NTV Telugu Site icon

Satya Review: ‘సత్య’ రివ్యూ!

Satya Movie 2024

Satya Movie 2024

నటీనటులు : హమరేశ్, ప్రార్ధన సందీప్, ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ
సంగీతం– సుందరమూర్తి కె.యస్
నిర్మాత– శివ మల్లాల
రచన–దర్శకత్వం– వాలీ మోహన్‌ దాస్

తమిళంలో హిట్లుగా నిలిచిన ఎన్నో సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసే ట్రెండ్ ఇప్పటిది కాదు. చాలా రోజుల నుంచి ఇలాంటి సినిమాలు మనం చూస్తూనే ఉన్నాము. నచ్చిన వాటిని ఆదరిస్తూనే ఉన్నాం. ఇప్పుడు తమిళంలో హిట్గా నిలిచిన రంగోలి అనే సినిమాని తెలుగులో సత్య అనే పేరుతో రిలీజ్ చేశారు. తమిల్ లో స్టార్ డైరెక్టర్గా ఉన్న ఏఎల్ విజయ్ మేనల్లుడు హమరేష్ హీరోగా ప్రేమలు డైరెక్టర్ గిరీష్ ఏడి అన్న కూతురు ప్రార్థన సందీప్ హీరోయిన్గా ఈ సినిమా తెరకెక్కింది. వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో మంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు జర్నలిస్ట్, తర్వాత కాలంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా మారిన శివ మల్లాల తీసుకొచ్చారు. వాస్తవానికి ఈ రోజే రిలీజ్ అవుతున్న మీడియాకి మాత్రం ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

సత్య కథ:
చెన్నైలో జరిగిన కథని మన తెలుగు నేటివిటీకి తగినట్లు విశాఖపట్నం కి అడాప్ట్ చేశారు. విశాఖపట్నంలో గాంధీ (ఆడుకాలం మురుగదాసు) తన భార్య కుమార్తె కుమారుడితో కలిసి జీవనం సాగిస్తూ ఉంటాడు. బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే వృత్తిలో ఉన్న గాంధీ ముందు తన స్థాయికి తగ్గట్టు కొడుకుని గవర్నమెంట్ కాలేజీలోనే ఇంటర్ చదివిస్తూ ఉంటాడు. ఒకరోజు కాలేజీలో జరిగిన గొడవ వల్ల పోలీసులు గాంధీ కొడుకు సత్య(హమరేష్)ని అరెస్టు చేయడంతో గవర్నమెంట్ కాలేజీలో ఉంటే ఇలాగే గొడవలు పడుతూ ఉంటాడని భార్యాభర్తలు మాట్లాడుకుని ప్రైవేటు కాలేజీలో జాయిన్ చేస్తారు. అయితే అంతా డబ్బున్న వాళ్ళు ఎక్కువగా చదివే ప్రైవేటు కాలేజీలో సత్య ఇమడ లేక పోతాడు. దానికి తోడు అక్కడే చదివే పార్వతి (ప్రార్థన) మీద మనసు పారేసుకుంటాడు. అయితే అదే కాలేజీలో చదివే మరో గ్యాంగ్ తో ప్రతిరోజు సత్యకి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. దానికి తోడు ప్రైవేట్ కాలేజీలో చదువు కావడంతో దానికోసం గాంధీ అప్పుల పాలవుతాడు. అయితే ఈ నేపథ్యంలో సత్య ఒక కీలక నిర్ణయం తీసుకుంటాడు. సత్య తీసుకున్న కీలక నిర్ణయం ఏమిటి? పార్వతి సత్యను ఎందుకు అందరి ముందు లాగిపెట్టి కొడుతుంది? అదే పార్వతి సత్య వెంట మళ్ళీ ఎందుకు పడుతుంది? అసలు చివరికి ఏమవుతుంది? అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ:
స్కూల్ , కాలేజ్ లవ్ స్టోరీ అనే బ్యాక్ డ్రాప్ లో ఇప్పటికే మనం కొన్ని సినిమాలు చూశాం. టెన్త్ క్లాస్, నిర్మలా కాన్వెంట్ లాంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు దాదాపుగా ఈ సత్య సినిమా కూడా అదే కాన్సెప్ట్ లో తెరకెక్కింది. ఒక గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే కుర్రాడు చెడిపోతున్నాడేమో అని తల్లిదండ్రులు ఒక ప్రైవేటు కాలేజీలో చేర్చాలని నిర్ణయానికి రావడం, అందుకోసం అప్పటికే అప్పుల్లో ఉన్నా మళ్లీ అప్పు చేసి జాయిన్ చేయడానికి సిద్ధం అవ్వడం లాంటి సన్నివేశాలు చాలామందికి కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. నిజానికి సినిమా మొదలైన కొంచెం సేపటి వరకు ఏదో సాగిపోతుందిలే అనిపిస్తుంది కానీ ఒక్కసారి కథ ఓపెన్ అయిన తర్వాత చాలా రియలిస్టిక్ అనిపిస్తుంది. నిజానికి గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకున్న లేదా ప్రైవేట్ కాలేజీల్లో చదువుకున్న చాలా మందికి కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది. కథగా చెప్పుకుంటే అద్భుతం అని చెప్పలేం కానీ స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ చేసిన మ్యాజిక్ మాత్రం అందరికీ గుర్తుండిపోయేలా చేస్తుంది. మొదటి సినిమానే అయినా దర్శకుడు మేకింగ్ మాత్రం ఆసక్తికరంగా ఉంది. విజువల్ స్టోరీ టెల్లింగ్ దాదాపు తగ్గిపోతున్న తరుణంలో దర్శకుడు మాత్రం కొన్ని సీన్స్ లో దాన్నే వాడుకుని అందరినీ అలరించాడు. వాస్తవానికి సత్య కథగా చెప్పుకోవాలంటే ఒక సింపుల్ లైన్. కానీ పరిస్థితులకు అనుగుణంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు రెండు గంటల పైగా ఎంగేజ్ చేసే విషయంలో దర్శకుడు చాలా వరకు సఫలమయ్యాడు. కాలేజీలో గొడవలు, నచ్చిన అమ్మాయితో క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీ. తల్లిదండ్రుల బాధలు చూడలేక హీరో తీసుకునే నిర్ణయాలు లాంటి విషయాలు చాలామందికి కనెక్ట్ అవుతాయి. చిన్న చిన్న లోపాలు పక్కన పెడితే కథతో కథనంతో చాలామంది కనెక్ట్ అవుతారు.

నటీనటుల విషయానికి వస్తే:
చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలలో కనిపించిన హమరేష్ ఈ సినిమాతో పూర్తిస్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నిజానికి అమరేష్ ని చూడగానే జీవి ప్రకాష్ కుమార్ లైట్ వెర్షన్లా అనిపిస్తాడు. కానీ యాక్టింగ్ విషయంలో మాత్రం తనదైన మార్క్ కనిపిస్తోంది. టీనేజ్ కుర్రాడిగా జీవించాడు. ఇక పార్వతి అనే పాత్రలో ప్రార్థన కూడా ఒక రేంజ్ లో నటించింది. హమరేష్ తో ప్రార్థన జోడి భలే క్యూట్ అనిపించింది. వీరిద్దరి పాత్రలు చూసి తమ కాలేజ్ డేస్ లోకి వెళ్ళిపోయేలా వీరి నటన ఉంటుంది. హమరేష్ తండ్రి పాత్రలో నటించిన మురుగదాస్ నటన కూడా అందరికీ గుర్తుండిపోతుంది. పిల్లల కోసం తమ తండ్రి పడే తపన, కొడుకుతో అతని కెమిస్ట్రీ గుర్తుండిపోయేలా ఉంటుంది. ఇక మిగతా పాత్రధారులు తమ తమ పాత్రలు పరిధి మేరకు ఆకట్టుకున్నారు. టెక్నికల్ విషయానికి వస్తే అసలు ఎక్కడా ఇది డబ్బింగ్ సినిమా అనే డౌటే రాకుండా డైలాగ్స్ రాసుకున్నారు విజయ్ కుమార్. అలాగే పాటలు కూడా ఒరిజినల్ సాంగ్స్ లాగా ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. రాంబాబు గోసాల పనితనం పాటలన్నింటిలో కనిపించింది. తమిళంతో పోలిస్తే ఇక్కడ తెలుగులో యాడ్ చేసిన క్లైమాక్స్ ఆసక్తికరంగా ఉంది. సినిమాటోగ్రఫీ చాలా ప్లజంట్ గా అనిపించింది. ఎడిటింగ్ కూడా సినిమాకి తగ్గట్టు క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ఫైనల్లీ:
సత్య ఒక క్యూట్ కాలేజ్ లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్.. అంచనాలు లేకుండా థియేటర్లకు వెళితే కాలేజీ రోజులు తలుచుకుంటూ బయటకు వస్తారు.

 

Show comments