NTV Telugu Site icon

Gandharwa Movie Review : గంధర్వ రివ్యూ

Ghandarwa Movie Review

Ghandarwa Movie Review

ఓ వ్యక్తి యాభై ఏళ్ళ పాటు కోమాలో ఉండటం అనేది జరుగుతుందా? ఒకవేళ అలా ఉండి, ఆ తర్వాత బతికి బట్టకడితే అతని పరిస్థితి ఏమిటి? ఐదు దశాబ్దాల కాలంలో ఈ సమాజంలో అన్ని రంగాల్లోనూ వచ్చిన ఊహకందని మార్పులను చూసి వయసు పెరగని ఆ వ్యక్తి తట్టుకోగలడా? మరీ ముఖ్యంగా అతని కుటుంబ సభ్యులు అతన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ‘గంధర్వ’ సినిమా! గతంలో ప్రముఖ రచయిత ఎన్. ఆర్. నంది ‘సిగ్గు సిగ్గు’ పేరుతో ఓ నవల రాశారు. అందులో కథానాయకుడు స్వతంత్ర సమరయోధుడు. కొన్ని దశాబ్దాల పాటు కోమాలో ఉండి ఆ తర్వాత స్పృహలోకి వస్తాడు. అన్ని విధాలుగా కలుషితమైన ఈ సమాజాన్ని చూసి తట్టుకోలేకపోతాడు. ఈ సినిమా చూస్తుంటే కొందరికి ఆ నవల గుర్తొచ్చే ఆస్కారం ఉంది. అలానే ఆ మధ్య వచ్చిన రవితేజా ‘డిస్కో రాజా’లోని హీరో క్యారెక్టర్ గుర్తొస్తుంది. అప్పుడెప్పుడో వచ్చిన మహేశ్ బాబు ‘నాని’లోని కొన్ని సన్నివేశాలూ జ్ఞప్తికి వస్తాయి. అయితే కథ, కథనాల పరంగా వాటికి పూర్తి భిన్నమైన సినిమా ‘గంధర్వ’. అఫ్సర్ దర్శకత్వంలో సుభానీ అబ్దుల్ నిర్మించిన ఈ సినిమా సురేశ్ కొండేటి నిర్మాణ సారధ్యంలో శుక్రవారం జనం ముందుకు వచ్చింది.

ఇదో సోల్జర్ కథ. వాల్తేర్ కు చెందిన అవినాశ్‌ ఆర్మీలో పనిచేస్తుంటాడు. పెద్దలు చూసిన అమూల్య (గాయత్రి సురేశ్) అనే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. భార్య కాళ్ళ పారాణి ఆరకముందే… ఇండో-పాక్ వార్ లో పాల్గొనాల్సిందిగా పై అధికారుల నుండి అతనికి పిలుపు వస్తుంది. హుటాహుటిన బోర్డర్ కు బైలు దేరతాడు. బంగ్లా విముక్తి పోరాటంలో కెప్టెన్ అవినాశ్ మరణించినట్టు అధికారులు చెబుతారు. అయితే అది వాస్తవం కాదు. యుద్థ సమయంలో ఓ లోయలో పడిపోయిన అవినాశ్ యాభై ఏళ్ళ పాటు కోమాలో ఉండి 2021లో తిరిగి స్పృహలోకి వస్తాడు. చిత్రంగా అతని వయసు మాత్రం పెరగదు. యువకుడిగానే ఉంటాడు. తన వాళ్ళను వెతుక్కుంటూ వచ్చిన అవినాశ్ కు సొంత వూరిలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అనేది ఈ చిత్ర కథ.

ఇలాంటి నమ్మశక్యం కాని కథను డీల్ చేయాలంటే ముందు దర్శకుడికి కన్విక్షన్ ఉండాలి. ఈ అంశానికి సంబంధించి లోతైన పరిశోధన చేయాలి. థియేటర్ లోని ప్రేక్షకులకు ఇలా జరిగే ఆస్కారం ఉందనే నమ్మకం కలిగించాలి. ఆ విషయంలో దర్శకుడు అఫ్సర్ సక్సెస్ అయ్యారు. మన మధ్య జరిగిన కొన్ని సంఘటనలను రుజువులుగా చూపించి, కెప్టెన్ అవినాశ్ విషయంలో ఇలాగే జరిగి ఉంటుందని నమ్మేలా చేశారు. అయితే… యాభై యేళ్ళ తర్వాత సమాజంలోకి వచ్చిన అవినాశ్ పాత్రను మలచడంలో దర్శకుడు కొన్ని పరిమితులు పెట్టుకున్నాడు. జనం పిచ్చివాడు అనుకుంటారేమోననే ఒకే ఒక్క సందేహంతో హీరో తన ఉనికిని చాటుకోకపోవడం కరెక్ట్ కాదు. ఏదో ఒక స్థాయిలో అతను అందుకై ప్రయత్నించి ఉండాల్సింది. తన కుటుంబ సభ్యుల నుండి యాక్సెప్టెన్సీ కోసం హీరో వేచి చూడాలనుకోవడంలోనూ అర్థం లేదు. మనవడిని సరైన దారిలోకి తీసుకొచ్చిన అవినాశ్, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే కొడుకునూ కట్టడి చేసినట్టు చూపించి ఉంటే ఆ పాత్ర మరింతగా ఎలివేట్ అయ్యేది. కానీ ఆ దిశగా దర్శకుడు ఆలోచన చేయలేదు. రాష్ట్ర రాజకీయ రంగంలో జరుగుతున్న మార్పులకు, కెప్టెన్ అవినాశ్ పునరాగమనానికి మధ్య మరింత ఆసక్తికరమైన సన్నివేశాలను రాసుకుని ఉండాల్సింది. అయితే రెండు గంటల పది నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండానే సాగింది. హీరో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వయసు పైబడిన భార్యతో సాగించే ప్రణయం నుండి కాస్తంత కామెడీని, అలానే రెండు పాటలను సృష్టించడంతో సాధారణ ప్రేక్షకుడికి కాస్తంత రిలీఫ్ దక్కింది.

సందీప్ మాధవ్ ఆర్మీ జవాన్ గా బాగానే నటించాడు. అయితే అతని వాయిస్ ఆ పాత్రకు అంతగా నప్పలేదు. మరింత గంభీరంగా ఉండాల్సింది. మలయాళ భామ గాయత్రి సురేశ్ కు తెలుగులో ఇది మూడో సినిమా. ఇందులో బాగా వేరియేషన్స్ ఉన్నది ఆమె క్యారెక్టర్ కే! నటిగా ఫర్వాలేదనిపించింది. సీతల్ భట్ గ్లామర్ కే పరిమితమైంది. సాయికుమార్, సురేశ్, బాబూమోహన్ వంటి సీనియర్స్ నటించడం సినిమాకు ప్లస్ అయ్యింది. ఇటీవల తెరపైన కూడా కనిపిస్తున్న డైరెక్టర్ వీరశంకర్ ఇందులోనూ ఓ కీలక పాత్ర పోషించారు. ఇతర ప్రధాన పాత్రలలో సమ్మెట గాంధీ, ఆటో రాంప్రసాద్, పోసాని, రూపలక్ష్మీ తదితరులు కనిపిస్తారు. నటి రోహిణీ ఈ మధ్య హాస్య ప్రధానమైన పాత్రలను చేస్తోంది. తెలుగులో లేడీ కమెడియన్లు లేని లోటును ఆమె తీర్చుతోంది. అదే బాటలో సాగితే బాగానే ఉంటుంది. జవహర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ర్యాప్ రాక్ షకీల్ సంగీతం బాగున్నాయి. తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్న అప్సర్ ఈ కథను బాగానే డీల్ చేశారు. భారీ అంచనాలు పెట్టుకోకుండా ‘గంధర్వ’ను చూస్తే ఫర్వాలేదనిపిస్తుంది.

 

ప్లస్ పాయింట్స్
సైంటిఫిక్ థ్రిల్లర్ కావడం
సీనియర్స్ యాక్టింగ్
సినిమాటోగ్రఫీ, మ్యూజిక్

మైనెస్ పాయింట్స్
తేలిపోయిన పతాక సన్నివేశం
పండని ఎమోషన్ సీన్స్

ట్యాగ్ లైన్: సైంటిఫిక్ థ్రిల్లర్!