భారతీయుడు 2 రిపీట్ చేయగలిగిందా అంటే కచ్చితంగా మిశ్రమ అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. ఎందుకంటే భారతీయుడు సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా ఇలా ఉంటుందని అంచనాలు లేవు. కానీ భారతీయుడు 2 అనౌన్స్ చేసినప్పటి నుంచే సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోవడంలో ఈ సినిమా తడబడింది. వాస్తవానికి భారతీయుడిని మళ్లీ వెనక్కి రప్పించడం కోసం ఎంచుకున్న ఎత్తుగడలు బాగానే ఉన్నాయి. కానీ వచ్చిన భారతీయుడు తానేం చేస్తున్నాననే విషయాన్ని చెప్పకుండా మీ ఇంటిని మీరే శుభ్రం చేసుకోవాలంటూ ఇచ్చిన మెసేజ్ చాలా మందికి కనెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే అవినీతి మీ అమ్మో నాన్నో లేక అనో అక్కో చేస్తున్నారంటే చాలా మంది తీసుకోలేరు. కానీ అదే మెయిన్ పాయింట్ గా ఈ సినిమా మొత్తాన్ని నడిపే ప్రయత్నం చేశారు. లంచ గొండితనాన్ని అరికట్టడానికి సొంత కొడుకును సైతం చంపేందుకు ఏమాత్రం వెనుకాడని సేనాపతి అలాగే లంచాలతో అవినీతి సొమ్ముతో తీసుకొచ్చిన తిండి తినకండి, ఆ సొమ్ముని అనుభవించకండి అంటూ యువతకు ఇచ్చిన మెసేజ్ వినడానికి బాగానే ఉన్నా ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు. బహుశా ఈ ఒక్క విషయంలోనే ప్రేక్షకులకు సినిమా ఎక్కక పోవచ్చు. అయితే శంకర్ మార్క్ డైలాగులు, రిచ్నెస్ సినిమాకి అసెట్ అయ్యా అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ మొత్తం చకచగా జరిగిపోతున్న ఫీలింగ్ కలిగినా సెకండ్ హాఫ్ మాత్రం ఎందుకో కొంత సాగ తీసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే రెండో భాగం చివరిలో మూడో భాగానికి సంబంధించిన ట్రైలర్ లాంటి దాన్ని ప్రదర్శించి మూడో భాగం మీద అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు. అయితే ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టు కమల్ హాసన్ స్క్రీన్ స్పేస్ అంత తక్కువ అయితే కాదు. అలాగే సిద్ధార్థ ఈ సినిమాలో హీరో అనే ప్రచారం కూడా జరిగింది కానీ అది కూడా కేవలం ప్రచారం అనే చెప్పాలి. ఎందుకంటే ఇండియన్ ని వెనక్కి రప్పించే ప్రయత్నం చేసిన సిద్ధార్థ్ మళ్లీ గోబ్యాక్ ఇండియన్ అనాల్సి వచ్చింది అనే విషయాన్ని చాలా ఆసక్తికరంగా తెర మీద ఆవిష్కరించారు. కమల్ లేని సీన్స్ లో కూడా అతని పాత్ర చుట్టూనే కథ అంతా తిరుగుతుంది. దేశం కోసం పక్కింటి వాళ్ళు ఏమైనా చేస్తే వాళ్ళని అభినందించే మనం మన ఇంటి వాళ్ళు చేయడానికి ముందుకొస్తే మాత్రం ఎలా రియాక్ట్ అవుతాం అనే విషయాన్ని తెరమీద వాస్తవికంగా చూపించే ప్రయత్నం చేశారు. శంకర్ మార్క్ కామెడీ పర్వాలేదు అనిపించినా ఎమోషనల్ సీన్స్ చొప్పించినట్టు అనిపించింది.

నటీనట్ల విషయానికి వస్తే:
కమల్హాసన్ నటన ఎప్పటిలాగే అద్భుతంగా ఉంది కానీ అతని గెటప్స్ విషయంలో ఇంకా కేర్ తీసుకుంటే బాగుండేది. సిద్ధార్థ్ కూడా తనధైన శైలిలో నటించే ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. రకుల్ ప్రీత్ స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా ఉన్నంతలో పర్వాలేదనిపించింది. సముద్రఖని, బాబీ సింహ ఇద్దరూ తమ పాత్రలకి న్యాయం చేశారు. వివేక్ నేదుముడి వేణు ఇద్దరినీ ఏఐలో రీ క్రియేట్ చేసి భళా అనిపించారు. ఎస్జె సూర్య పాత్ర చాలా చిన్నది అయినా కనిపించిన ప్రతిసారి తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే శంకర్ మార్క్ సెట్టింగ్స్ చాలా వరకు అన్ని ఫ్రేమ్స్ లో కనిపించేలా చేశాడు. ముఖ్యంగా సాంగ్స్ వినడానికి కాదు చూడ్డానికి కూడా బాగున్నాయి. అయితే రెహమాన్ శంకర్ కాంబో రిపీట్ అయితే మాత్రం అదిరిపోయేదేమో అనిపించింది. ఎందుకంటే అనిరుధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉన్నా సాంగ్స్ రెహమాన్ చేసుంటే వేరే లెవెల్ లో ఉండేది. గుంటూరు కారంలోని ఒక సాంగ్ గేమ్ చేంజర్ లోని మరో సాంగ్ తో ఒక్కసారిగా అరుపులు పుట్టించారు. సినిమాటోగ్రఫి కూడా టాప్ నాచ్ ఉంది. అయితే శంకర్ మేకింగ్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఎడిటింగ్ టేబుల్ మీద కూడా కొంచెం పని వదిలేశారు అనిపిస్తుంది.

ఫైనల్లీ:
భారతీయుడు 2 శంకర్ మార్క్ సోషల్ మెసేజ్ మూవీ. భారతీయుడుతో పోలికలు లేకుండా, ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే నచ్చొచ్చు.