NTV Telugu Site icon

Chup Movie Review: చుప్ – రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ (హిందీ) రివ్యూ

Chup Review

Chup Review

దర్శకుడు ఆర్.బాల్కీ ఇప్పటిదాకా తెరకెక్కించిన చిత్రాలలోని వైవిధ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆయన రూపొందించిన “చీనీ కమ్, పా, షమితాబ్, కీ అండ్ కా, ప్యాడ్ మ్యాన్” చిత్రాలు జనాన్ని అలరించాయి. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’పై కూడా తొలి నుంచీ అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను ఓ నాటి ప్రఖ్యాత నటదర్శకుడు గురుదత్ కు నివాళిగా రూపొందించాననీ బాల్కీ ముందుగానే చెప్పారు. ఓ కళాకారుడు తాను ఎంతగానో ప్రేమించిన కథను తెరకెక్కిస్తే, విమర్శకులు ఒక్క మాటతో ఆ సినిమా భవిష్యత్ ను తేల్చేస్తారని ఎంతోమంది సినీజీవులు బాధపడుతూ ఉంటారు. అలాంటి బాధ తనకూ ఉందని, గురుదత్ రూపొందించిన క్లాసిక్ ‘కాగజ్ కే ఫూల్’ (భారతదేశంలో తొలి సినిమాస్కోప్)ను 1959లో ఆ సినిమా విడుదలైనప్పుడు తీవ్రంగా విమర్శించారని బాల్కీ అన్నారు. ఆ బాధతోనే గురుదత్ మళ్ళీ మెగాఫోన్ పట్టలేదనీ కొందరంటారు. ఆ లైన్ ను ఆధారం చేసుకొని బాల్కీ తన ‘చుప్’ను తెరకెక్కించడం విశేషం!

ఇంతకూ బాల్కీ రూపొందించిన ‘చుప్: రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ కథ ఏమిటంటే – ముంబైలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ చనిపోయిన వారందరూ ఫిలిమ్ క్రిటిక్స్! ఏ సినిమానైనా నిర్దాక్షిణ్యంగా విమర్శించే వారిని ఎవరు ఎందుకు చంపుతున్నారు? అన్నదే ప్రశ్న. దానిని ఛేదించడానికి అరవింద్ మాథుర్ అనే పోలీస్ ఆఫీసర్ ను ముంబై క్రైమ్ బ్రాంచ్ నియమిస్తుంది. సినిమాలపై ఇష్టం వచ్చినట్టు రివ్యూ రాసేవారంటే ఆ హంతకుడికి అసహ్యం. నిర్దాక్షిణ్యంగా విమర్శలు చేస్తూ ఎంతోమంది కళాకారుల జీవితాలు ఫిలిమ్ క్రిటిక్స్ నాశనం చేస్తున్నారన్నది ఆ కిల్లర్ ప్రగాఢ విశ్వాసం. అందువల్లే అతడు రివ్యూలు రాసే క్రిటిక్స్ ను చంపేస్తుంటాడు. అతడిని అరవింద్ ఎలా పట్టుకున్నాడన్నదే కథ.

బాల్కీ ఆలోచన బాగానే ఉంది, కొత్త పాత అని లేకుండా విమర్శకులు తమ చేతిలో కలం ఉంది కదా అని కదం తొక్కిస్తూ వర్ధమాన కళాకారుల భవిష్యత్ ను నాశనం చేస్తున్నారన్నది ఆయన వాదన! ప్రతిభావంతుడిని ఎందరు విమర్శించినా, తన సత్తాతో పైకి వస్తాడు అన్నది జగమెరిగిన సత్యం! కువిమర్శలు చేసే వారిని ఎవరైనా ఇష్టపడరు. అలాంటి వారి రాతలనూ పట్టించుకోవలసిన అవసరం లేదు. ఈ అంశాలను మరచి పోయి బాల్కీ ‘చుప్’ను తెరకెక్కించారనిపిస్తుంది. ఇక్కడ మహాకవి శ్రీశ్రీ మాటలను మననం చేసుకోవలసిన అవరసం ఎంతైనా ఉంది- “పబ్లిక్ లోకి వస్తే ఏమన్నా అడుగుతాం… ఏమన్నా అంటాం…” అన్నారు. ఈ మాటలు నాటికే కాదు నేటికీ, ఏ నాటికైనా నిలిచేవే. ఇవి సినిమా, రాజకీయాల్లో ఉన్నవారికి తప్పకుండా వర్తిస్తాయి. అయితే ఇవన్నీ పక్కకు నెట్టి గురుదత్ పై అభిమానంతోనే బాల్కీ ‘చుప్’ తెరకెక్కించానని చెప్పుకోవడంతో ఈ కథను ఆయన అభిప్రాయంగానే భావించాలి.

సన్నీ డియోల్ తన పాత్రకు తగ్గ అభినయాన్ని ప్రదర్శించారు. ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించినా రెగ్యులర్ స్టైల్ లో కండబలం చూపించలేదు. ఇక దుల్కర్ తాను ధరించిన పాత్రలో జీవించాడనే చెప్పాలి. డేనీ పాత్రలోని అన్ని షేడ్స్ ను దుల్కర్ చక్కగా ప్రదర్శించాడు. మిగతా పాత్రధారులు సైతం తమ పరిధి మేరకు నటించారు. కథలో వైవిధ్యం కనిపించడం వల్ల ‘చుప్’ ఆకట్టుకుంటుందనే చెప్పాలి. అయితే ద్వితీయార్ధంలో నత్తనడకగా కథనం సాగింది. సంగీతం అంతగా అలరించలేక పోయింది. సందర్భానుసారంగా పాత పాటలను ఉపయోగించుకోవడం ఆకట్టుకుంటుంది. గురుదత్ ‘ప్యాసా’లోని ఎస్.డి.బర్మన్ స్వరకల్పనలో రూపొందిన సాహిర్ లుధియాన్వీ రాసిన “యే దునియా అగర్ మిల్ భీ జాయే…” పాటను అదే బాణీల్లోనే స్నేహా ఖాన్ వాకర్ స్వరపరచి గానం చేశారు. అది ఈ తరాన్ని ఆకట్టుకొనేలా ఉంది.

ప్లస్ పాయింట్స్:
బాల్కీ సినిమా కావడం
సన్నీ డియోల్ నటించడం
ఆకట్టుకొనే దుల్కర్ అభినయం

మైనస్ పాయింట్స్:
సాగదీసినట్టుగా ఉన్న ద్వితీయార్ధం
అంతగా ఆకట్టుకోలేని సంగీతం

రేటింగ్: 2.75/5

ట్యాగ్ లైన్: నై తో కసక్!

Show comments