NTV Telugu Site icon

Chor Bazar Movie Review: చోర్ బజార్

Chor Bazar

Chor Bazar

తన చిత్రాల ద్వారా పలువురికి స్టార్ డమ్ సంపాదించి పెట్టిన పూరి జగన్నాథ్ సొంత కొడుకు ఆకాశ్ కు మాత్రం సరైన సక్సెస్ అందించలేక పోయారు అని సినీజనం అంటూ ఉంటారు. ‘ఆంధ్రా పోరి’తో హీరో అయిన ఆకాశ్ కు పూరి జగన్నాథ్ ‘మెహబూబా’ అనే చిత్రం అందించాడు. కానీ, అదీ ఆకట్టుకోలేక పోయింది. ‘రొమాంటిక్’ అనే చిత్రంతోనూ ఆకాశ్ కు విజయం దక్కలేదు. ఆకాశ్ నాలుగో చిత్రంగా వచ్చిన ‘చోర్ బజార్’ శుక్రవారం జనం ముందు నిలచింది.

‘చోర్ బజార్’ కథ విషయానికి వస్తే.. హీరో పేరు బచ్చన్ సాబ్. అతగాడు కార్ టైర్స్ ను దొంగిలిస్తుంటాడు. 30 నిమిషాల్లో అత్యధిక కార్ టైర్స్ తీసేసి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించాలని ప్రయత్నిస్తాడు. అతనికి సిమ్రన్ అనే మూగ అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమె అంటే బచ్చన్ కు అనురాగం కలుగుతుంది. అదే సమయంలో హైదరాబాద్ లోని రాయల్ మ్యూజియమ్ లో ఉన్న నిజామ్ వారి అమూల్య వజ్రం మాయం అవుతుంది. దాని విలువ రెండు వందల కోట్ల రూపాయలు. అది చోర్ బజార్ లో ఉందని పోలీసులకు తెలుస్తుంది. చోర్ బజార్ అంటే బచ్చన్ కు కొట్టిన పిండి. ఆ వజ్రాన్నిఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంటాడు. ఆ వజ్రాన్ని ఎలాగైనా తెచ్చి, యథాస్థానంలో నెల రోజుల లోపు పెట్టాలని పోలీసుశాఖను ఆదేశిస్తాడు హోమ్ మినిస్టర్. అనూహ్యంగా ఆ వజ్రం ఓ బుడ్డోడికి దొరుకుతుంది. చివరకు వజ్రం ఎలా మ్యూజియమ్ చేరింది అన్నదే కథ.

గత చిత్రాలతో పోలిస్తే పూరి ఆకాశ్ నటనలో పరిణతి కనిపించింది. మాస్ హీరోగా ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. గెహనా సిప్పీ ఓకె. దర్శకుడు జీవన్ రెడ్డి ‘చోర్ బజార్’ను జనం ముందు నిలపడంలో బాగా శ్రమించాడని చెప్పాలి. ఇక కథలో మలుపులు చూస్తే, రామ్ గోపాల్ వర్మ తీసిన ‘క్షణక్షణం’ గుర్తుకు రాకమానదు. అందులో కోటి రూపాయల బ్యాగ్ చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఇరవై కోట్ల డైమండ్ చుట్టూ కథ సాగుతుంది. అంతే తేడా! అయితే ఇందులో పాటలు ఆకట్టుకునేలా లేవు. నేపథ్య సంగీతం పరవాలేదు. ఇక సునీల్, అర్చన, సుబ్బరాజు వంటి నటీనటులు ఉన్నా వారిని దర్శకుడు సరైన విధంగా ఉపయోగించుకోలేకపోయాడు. ‘దళం, జార్జిరెడ్డి’ సినిమాలతో ఓ వర్గాన్ని ఆకట్టుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాపై మనసు పెట్టలేదేమో అనిపిస్తుంది. కథ నుంచి స్క్రీన్ ప్లే వరకూ సరైనా క్లారిటీ లేకుండానే సాగుతుంది. సినిమా ఆసాంతం ప్రేక్షకుల సహనానికి పరీక్షే. మొత్తానికి ‘చోర్ బజార్’లో ఆకట్టుకొనే అంశాలు తక్కువే! చోర్ గా పూరి తనయుడు జనం జేబులు కొల్లగొట్టలేక పోయాడనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్:
– పూరి ఆకాశ్ అభినయం
– నేపథ్య సంగీతం
– సినిమాటోగ్రఫి

మైనస్ పాయింట్స్:
– కథ, కథనం
– బోరుకొట్టే సీన్స్
-పాటలు

రేటింగ్: 2/5

ట్యాగ్ లైన్ : ‘చోర్’ బేజార్!