NTV Telugu Site icon

Jana Gana Mana 2022 : జన గణ మన (మళయాళం)/ జన 2022 (తెలుగు డబ్బింగ్)

Movir

Movir

 

‘లీగల్ డ్రామా ఫిలిమ్స్’లో సన్నివేశ బలం ఉంటే జనం ఖచ్చితంగా ఆదరిస్తారు అని గతంలో పలు మార్లు రుజువయింది. తాజాగా మళయాళ చిత్రం ‘జన గణ మన’లో ‘కోర్టు రూమ్ డ్రామా’కు జనం మరోమారు జేజేలు కొడుతున్నారు. ఏప్రిల్ 28న కేరళలో విడుదలైన ‘జన గణ మన’ ప్రస్తుతం ‘నెట్ ఫ్లిక్స్’ లో ప్రదర్శితం అవుతోంది.

కర్ణాటకలోని రామనగర్ సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేసే కాలేజ్ ప్రొఫెసర్ సబా మరియమ్ బాడీని నలుగురు యువకులు కాల్చడం ఓ వ్యక్తి చూడడంతో కథ మొదలవుతుంది. ఆ వార్త హెడ్ లైన్స్ లో ప్రచురితమవుతుంది. సబా రేప్ కు గురై, కాల్చి చంపేశారని వార్త సారాంశం. ఆమె విద్యార్థులు ఆగ్రహోద్రగులై ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేస్తారు. ఏసీపీ సజ్జన్ కుమార్ నలుగురు అబ్బాయిలను అరెస్ట్ చేస్తాడు. పోలీసులు నేరస్థులను పట్టుకోవడం, చట్టానికి అప్పగించడం తప్ప ఏమీ చేయలేరని అంటారు విద్యార్థులు. వేరే స్టేషన్ కు ఆ నలుగురు యువకులను మారుస్తూ, సజ్జన్ కుమార్ ఎన్ కౌంటర్ చేస్తాడు. విద్యార్థులు, నెటిజన్స్ లో అధిక సంఖ్యాకులు సజ్జన్ చర్యను సమర్థిస్తారు. కోర్టుకు హాజరు పరచకుండా ఎన్ కౌంటర్ చేయడంలో ఏదో మోసం ఉందని మానవహక్కుల ఉద్యమ కారులు కోర్టులో కేసు వేస్తారు. జస్టిస్ అలోక్ వర్మ ముందు పోలీసులకు అనుకూలంగా రఘురామ్ అయ్యర్, మానవ హక్కుల పరిరక్షణ తరపున ఒకప్పటి పోలీస్ అధికారి, తరువాత న్యాయవాది అయిన అరవింద స్వామినాథన్ వాదనలు వినిపిస్తారు. కోర్టు ముందు హాజరు పరచకుండానే ఎన్ కౌంటర్ చేయడం సబబు కాదని వాదన మొదలవుతుంది. హత్యకు గురైన ప్రొఫెసర్ సబా తల్లి కూడా తన కూతురును రేప్ చేసి, తరువాత కాల్చేశారని మీడియా వార్తలను బట్టి నమ్మి అదే చెబుతుంది. ఆమెకు అరవింద స్వామినాథన్ వాదన ఆగ్రహం తెప్పిస్తుంది. అసలు సదా రేప్ కు గురి కాలేదని, తన దగ్గరున్న ఆధారాలతో కథ చెబుతాడు అరవింద స్వామినాథన్. సబా పనిచేసే సెంట్రల్ యూనివర్సిటీలో కొందరు ప్రొఫెసర్స్ భేదభావం కారణంగా విద్య అనే అమ్మాయి, అలా పదేళ్ళలో దాదాపు 52 మంది విద్యార్థులు ఆత్మహత్యకు గురికావడమో, చదువు మానేయడమో చేసి ఉంటారు. దీనిని వ్యతిరేకిస్తూ సబా యూనివర్సిటీ హై కమాండ్ ను ఈ అంశంపై విచారణ జరిపించాలని కోరుతుంది. విద్య ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్ కారుతో గుద్ది సబాను చంపేసి ఉంటాడు. అదే సమయంలో రాజకీయంగా సతమతమవుతున్న ఓ నాయకునికి సజ్జన్ కుమార్ ఓ ఐడియా ఇస్తాడు. హిట్ అండ్ రన్ కేసులో చనిపోయిన సబా కేసును రేప్ చేసి, చంపినట్టుగా చిత్రీకరిస్తే, ప్రొఫెసర్ కాబట్టి హెడ్ లైన్స్ లో వార్త వస్తుందని సదరు రాజకీయ నాయకుని అక్రమాల కేసు పక్కదారి పడుతుందని సూచన చేస్తాడు. దాంతో ఆ రాజకీయ నాయకుడు తమ పార్టీలోని కొందరు నాయకుల ద్వారా కేసు మీద వేసుకొని శిక్ష అనుభవించే నలుగురు యువకులను ఏర్పాటు చేసి ఉంటారు. వారినే ఎన్ కౌంటర్ చేస్తారు.

ఏ రాజకీయ నాయకుని కోసమైతే ఇంత ప్లాన్ జరిగిందో, అతనే ఒకప్పుడు ప్రస్తుతం హ్యూమన్ రైట్స్ తరపున కేసు వాదించే అరవింద స్వామినాథన్ కు పలు కష్టాలు కలిగించి ఉంటాడు. అతనిపై పగ తీర్చుకొనే అవకాశం వచ్చిందంటూ సాక్ష్యాలన్నీ సేకరించి, అతనికి చేరవేసేలా చేస్తాడు సజ్జన్ కుమార్. అతను ఇలా చేయడానికి సజ్జన్ లో కలిగిన పరివర్తనే కారణం. చివరకు కోర్టులో సాక్ష్యాధారాల ప్రకారం బూటకపు ఎన్ కౌంటర్ చేసిన సజ్జన్ కుమార్ అరెస్ట్ అవుతాడు. తరువాత సబాను కారుతో గుద్ది చంపిన ప్రొఫెసర్ జైలుకు పోతాడు. రాజకీయ నాయకుడు నామినేషన్ వేసి వస్తూ ఉండగా, అరవింద స్వామినాథన్ వాదనతో ఏకీభవించిన సబా విద్యార్థుల్లో గౌరీ అనే అమ్మాయి కూడా ఎన్నికల్లో నామినేషన్ వేస్తుంది. కారులో వెళ్తున్న రాజకీయ నాయకునికి అరవింద ఫోన్ చేసి, ఒకప్పుడు తనను ఎగతాళిగా అతను అన్న మాటలనే తిప్పి చెబుతాడు. అప్పటి దాకా హ్యాండ్ స్టిక్ సహాయంతో నడుస్తున్నఅరవింద దానిని వదిలేసి సొంతగా ముందుకు సాగుతాడు. దాంతో అతను పొలిటీషియన్ పై ప్రతీకారం తీర్చుకోబోతున్నాడు అనే భావనతో కథ ముగుస్తుంది.

ఈ మధ్య కాలంలో వచ్చిన కోర్టు రూమ్ డ్రామాస్ ‘వకీల్ సాబ్, జై భీమ్’ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ చిత్రాల్లో కన్నా మిన్నగా ‘జన గణ మన’ లీగల్ డ్రామా సాగింది. అందువల్లే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రూపాయికి ఐదు రూపాయలు రాబట్ట గలిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. అదలా ఉంచితే, ప్రథమార్ధం కాస్త సీదాసాదాగానే అనిపిస్తుంది. కోర్టులో వాదనలు మొదలయ్యాక, వాటికి అనుగుణంగా సాగిన సన్నివేశాలు చూపరులను కట్టిపడేస్తాయి. అరవింద స్వామినాథన్ గా పృథ్వీరాజ్, సబాగా మమతా మోహన్ దాస్, జడ్జిగా రాజా కృష్ణమూర్తి, సజ్జన్ కుమార్ గా సూరజ్ వెంజరమూడు ఆకట్టుకొనేలా నటించారు. మిగిలిన పాత్రధారులు సైతం తమ పాత్రలకు న్యాయం చేశారు. జేక్స్ బిజయ్ సంగీతం అలరించింది. కోర్టు రూమ్ డ్రామాకు తగ్గట్టుగా తన కెమెరా యాంగిల్స్ తో సుదీప్ ఎలమోన్ కనువిందు చేశారు. ఈ చిత్రం తమిళ, తెలుగు వర్షన్ లోనూ డబ్ అయి, నెట్ ఫ్లిక్స్ లోనే దర్శనమిస్తోంది. మీడియాలో వచ్చేవన్నీ సరైన వార్తలు కాదని, దేవాలయాల్లాంటి విద్యాలయాలల్లో సాగుతున్న వివక్ష, జనాన్ని తప్పుదోవ పట్టించే ఎన్ కౌంటర్స్ చుట్టూ ఈ కథ పట్టుగా సాగడం ఆకట్టుకొనే అంశాలు.

‘జన గణ మన’ చిత్రంలోని భాష మళయాళం అయినా, ఇది బెంగళూరు సమీపంలోని రామనగర సెంట్రల్ యూనివర్సిటీ, కర్ణాటకలోనే కథ సాగినట్టుగా తెరకెక్కించారు. తెలుగునాట ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరొందిన సజ్జనార్ పేరును గుర్తు చేస్తూ సజ్జన్ కుమార్ పేరునే ఏసీపీ పాత్రకు పెట్టడం గమనార్హం! అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ దళిత యువకుడు వివక్షకు గురై అసువులు బాసిన తీరునూ కథానుగుణంగా ఉపయోగించుకున్నారు. కన్నడనాటనే హత్యకు గురైన జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ కథ కూడా గుర్తుకు వస్తుంది. ఇలా పలు ప్రముఖ అంశాలను గుర్తు చేస్తూ ‘జన గణ మన’ రూపొందడం విశేషం!

ప్లస్ పాయింట్స్:
– ఆకట్టుకొనే కోర్టు డ్రామా
– పట్టుతో సాగే ద్వితీయార్ధం
– నటీనటుల అభినయం

మైనస్ పాయింట్స్:
– ప్రథమార్ధంలో పాత పోకడలే కనిపించడం

రేటింగ్: 3.25/ 5

ట్యాగ్ లైన్: మెప్పించే జన గణ మన!