ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తనయుడు లక్ష్ ఆ మధ్య ‘వలయం’ మూవీతో మరోసారి హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుండి వరుసగా సినిమాలు చేయడం మొదలెట్టాడు. ఆ క్రమంలో ఈ శుక్రవారం అతని తాజా చిత్రం ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ విడుదలైంది. విశేషం ఏమంటే ఈ సినిమాను తమిళంలోనూ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ విడుదల చేసింది.
ఇది దేవరలంక అనే గ్రామంలో జరిగే కథ. ఎమ్మెల్యే శివారెడ్డి మరణంతో ఆయన అనుచరులైన సిద్దప్ప, నర్సారెడ్డి ఎమ్మెల్యే పదవి కోసం పాకులాడుతూ ఉంటారు. ఈ ఇద్దరు గ్యాంగ్ స్టర్స్ ఆ ఊరిని తమ చెప్పుచేతుల్లో ఉంచుకుంటున్న సమయంలోనే గంగరాజు అనే యువకుడు సిద్ధప్పను హత్య చేసి కొత్త గ్యాంగ్ స్టర్ గా అవతరిస్తాడు. అదే ఊరికి ఎస్.ఐ. గా వచ్చిన ఉమాదేవితో గంగరాజు ప్రేమలో పడతాడు. ఈ గ్యాంగ్ స్టర్ కు – పోలీస్ ఆఫీసర్ కు మధ్య ఏర్పడిన ప్రేమ బంధం ఎలాంటి పరిస్థితులకు దారితీసింది? సిద్ధప్ప మరణం తర్వాత గ్యాంగ్ స్టర్ గంగరాజుకు నర్సారెడ్డి ఎందుకు టార్గెట్ అయ్యాడు? బావ నర్సారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని బావమరిది బసిరెడ్డి ఎలాంటి అరాచకాలు చేశాడు? తండ్రి సిద్దప్ప హత్యతో కొడుకు రుద్రప్ప ఏ విధంగా పగ తీర్చుకున్నాడు? అనేదే ఈ చిత్ర కథ.
సాధారణ జీవితాన్ని గడిపే ఓ కుర్రాడు రాత్రికి రాత్రి గ్యాంగ్ స్టర్ గా మారిపోవడానికి బలమైన కారణాలే ఉండాలి. అలాంటి పరిస్థితుల్ని దర్శకుడు ఇషాన్ సూర్య చాలా ఆసక్తికరంగా ఈ కథలో ఇన్ సర్ట్ చేశాడు. దానికి తోడు ఫాదర్, మదర్, సిస్టర్, లవర్ సెంటిమెంట్స్ ను సమయానుకూలంగా జత చేశాడు. ఇటు తన బలహీనతను బయట పెట్టుకోలేక, అటు బరితెగించి విలన్స్ తో పోరాడలేక హీరో సతమతమవడం వినోదాన్ని పుట్టించింది. సెకండ్ హాఫ్ లో దానిపై డైరెక్టర్ ఎక్కువ దృష్టి పెట్టాడు. దాంతో సినిమా అంతా సరదాగా సాగిపోయింది. ఈ కథను ఇంకాస్తంత పకడ్బందీగా తయారు చేసుకుని ఉంటే బాగుండేది. కథలో చాలానే లూప్ హోల్స్ ఉన్నాయి. ఎస్. ఐ. ఉమాదేవి ఉద్యోగ ధర్మాన్ని పక్కన పెట్టి, కాబోయే భర్త గంగరాజును పగ తీర్చుకోమని చెప్పడం సమంజసంగా లేదు. నర్సిరెడ్డి చేసిన దారుణాలు ఆమె దృష్టికి వచ్చినా స్పందించపోవడం ప్రధాన లోపమనే చెప్పాలి. తాను పోలీస్ ఆఫీసర్ అనే విషయాన్ని ఆ పాత్ర మర్చిపోనట్టుగా ఉంది! హీరో క్యారెక్టర్ ఎలివేషన్ కోసం అలా చేసినా, అది సమంజసంగా అనిపించదు. మాస్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని లాజిక్స్ జోలికి పోకుండా దర్శకుడు ఇషాన్ సూర్య ఈ మూవీని తీశాడు. సెంటిమెంట్ తో పాటు వినోదానికి తగిన చోటు కల్పించాడు. ఒకటి రెండు పాటలు యూత్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి.
నటీనటుల్లో లక్ష్ యాక్షన్ సన్నివేశాలే కాదు ఎంటర్ టైన్ మెంట్స్ సీన్స్ కూడా తాను బాగా చేయగలననిపించాడు. ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వేదిక దత్ తెర మీద చూడటానికి బాగానే ఉంది. పోలీస్ గెటప్ ఆమెకు నప్పించింది. హీరో స్నేహితుడు ఆత్రేయగా రవితేజ నన్నిమాల చక్కని హాస్యాన్ని కనబరిచాడు. అతని బాడీ లాంగ్వేజ్ లో మంచి ఈజ్ ఉంది. (ఇదే రోజు విడుదలైన ‘సమ్మతమే’ మూవీలోనూ హీరో స్నేహితుడిగా రవితేజ నటించాడు). అలానే ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో అందరి దృష్టినీ ఆకర్షించిన గోపరాజు రమణ ‘సమ్మతమే’లో మాత్రమే కాదు.. ఇందులోనూ హీరో తండ్రిగా నటించాడు. ఆయన మీద చిత్రీకరించిన సన్నివేశాలు బాగున్నాయి. ‘వెన్నెల’ కిశోర్ పాత్ర ఈ మూవీకి అదనపు ఆకర్షణ. ఇతర ప్రధాన పాత్రలను శ్రీకాంత్ అయ్యంగార్, చరణ్ దీప్, సమ్మెట గాంధీ, రాజేంద్ర, రాజేశ్వరీ నాయర్, సత్యకృష్ణ, అను మానస, లావణ్యరెడ్డి తదితరులు పోషించారు. సహజనటి జయసుధ తనయుడు నిహార్ కపూర్ ఓ కీలక పాత్రను పోషించడం విశేషం. అన్నపూర్ణమ్మ కనిపించేది ఒక్క సీన్ లోనే అయినా కామెడీ బాగానే పండించింది.
దర్శకుడు ఇషాన్ సూర్యకు ఇది మొదటి సినిమానే అయినా నటీనటుల నుండి నటన చక్కగా రాబట్టాడు. కన్నా సినిమాటోగ్రఫీ, సాయికార్తీక్ నేపథ్య సంగీతం బాగున్నాయి. నిర్మాత తనయుడే హీరో కావడంతో ఖర్చు విషయంలో వెనకాడలేదు. అయితే కథను మరింత సానబెట్టి, ఇంకాస్త ఆసక్తికరంగా తెరకెక్కించి ఉండాల్సింది.
రేటింగ్: 2.25 /5
ప్లస్ పాయింట్స్
ఆకట్టుకునే వినోదం
సాయికార్తీక్ నేపథ్య సంగీతం
డ్రాగన్ ప్రకాశ్ యాక్షన్ కొరియోగ్రఫీ
మైనెస్ పాయింట్స్
లాజిక్ లేని కథ
ఆసక్తి కలిగించని కథనం
ట్యాగ్ లైన్: ఫేక్ స్టార్ గంగరాజు!