NTV Telugu Site icon

Hello Meera Movie Review: హలో… మీరా! రివ్యూ

Hello Meera

Hello Meera

Hello Meera Movie Review: సింగిల్ క్యారెక్టర్ తో మూవీ తీయడమంటే కత్తిమీద సాము. అలాంటి పనికి సిద్ధపడ్డారు ప్రముఖ దర్శకుడు బాపు శిష్యుడు శ్రీనివాసు కాకర్ల. లూమియర్ సినిమా బ్యానర్ లో ఆయన రూపొందించిన చిత్రం ‘హలో మీరా’ శుక్రవారం జనం ముందుకొచ్చింది. ఈ సైకలాజికల్ డ్రామాలోని సింగిల్ క్యారెక్టర్ ను ‘ఎవరికీ చెప్పొద్దు’ ఫేమ్ గార్గేయి యల్లాప్రగడ పోషించింది.

కథగా చెప్పుకోవాలంటే చాలా సింపుల్. మీరా (గార్గేయి) రెండేళ్ళుగా ప్రేమిస్తున్న కళ్యాణ్ తో పెళ్ళికి రెడీ అవుతుంది. హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న ఆమె ఎంగేజ్ మెంట్ కోసం సొంతూరు విజయవాడ వెళ్తుంది. రేపు నిశ్చితార్థం, ఎల్లుండి పెళ్ళి అనగా హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ కాల్ వస్తుంది! గతంలో మీరా ప్రేమించిన సుధీర్ ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడని, సూసైడ్ నోట్ లో ఆమె పేరు రాశాడని ఎస్. ఐ. విక్రమ్ చెబుతాడు. శుభమా అని పెళ్ళి చేసుకోబోతుంటే… ఈ పాత ప్రేమ గొడవ ఏమిట్రా దేవుడా అనుకుంటుంది మీరా. తనకు సుధీర్ తో ఎప్పుడో బ్రేకప్ అయిపోయిందని చెప్పినా ఎస్. ఐ. ఆమె మాట ఆలకించడు. అర్జెంట్ గా హైదరాబాద్ కు వచ్చి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయమని హుకుం జారీ చేస్తాడు. సుధీర్ తో ప్రేమాయణం గురించి ఫ్యామిలీ మెంబర్స్ కు చెప్పడం ఇష్టంలేని మీరా… హుటాహుటిన కారులో హైదరాబాద్ బయలు దేరుతుంది. సుధీర్ సూసైడ్ అటెమ్ట్ కు కారణం ఏమిటీ? మీరా హైదరాబాద్ చేరే లోపు కథ ఎలాంటి మలుపులు తిరిగింది? ఇంతకూ కళ్యాణ్ తో మీరా పెళ్ళి జరిగిందా లేదా? అనేది మిగతా కథ.

సహజంగా రెండు, మూడు క్యారెక్టర్స్ ఉన్న సినిమాలను సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ లో తీసేసి దర్శక నిర్మాతలు సేఫ్ గేమ్ ఆడుతుంటారు. కానీ ఈ మూవీ డైరెక్టర్ శ్రీనివాసు కాకర్ల అందుకు భిన్నంగా ఓ ఫ్యామిలీ డ్రామాను చూసిన భావన కలిగేలా దీన్ని తెరకెక్కించారు. సినిమా నిడివి గంటన్నరే అయినా… సింగిల్ క్యారెక్టర్ తో ఇంత తతంగాన్ని నడపాలంటే డైరెక్టర్ కు బోలెడంత అనుభవం ఉండాలి. సాంకేతిక పరమైన పరిజ్ఞానం ఉండాలి. అది తనకుందని శ్రీనివాసు కాకర్ల నిరూపించుకున్నారు. మనకు తెర మీద కనిపించేది కేవలం మీరా పాత్ర ఒక్కటే అయినా… ఆమెతో సంభాషించే పది, పదిహేను పాత్రలను, వాటి స్వరూప స్వభావాలను మనసులోనే ఊహించుకునేలా చేశారు దర్శకుడు. దృశ్య మాధ్యమంతో పాటు శబ్ద మాధ్యమం మీద కూడా ఆయనకి పట్టు ఉండటమే దీనికి కారణం. ఆ యా పాత్రల వయసుకు తగ్గ కళాకారులను ఎంపిక చేసుకుని వాయిస్ చెప్పించడంతో కళ్ళ ముందు ఆ పాత్రలు మెదిలేలా చేశారు. అందువల్ల ఇది సింగిల్ క్యారెక్టర్ మూవీ అనే భావన ఎక్కడా ప్రేక్షకుడికి కలగదు.

గార్గేయి యల్లాప్రగడ నటిగా ఇప్పుడిప్పుడే తన ప్రతిభను చాటుకుంటోంది. ఎలాంటి ఇమేజ్ లేని ఆమెతో ఈ పాత్రను చేయించడం ఓ రకంగా సాహసమే! అయితే, కాస్తంత పాపులర్ ఆర్టిస్టును తీసుకుని ఉంటే మూవీకి క్రేజ్ వచ్చేది. గార్గేయి అభినయానికి వంక పెట్టడానికి లేదు. చక్కటి మాడ్యులేషన్ తో సంభాషణలను పలికి మెప్పించింది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఎస్. చిన్న సంగీతం, ప్రశాంత్ కొప్పినీడి సినిమాటోగ్రఫీ. అలానే రాంబాబు మేడికొండ ఎడిటింగ్ కూడా బాగుంది. హిరణ్మయి కళ్యాణ్ రాసిన సంభాషణలు రేడియో నాటికను తలపించాయి. శరత్ సౌండ్ డిజైనింగ్, గీత ఎం. గురప్ప ఆడియోగ్రఫీ మూవీని మరో లెవల్ కు తీసుకెళ్ళాయి.

దర్శకుడు కాకర్ల శ్రీనివాస్ ప్రతిభను నమ్మి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన లక్ష్మణరావు, వర ప్రసాదరావు, పద్మ కాకర్ల ధైర్యానికి మెచ్చుకోవాలి. ఎందుకుంటే… ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ అన్ని వర్గాలను ఆకట్టుకోవు. ఓ రకంగా ఇదో ప్రయోగాత్మక చిత్రం. ఈతరం కాన్సెప్ట్ ఓరియెంటెడ్, థ్రిల్లర్ మూవీస్ ను ఇష్టపడుతున్నా… మరీ సింగిల్ క్యారెక్టర్ మూవీ అంటే ఆసక్తి చూపకపోవచ్చు. ఈ సినిమాను థియేటర్లలో కంటే ఓటీటీలో రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. మేకర్స్ కు మంచి అప్లాజ్ వచ్చేది. పనిగట్టుకుని థియేటర్ కు వెళ్ళే ప్రేక్షకుడు సహజంగా పంచభక్ష్య పరమాన్నం లాంటి సినిమా చూడాలనుకుంటాడు. ఒకే డిష్ ను అద్భుతంగా వండి వడ్డిస్తామంటే నిరుత్సాహపడతాడు. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. అయితే… రొటీన్ కు భిన్నంగా ఎంగేజింగ్ అండ్ ఎక్సపర్మెంటల్ గా ఈ మూవీని తీయడమే కాకుండా… చక్కటి ఫ్యామిలీ వాల్యూస్ ను అందించిన టీమ్ ను అభినందించాలి.

రేటింగ్ : 2.5/5

ప్లస్ పాయింట్స్
సైకలాజికల్ డ్రామా కావడం
సింగిల్ క్యారెక్టర్ తో తీయడం
సౌండ్ డిజైనింగ్, దర్శకత్వ ప్రతిభ

మైనస్ పాయింట్స్
పాపులర్ ఆర్టిస్ట్ ను పెట్టకపోవడం
నిర్మాణపరమైన పరిమితులు

ట్యాగ్ లైన్: ఎక్సపర్మెంటల్… మీరా!

Show comments