NTV Telugu Site icon

Captain Movie Review : కెప్టెన్ రివ్యూ (తమిళ డబ్బింగ్)

Captain Review

Captain Review

తమిళ హీరో ఆర్య గత యేడాది నాలుగు సినిమాల్లో నటిస్తే అందులో ‘సార్పట్ట’ మాత్రమే అతనికి నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ‘టెడ్డీ, అరణ్మనై 3, ఎనిమీ’ చిత్రాలు కమర్షియల్ గానూ సక్సెస్ సాధించలేదు. ఈ నేపథ్యంలో ‘టెడ్డీ’ చిత్రాన్ని తీసిన శక్తి సుందర్ రాజన్ తోనే మరోసారి జత కట్టాడు ఆర్య. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ‘కెప్టెన్’ గురువారం జనం ముందుకొచ్చింది. ఆ మధ్య కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాను తెలుగులో పంపిణీ చేసిన శ్రేష్ట్ మూవీస్ సంస్థ దీన్ని కూడా రిలీజ్ చేయడం విశేషం.

కథగా చెప్పుకోవాలంటే… చాలా సింపుల్ స్టోరీ! ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం సమీపంలోని సెక్టార్ 42 లో కొన్నేళ్ళుగా జనావాసానికి ఆస్కారం ఉండదు. మూడు దేశాల సరిహద్దులు ఉన్న ఆ ప్రాంతంలో సివిలియన్ యాక్టివిటీని ప్రారంభించాలని భారత ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసం రిక్కీ నిర్వహించమని ఆర్మీకి చెందిన రెండు టీమ్స్ ను పంపిస్తుంది. అయితే… అక్కడకు వెళ్ళిన సభ్యులెవరూ ప్రాణాలతో బయటకు రారు. దాంతో కెప్టెన్ విజయ్ కుమార్ కు ఈ బాధ్యతలను ఆర్మీ జనరల్ అప్పగిస్తాడు. తన టీమ్ సభ్యులతో కలిసి మొదటిసారి విజయ్ కుమార్ అక్కడకు వెళ్ళినప్పుడు చేదు అనుభవం ఎదురవుతుంది. తమ టీమ్ మెంబర్ కార్తీ (హరీశ్‌ ఉత్తమన్)ని వాళ్లు పోగొట్టుకుంటారు. ఓ యేడాది తర్వాత డాక్టర్ కీర్తి (సిమ్రాన్) కారణంగా మరోసారి సెక్టార్ 42కు పరిశోధన నిమిత్తం వెళ్ళే ఛాన్స్ కెప్టెన్ విజయ్ కుమార్ బృందానికి వస్తుంది. ఈసారి అతను తన ఆపరేషన్ ను ఎలా విజయవంతం చేశాడన్నదే చిత్ర కథ.

 

ఏలియన్స్ నేపథ్య చిత్రాలు మనకు కొత్తకాదు. ఒక ప్రాంతంలో ఏలియన్స్ తిరుగుతుండటం, తమ దగ్గరకు వచ్చిన వారిపై దాడి చేయడం, లేదంటే… అవే జనావాసాలపైకి వచ్చి విధ్వంసాన్ని సృష్టించడం, చివరకు హీరో వాటిని మట్టుబెట్టడం… మనం రెగ్యులర్ గా చూసే సినిమాల్లో ఉండేదే. కానీ జనసంచారం లేని ఓ ప్రాంతాన్ని కొన్ని వింత జీవులు రక్షించడం, అటుగా వచ్చిన వారిని చంపేయడం, వారి మైండ్ ను కంట్రోల్ లోకి తీసుకుని సూసైడ్ చేసుకునేలా చేయడం అనేది కాస్తంత డిఫరెంట్ కాన్సెప్టే. అయితే దానికి ఇదీ పర్టిక్యులర్ రీజన్ అని దర్శకుడు ఇందులో చూపించపోవడం అతి పెద్ద లోటు. ఏలియన్స్ సెక్టార్ 42ను ఆక్రమించుకున్నాయని, ఆ విషయంలో శత్రుదేశాల కుట్ర కూడా ఉందని భావించే ప్రేక్షకులకు దర్శకుడు కాకమ్మ కబుర్లు చెబుతూ కథను నడిపేశాడు. ప్రధాన పాత్రలు ఎప్పుడు, ఎందుకు, ఎలా ప్రవర్తిస్తాయో అర్థం కాకుండా సినిమా సాగుతుంది. వారి చర్యలకు, దాని ప్రతిఫలానికి సంబంధం ఉండదు. వింత జీవులను అంతం చేయాలనుకునే మెయిన్ టార్గెట్ ను పక్కన పెట్టేసి, తన స్నేహితుడిపై పడిన మచ్చను తొలగించడమే హీరో అసలు లక్ష్యంగా మారిపోతుంది. దానికి తోడు ఏ పాత్ర లక్ష్యం ఏమిటనే విషయానికీ దర్శకుడు క్లారిటీ ఇవ్వలేదు. గతంలో ‘టెడ్డీ’ మూవీ విషయంలోనూ అలానే జరిగింది. అయితే అది సోషియో ఫాంటసీ మూవీ కాబట్టి లాజిక్స్ జోలికి ఎవరూ పోలేదు. కానీ ‘కెప్టెన్’ కథ వేరు. ఇది సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ అని చెప్పి, ఇలా తలా తోక లేకుండా తీయడం దారుణం. దానికి తోడు గ్రాఫిక్స్ వర్క్స్ కూడా ఏ మాత్రం ఆకట్టుకునేలా లేవు.

 

ఆర్యకు ఇందులో నటించడానికి పెద్దంత స్కోప్ లేకపోయింది. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ వింత జీవులతో జరిపే పోరాటమే. అది కూడా రక్తి కట్టలేదు. హీరో, హీరోయిన్ మధ్య ఎలాంటి కెమిస్ట్రీకీ దర్శకుడు ప్రయత్నించలేదు. ఐశ్వర్య లక్ష్మీ పాత్ర కంటే హీరో బృందంలోని కావ్యాశెట్టిదే నిడివి ఉన్న పాత్ర. సిమ్రాన్ క్యారెక్టర్ హాఫ్ కుక్డ్ గా ఉంది. మిలటరీ జనరల్ ఆదిత్య మీనన్ ఎందుకు హీరో మీద అంతలా కక్షకట్టినట్టు ప్రవర్తిస్తాడో అర్థమే కాదు. ‘నేను ఆ స్థానంలో ఉన్నా అలానే ప్రవర్తిస్తానం’టూ ఆర్య చెప్పడంలోని ఆంతర్యం బోధపడదు. ఇతర ప్రధాన పాత్రలను హరీశ్ ఉత్తమన్, మాళవికా అవినాశ్, గోకుల్ నాథ్, రాజ్ భరత్, త్యాగరాజన్, విన్సెంట్ అశోకన్ పోషించారు. కానీ ఏ పాత్రకూ సరైన గుర్తింపు అనేది లభించలేదు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఏదో అలా సాగుతుందంటే… సాగుతుంది అంతే! ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోపెట్టే సీన్ ఒక్కటంటే ఒక్కటీ లేదు. ట్రైలర్ చూసి ఇదేదో రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమా అని ఆశపడి థియేటర్లకు వచ్చే వారికి నిరాశ తప్పదు. శ్రేష్ట్ మూవీస్ కు ‘విక్రమ్’ సినిమా మంచి లాభాలను అందించినా, నితిన్ తో నిర్మించిన ‘మాచర్ల నియోజకవర్గం’ డిజప్పాయింట్ చేసింది. ఆర్య నటించిన ‘కెప్టెన్’ సైతం అదే బాటలో సాగింది.

 

రేటింగ్: 2 / 5

ప్లస్ పాయింట్స్
సైన్స్ ఫిక్షన్ మూవీ కావడం
డి. ఇమాన్ మ్యూజిక్
యువ సినిమాటోగ్రఫీ

మైనెస్ పాయింట్స్
ఆకట్టుకోని కథ
ఆసక్తి కలిగించని సన్నివేశాలు
పేలవమైన ముగింపు
పండని సెంటిమెంట్ సీన్స్

ట్యాగ్ లైన్: మిషన్ ఫెయిల్!