NTV Telugu Site icon

Connect Movie Review: కనెక్ట్ మూవీ రివ్యూ

Connect

Connect

కనెక్ట్ మూవీ రివ్యూ

నిడివి: 99 నిమిషాలు
రిలీజ్: 22-12-2022
నటీనటులు: నయనతార, సత్యరాజ్, అనుపమ్ ఖేర్, వినయ్ రాయ్, హనియా నఫీస్
కెమెరా: మణికంఠన్ కృష్ణమాచారి
ఎడిటింగ్: రిచర్డ్ కెవిన్
మ్యూజిక్: పృథ్వీ చంద్రశేఖర్
నిర్మాత: విఘ్నేష్ శివన్
దర్శకత్వం: అశ్విన్ శరవణన్

ఈ ఏడాది నయనతార నటించిన మూడు సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. వాటిలో
చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసకున్న ‘గాడ్ ఫాదర్’ ఒక్కటే సక్సెస్ అనిపించుకుంది. ఇక ఈ
శుక్రవారం తనే ప్రధాన పాత్రధారిణిగా హారర్ థ్రిల్లర్ ‘కనెక్ట్’ విడుదలైంది. తమిళంలో నయన్ భర్త
విఘ్నేష్ శివన్ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో యువీ క్రియేషన్స్ సంస్థ విడుదల చేసింది.
మరి ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందో చూద్దాం.

కథ విషయానికి వస్తే… జోసెఫ్ (వినయ్ రాయ్), వృత్తిరీత్యా వైద్యుడు. అతను భార్య సుసాన్
(నయనతార), కుమార్తె అన్నా (హనియా నఫీసా)తో ఉంటారు. సుసాన్ తండ్రి ఆర్థర్
(సత్యరాజ్). విదేశాల్లో సంగీతాన్ని నేర్చుకోవాలనే కుమార్తెతో సుసాన్ చదువు పూర్తయిన
తర్వాత చేయమని సలహా ఇస్తుంది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్
ప్రకటించడం వారి జీవితాలను తలక్రిందులు చేస్తుంది. ఎంతో మందికి ప్రాణదానం చేసిన డాక్టర్
జోసెఫ్ ఆ వ్యాధికే బలవుతాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేని అన్నా దివంగత తండ్రితో
కమ్యూనికేట్ చేయడానికి ఓయిజా బోర్డు ఉపయోగిస్తుంది. దాంతో ఓ దుష్ట ఆత్మ అన్నాను
ఆవహిస్తుంది. ఆర్థర్, సుసాన్‌ ముంబైకి చెందిన పూజారి (అనుపమ్ ఖేర్)ని ఆశ్రయిస్తారు. ఆ
పూజారి ఏం చేస్తాడు? ఆర్ధర్, సుసాన్, ప్రయత్నం నెరవేరిందా? అన్నా మమూలు మనిషి
అయిందా? అన్నదే ‘కనెక్ట్’ సినిమా.

దర్శకుడు అశ్విన్ శరవణన్ చాలా థిన్ లైన్ ఎంపిక చేసుకున్నాడు. హాలీవుడ్ సినిమాల్లాగా
తక్కువ నిడివితో తెరకెక్కించాడు. కానీ గత నాలుగైదు దశాబ్దాలకు పైగా మనం చూస్తున్న
హారర్-థ్రిల్లర్‌ సినిమాల సంకలనంలాగే అనిపిస్తుందీ సినిమా. ఎక్కడా కొత్తదనం లేదు. ఒక్క
కోవిడ్ నేపథ్యం తప్ప. ఆ నేపథ్యం ఎంచుకోకుంటే మొదటికే మోసం వచ్చేది. అశ్విన్ ఇంతకు
ముందు తీసిన ‘మాయ, గేమ్ ఓవర్, ఐరావతం’ చిత్రాలతో దర్శకుడుగా కొంత నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. అయితే 50 సంవత్సరాల క్రితం వచ్చిన హారర్, థ్రిల్లర్ సినిమాలే ఆడియన్స్ ను ఎంతగానో భయపెట్టిన నేపథ్యంలో సాంకేతిక పెరిగిన ప్రస్తుత కాలంలో ఒకటి రెండు సౌండ్ ఎఫెక్ట్‌ లు తప్ప ‘కనెక్ట్’లో అంతగా ప్రేక్షకులను ఆకట్టుకునేది ఏమీ లేకపోవడం పెద్ద లోపం. నటీనటుల విషయానికి వస్తే ఒక్క అన్నా పాత్రధారి హనియా నఫీసాకు తప్ప వేరే ఎవరికి నటించటానికి అంత స్కోప్ లేదు. సీన్స్ లో అంత బలం లేకపోవడంతో సౌండ్ పరంగాను ప్రతిభను చాటుకునే ఛాన్స్ లేకపోయింది. ఓటీటీలలో ఇంతకంటే చక్కటి హారర్ సినిమాలు అందుబాటులో ఉన్న సమయంలో ‘కనెక్ట్’ ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు.

రేటింగ్: 2.25/ 5

ప్లస్ పాయింట్స్
సినిమా నిడివి
హనియా నఫీసా నటన

మైనస్ పాయింట్స్
కొత్తదనం లేకపోవడం
కథ, కథనం

ట్యాగ్ లైన్: ‘కనెక్ట్’ అవటం కష్టమే