NTV Telugu Site icon

Fighter Review: హృతిక్ రోషన్ ‘ఫైటర్’ రివ్యూ!

Fighter Review

Fighter Review

Siddharth Anand’s Fighter Movie Review: హృతిక్ రోషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలెట్ గా నటించిన తాజా చిత్రం ఫైటర్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెకెక్కిన ఈ సినిమాలో హృతిక్ రోషన్ షంషేర్ పఠానియా అలియాస్ ప్యాటీ అనే పాత్రలో నటించాడు. ఆయన సరసన దీపికా పదుకునే హీరోయిన్ గా నటించింది. 2019లో జరిగిన పుల్వామా అటాక్ నేపథ్యంలో తెరకెక్కిన నేపథ్యంలో ఈ సినిమా మీద అందరిలో ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ఈ సినిమా ట్రెయిలర్ కట్ కూడా మరిన్ని అంచనాలు పెంచింది. అంతకుమించి ఈ సినిమాని వార్ అలాగే పటాన్ సినిమా డైరెక్ట్ చేసిన సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేయడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇండియా 75వ రిపబ్లిక్ డే సందర్భంగా ఒకరు రోజు ముందే అంటే జనవరి 25న ఫైటర్ చిత్రం రిలీజ్ అయింది. ఫైటర్ మూవీని 3డీ ఐమాక్స్ ఫార్మాట్ లో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూసి తెలుసుకుందాం.

ఫైటర్ కథ:
షంషేర్ పఠానియా అలియాస్ ప్యాటీ(హృతిక్ రోషన్) ఒక ఎయిర్ ఇండియా ఫైటర్ పైలట్. దేశంలో ఉన్న బెస్ట్ ఫైటర్ పైలట్స్ అందరినీ శ్రీనగర్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఒక స్పెషల్ పోస్టింగ్ కోసం పిలిపించడంతో అక్కడికి వెళతాడు. ఎయిర్ డ్రాగన్ అనే ఒక స్పెషల్ యూనిట్ ని సిద్ధం చేస్తారు. అందులో తన ర్యాంక్ లోనే ఉన్న మిన్ని అలియాస్ మీనల్ రాథోడ్(దీపికా పదుకునే) పరిచయం అవుతుంది. మరొక పక్క జైషే అనే ఉగ్రవాద సంస్థ భారత్లో పుల్వామా ప్రాంతంలో సిఆర్పిఎఫ్ జవాన్ల మీద ఒక భారీ అటాక్ జరుగుతుంది. దానికి పగ తీర్చుకోవడం కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లోని బాలాకోట్ లో ఉన్న సదరు ఉగ్రవాద సంస్థ శిక్షణ శిబిరాలని ధ్వంసం చేసి వందలాదిమంది మిలిటెంట్లను మట్టుబెడతారు. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాలలో అనుకోకుండా ఒక సుఖోయ్ యుద్ధ విమానం పాక్ లో ద్వంశం కావడంతో అందులో ఉన్న ఇద్దరు పైలెట్లు పారాచూట్ ల సాయంతో పార్క్ భూభాగంలో దిగాల్సి వస్తుంది. వారిని రక్షించడం కోసం ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఏం చేసింది? వారి వెంటనే ఉన్న పార్టీ వాళ్ళని ఎందుకు కాపాడలేక పోయాడు? ఆ తర్వాత అతన్ని హైదరాబాద్ ఎందుకు పంపించారు? చివరికి వారిని రక్షించి భారత్ తీసుకువచ్చారా లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: సిద్ధార్థ ఆనంద్ గత సినిమాలు వార్ అలాగే పఠాన్ చూసిన తర్వాత ఈ సినిమా మీద కూడా ఒక రకమైన అంచనా ఏర్పడడం ఖాయం.. దానికి తోడు హృతిక్ రోషన్ చాలా కాలం తర్వాత ఇలాంటి సినిమా చేయడంతో పాటు అతనికి జోడిగా దీపిక పడుకునే నటించడం ఆసక్తికరంగా మారింది. అనిల్ కపూర్, వినయ్ వర్మ, అశుతోష్ రానా వంటి వారు ఇతర కీలకపాత్రలలో నటిస్తూ ఉండడంతో సాధారణంగానే సినీ ప్రేమికులందరూ ఈ సినిమా మీద ఆసక్తి కనబరిచారు. ఆ ఆసక్తిని మరింత పెంచే విధంగా ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు సిద్ధార్థ్ ఆనంద్. నిజానికి భారత్లో పాకిస్తాన్ కి వ్యతిరేకంగా సినిమాలు చేస్తే ఆడతాయని ఒక భ్రమ ఉంటుంది. కానీ సినిమాలో కంటెంట్ లేకపోతే ఎవరేమీ చేయలేరు అనే విషయాన్ని చాలా సినిమాల మేకర్స్ మరిచిపోయి ప్రేక్షకుల ముందుకు వచ్చి బోల్తా పడ్డారు. కానీ హృతిక్ రోషన్ లాంటి బడా స్టార్ని పెట్టుకుని సిద్ధార్థ ఆనంద్ ఒక మంచి దేశభక్తితో కూడిన కమర్షియల్ సినిమాని డైరెక్ట్ చేశాడు. మరీ ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని నేపథ్యంగా తీసుకోవడంతో ఈ సినిమాని ఎలా డీల్ చేస్తారనే విషయం మీద ముందు నుంచి కొన్ని అనుమానాలు ఉన్నాయి. కానీ ఆ అనుమానాలని పటాపంచలు చేస్తూ అద్భుతమైన విజువల్స్ తో ఒక ఆట ఆడుకున్నాడు డైరెక్టర్. ఈ సినిమాలో హ్యూమన్ ఎమోషన్స్ని టచ్ చేసిన విధానం బాగుంది. నిజానికి సినిమా ప్లాట్ విషయానికి వస్తే అసలు ఇందులో కొత్తగా చెప్పుకోదగ్గ అంశాలేవీ లేవు. రొటీన్ కథనే ఆసక్తికరంగా ప్రేక్షకుల ముందు తీసుకువచ్చే విషయంలో డైరెక్టర్ సఫలమయ్యాడు. హిందీలో ఇప్పటికే వచ్చిన ఎన్నో సినిమాల లాగానే ప్రతి భారతీయుడు శత్రువుగా భావించే పాకిస్తాన్ మీద ఎలా పగ తీర్చుకున్నారు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. పుల్వమా అటాక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ వంటి విషయాలను చూపిస్తూనే మరోపక్క అభినందన్ వర్ధమాన్ విషయాన్ని లింక్ చేస్తూ కొంచెం డ్రమటైజ్ చేస్తూ సినిమాని తెరకెక్కించినట్టు అనిపించింది. సినిమా చూస్తున్నంత సేపు కళ్ళు తిప్పుకోనివ్వకుండా ఉన్న విజువల్స్ సినిమాకి ప్లస్ పాయింట్. అయితే కాస్త సాగదీసినట్లుండే స్క్రీన్ ప్లే కొంచెం ఇబ్బందికరమనిపిస్తుంది. కొన్ని డైలాగ్స్ ఓవర్గా అనిపించినా మనలోని భారతీయుడిని ఆనందింపచేస్తాయి. సుఖోయ్ యుద్ధ విమానాలతో చేయించిన విన్యాసాలు వారెవ్వా అనిపించేలా ఉన్నాయి. ఈ విషయంలో డైరెక్టర్, యాక్షన్ డైరెక్టర్స్ తో పాటు విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

ఇక నటీనటుల విషయానికి వస్తే ఎప్పటిలాగే హృతిక్ రోషన్ వన్ మ్యాన్ షో అనిపించాడు. మనోడు ఏమీ చేయకుండా అలా జస్ట్ నడిచి వస్తున్న కూడా భలే ఉన్నాడు రా అనిపించేలా పిక్చరైజ్ చేశారు. అనిల్ కపూర్ అనుభవం చాలా సీన్స్ లో కనిపించింది. తెలుగువాడైన వినయ్ వర్మ కూడా ఆకట్టుకునే విధంగా నటించాడు. దీపికా పదుకొనే గ్లామర్ రోల్ కాకుండా ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్ర చేయడంతో ఆమెకు కూడా నటించే స్కోప్ దక్కింది. ఇక మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రలో పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. కానీ టెర్రరిస్ట్ పాత్రలో కనిపించిన మెయిన్ విలన్ మాత్రం ఎందుకో వింతగా అనిపించాడు, అతని నటన కూడా సో సో గానే ఉంది. ఫైటర్ టెక్నికల్ అంశాల విషయానికి వొస్తే సచ్చిత్ పౌలోస్ సినిమాటోగ్రఫీ అత్యున్నతంగా ఉంది. ఎడిటర్ ఆరిఫ్ షేక్ ఈ సినిమాకి పేసీ రిథమ్‌ను అందించాడు. డాన్స్ కి పెద్దగా స్కోప్ లేదు దాన్ని ఆశించడం కూడా మూర్ఖత్వం అవుతుంది. సిద్ధార్థ ఆనంద్ తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.

ఫైనల్లీ: ఫైటర్ ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ.. అంచనాలు లేకుండా ధియేటర్లకు వెళితే నచ్చుతుంది.