ఒక్కో నటుడికీ ఒక్కో ఇమేజ్! అందుకు భిన్నమైన పాత్రలను వాళ్ళతో చేయిస్తే, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే సందేహం దర్శకుడికి ఉంటుంది. అలానే ఒక్కో దర్శకుడిదీ ఒక్కో స్టైల్! అందుకు భిన్నమైన చిత్రాలను వాళ్ళతో తీస్తే, ఎలాంటి రిజల్ట్ వస్తుందోననే భయం నిర్మాతలకు ఉంటుంది. కానీ నటుడు ధన్ రాజ్, డైరెక్టర్ జి. నాగేశ్వరరెడ్డితో నిర్మాతలు సంజీవ్ రెడ్డి, నాగిరెడ్డి ఏటికి ఎదురీదే ప్రయత్నం చేశారు. అలా జనం ముందుకు వచ్చిందే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘బుజ్జీ… ఇలా రా’!
వరంగల్ పట్టణంలో వరుసగా బాలికలు అపహరణకు గురౌతుంటారు. ఆ మిస్టరీని ఛేదించే పని టూ టౌన్ ఇన్ స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కేశవ (ధనరాజ్)కు అప్పగిస్తారు ఎస్పీ. కేశవ, అతని భార్య అనసూయ (చాందినీ తమిళరసన్)కు పావని అనే పాప ఉంటుంది. స్కూల్లో చదువుకునే తమ కూతురు వయసు పిల్లలే కిడ్నాప్ కు గురి అవుతుండటంతో ఈ కేసును సీరియస్ గా తీసుకుని కేశవ అనుమానితులని ఇంటరాగేట్ చేస్తుంటాడు. అందులో తంబాకు శ్రీను (టెంపర్ వంశీ) హస్తముందని తెలుస్తుంది. అయితే… అప్పటి వరకూ 12 మంది చిన్నారులు కిడ్నాప్ కాగా, తాజాగా పిల్లలను చంపి గుండెను వేరు చేసిన సంఘటనలూ కొత్తగా మొదలవుతాయి. కేసు ఊహించిన దానికంటే సంక్లిష్టంగా మారడంతో మరో పోలీస్ అధికారి మహ్మద్ ఖయ్యూమ్ (సునీల్) కూడా రంగంలోకి దిగుతాడు. కేశవ, ఖయ్యూమ్ మధ్య ఊహించని వైరం ఏర్పడుతుంది. అసలు పిల్లలను కిడ్నాప్ చేస్తోంది ఎవరు? చిన్నారుల గుండెలను ఎందుకు అపహరిస్తున్నారు? వారి టార్గెట్ ఏమిటీ? ఈ మొత్తం మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారు? అనేది మిగతా కథ. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కథలను ఇంతకంటే ఎక్కువ రివీల్ చేయడం సబబు కాదు. సో…. సినిమా మీద ఆసక్తి ఉన్నవారు సిల్వర్ స్క్రీన్ మీద చూసి మిగిలిన కథాకమామీషు తెలుసుకోవడమే సబబు!
ఇలాంటి సినిమాను నిర్మించడానికి నిర్మాతలకు గట్స్ ఉండాలి. ఎందుకుంటే… ధనరాజ్ ను మనం పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఊహించుకోవడం కాస్తంత కష్టమే. ఇది కామెడీ సినిమా అయితే ఓకే… కానీ చాలా సీరియస్ అంశాన్ని ఇందులో చర్చించారు. ఇది కేవలం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మాత్రమే కాదు… సైకలాజికల్ డ్రామా కూడా మిక్స్ అయ్యింది. అలానే సునీల్ ఈ మూవీలో నటించే సమయానికి ‘పుష్ప’లో మంగళం శీను పాత్ర చేసి ఉండడు. ఇలాంటి సీరియస్ పోలీస్ పాత్రలు అప్పుడప్పుడే చేస్తున్న సునీల్ తో అలాంటి టఫ్ పోలీస్ క్యారెక్టర్ చేయించడం విశేషమే. హీరోయిన్ చాందినీ గతంలో మూడు నాలుగు తెలుగు సినిమాల్లో నటించినా… వాటికి పూర్తి భిన్నంగా ఓ చిన్నారికి తల్లిగా ఇందులో చేసింది. సినిమా అంతా ఒక ఎత్తు అయితే క్లయిమాక్స్ లో ఆమె నటన మరో ఎత్తు. ఆమె తండ్రిగా, ధనరాజ్ మామగా శ్రీకాంత్ అయ్యంగార్ ఓ కీలక పాత్రనుచేశారు. అతని నటన కూడా హైలైట్ గానే నిలుస్తుంది. ఇక సునీల్ వచ్చేది ద్వితీయార్థంలోనే అయినా అక్కడి నుండి కథను అతనే భుజానికెత్తుకుని వెళతాడు. ధన్ రాజ్ పాత్రలోనూ ప్రేక్షకుల ఊహకందని వేరియేషన్స్ ఉన్నాయి. ఇందులో ఇతర ప్రధాన పాత్రలలో సత్యకృష్ణ, పోసాని, ‘టెంపర్’ వంశీ, భూపాల్, రాజా రవీంద్ర తదితరులు కనిపిస్తారు. సినిమా ప్రారంభం నుండి ఓ టెంపోలో సాగుతుంది. అయితే క్లయిమాక్స్ ను అన్ని వర్గాల ప్రేక్షకులు హర్షిస్తారని చెప్పలేం. దీన్ని కాస్తంత డీసెంట్ గా తీసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం కూడా కలగకమానదు. తమిళంలో ఆ మధ్య వచ్చిన కొన్ని సైకలాజికల్ థ్రిల్లర్స్ ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు అతి చేసినట్టుగా అనిపిస్తుంది.
దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి ఇంతవరకూ వినోదాత్మక చిత్రాల దర్శకుడిగానే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇలాంటి సైకలాజికల్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తాను చేస్తే… ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే సందేహంతో కావచ్చు ఆయన కథ, కథనాన్ని అందించి, దర్శకత్వ పర్యవేక్షణకు పరిమితమై పోయారు. దీన్ని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి డైరెక్ట్ చేశారు. ఈ మూవీకి ఆయనే సినిమాటోగ్రాఫీ కూడా అందించారు. ఇటీవలే ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహించిన ‘టెన్త్ క్లాస్ డైరీస్’ కూడా రిలీజైంది. దర్శకుడిగా ఇది ఆయనకు రెండో సినిమా. ఈ మూవీలోని సన్నివేశాలను సాయి కార్తీక్ నేపథ్య సంగీతం హైలైట్ చేసింది. భాను, చందు సంభాషణలు రాయగా, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ చేశారు. ‘బుజ్జీ ఇలా రా’ టైటిల్ బట్టి… ఇదేదో సాఫ్ట్ సబ్జెక్ట్ అనుకుని థియేటర్లకు వెళ్ళే వాళ్ళకు పూర్తి డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఎదురవతుంది. ఈ కథను కొంతలో కొంత రివీల్ చేసి ప్రేక్షకులను మానసికంగా సంసిద్ధుల్ని చేసి ఉంటే బాగుండేది. ఏదేమైనా… ఇలాంటి టిపికల్ సబ్జెక్ట్ మూవీస్ ను ఓటీటీలో చూసి ఆదరించినట్టుగా, థియేటర్లలో జనం చూడటం కష్టమే. ఏదేమైనా… నటుడు ధన్ రాజ్, దర్శకుడు నాగేశ్వరరెడ్డి తో ప్రొడ్యూసర్స్ సంజీవ్ రెడ్డి, నాగిరెడ్డి, ప్రెజెంటర్ రూపా జగదీశ్ రిస్క్ చేశారనే చెప్పాలి.
రేటింగ్: 2.25 / 5
ప్లస్ పాయింట్స్
సైకలాజికల్ థ్రిల్లర్ కావడం
ఊహకందని క్లయిమాక్స్
సాయి కార్తీక్ నేపథ్య సంగీతం
మైనెస్ పాయింట్
కొత్తదనం లేని సన్నివేశాలు
ఆసక్తి కలిగించని కథనం
అవసరానికి మించిన హింస
ట్యాగ్ లైన్: ‘సైకో’ మదర్!