NTV Telugu Site icon

Jersey Movie Review: జెర్సీ (హిందీ)

Jersy Movie

Jersy Movie

ఒకప్పుడు తెలుగువారి హిందీ హీరోగా జితేంద్ర రాజ్యమేలారు. షాహిద్ కపూర్ కూడా అదే తీరున సాగేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఇంతకు ముందు షాహిద్ నటించిన ‘కబీర్ సింగ్’ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాకు తెలుగులో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ మాతృక. ‘అర్జున్ రెడ్డి’ రూపొందించిన సందీప్ వంగా దర్శకత్వంలోనే ‘కబీర్ సింగ్’ హిందీ చిత్రం కూడా వెలుగు చూసింది. ఇప్పుడు తెలుగులో విజయం సాధించిన ‘జెర్సీ’ ఆధారంగా షాహిద్ నటించిన హిందీ ‘జెర్సీ’ రూపొందింది. ఈ సినిమాకు కూడా ‘జెర్సీ’ తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించడం విశేషం! హిందీ ‘జెర్సీ’ని మన తెలుగు నిర్మాతలయిన అల్లు అరవింద్, దిల్ రాజు, సూర్యదేవర నాగవంశీతో కలసి అమన్ గిల్ నిర్మించడం మరో విశేషం!

తెలుగులో ‘జెర్సీ’ చూసిన వారికి కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ, హిందీలోనూ అదే తీరున సాగిన ‘జెర్సీ’ కథ ఏమిటంటే… అర్జున్ తల్వార్, భార్య విద్య, కొడుకు కరణ్ తో కలసి జీవిస్తూ ఉంటాడు. అర్జున్ కు క్రికెట్ అంటే ప్రాణం. కానీ, కొన్ని కారణాల వల్ల క్రికెట్ ను వదిలేసి, వేరే ఉద్యోగం చేస్తాడు. అందులోనూ ఇమడలేకపోతాడు. భార్య సంపాదనతో జీవిస్తూ ఉండడంతో అతను ప్రతిదినం నరకం అనుభవిస్తూనే ఉంటాడు. కొడుకు కరణ్ కు కూడా క్రికెట్ అంటే పిచ్చి. అతను ‘జెర్సీ’ కావాలంటాడు. కొడుకు కోరిక తీర్చడం కోసం అర్జున్ 36 ఏళ్ళ వయసులో క్రికెట్ ఆడటానికి సిద్ధమవుతాడు. భార్య అందుకు అంగీకరించదు. అనేక అవమానాలు ఎదురైనా కొడుకు కళ్ళలో ఆనందం కోసం వాటిని సహిస్తాడు. చివరకు జాతీయ జట్టులో చోటు సంపాదించి, దేశం గర్వించే క్రికెటర్ అవుతాడు. కానీ, అర్జున్ కు ‘అరిత్ మియా’ అనే హృద్రోగం ఉంటుంది. అందువల్లే 26 ఏళ్ళకే క్రికెట్ పై ఎంతో ఇష్టం ఉన్నా, దానిని వదలివేస్తాడు. కానీ, కొడుకు కోసం మళ్ళీ పదేళ్ళకు క్రికెట్ లో రాణిస్తాడు. చిన్నవయసులోనే కన్నుమూస్తాడు. అర్జున్ మరణానికి కారణం అతని కోచ్ ద్వారా కరణ్ కు పెద్దయ్యాక తెలుస్తుంది. తన కోసమే తండ్రి క్రికెట్ ఆడారని తెలుసుకున్న కరణ్ కు అర్జున్ అసలైన హీరోలాగా అనిపిస్తాడు.

స్పోర్ట్స్ డ్రామాలు హిందీ సినిమారంగానికి కొత్తకాదు. అయితే ‘జెర్సీ’లోని ఫ్యామిలీ డ్రామా కొత్తగా అనిపిస్తుంది. తెలుగు ‘జెర్సీ’లో నాని హీరోగా తన పాత్రను సమర్థవంతంగా పోషించారు. అదే తీరున షాహిద్ సైతం అర్జున్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే ప్రయత్నం చేశారు. ఇక తెలుగులో ‘జెర్సీ’ని రూపొందించిన గౌతమ్ తిన్ననూరి, హిందీలోనూ దర్శకత్వం వహించే ఛాన్స్ లభించగానే మరింత బాగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. అనిత్ మెహతా సినిమాటోగ్రఫి కథకు తగిన విధంగానూ, కనులకు ఇంపుగానూ సాగింది. విద్య పాత్రలో మృణాల్ ఠాకూర్ పరిధి మేరకు నటించింది. కరణ్ పాత్రలో రోణిత్ అలరించాడు. నిజజీవితంలో షాహిద్ తండ్రి అయిన పంకజ్ కపూర్, ఇందులో కోచ్ గా ఆకట్టుకొనే అభినయం ప్రదర్శించారు. సచేత్-పరంపర బాణీలకు షెల్లీ (శైలేందర్ సింగ్ సోదీ) రాసిన పాటలు ఆకట్టుకుంటాయి. “మెహ్రమ్…”, “మయ్యా మైనూ…”, “బలియే రే…”, “జింద్ మెరియే…” అంటూ సాగే పాటలు అలరించాయి. అనిరుధ్ రవిచంద్రన్ నేపథ్య సంగీతం కూడా సినిమాకు దన్నుగా నిలచింది. ఒరిజినల్ ‘జెర్సీ’ చూసిన వారిని కూడా హిందీ ‘జెర్సీ’ ఆకట్టుకొనేలా రూపొందింది.

ప్లస్ పాయింట్స్:
షాహిద్ కపూర్ అభినయం
ఆకట్టుకొనే కథ, కథనం
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం
అనిల్ మెహతా సినిమాటోగ్రఫి
సచేత్-పరంపర బాణీలు

మైనస్ పాయింట్స్:
నత్తనడకలా సాగే కొన్ని సన్నివేశాలు
అంతగా ఆకట్టుకోని క్రికెట్ సీన్స్

రేటింగ్: 2.75/ 5

ట్యాగ్ లైన్: సెంటిమెంట్ పూసుకున్న ‘జెర్సీ’