Boot Cut Balaraju Movie Review: నటుడిగా చాలా కాలం క్రితమే తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన సోహైల్ బిగ్ బాస్ తర్వాత తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఆయన పలు సినిమాలు చేస్తూ సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక తాజాగా కోనేటి శ్రీను దర్శకత్వంలో బూట్ కట్ బాలరాజు అనే సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫిబ్రవరి 2వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
బూట్ కట్ బాలరాజు కథ:
బూట్ కట్ బాలరాజు సినిమా అంతా తెలంగాణలోని ఓ పల్లెటూళ్ళో జరుగుతుంది. బూట్ కట్ బాలరాజు సోహైల్ చదువుకుంటున్నాడు అనే పేరుతో ఊరితో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. అయితే ఆ ఊరి పెద్ద పటేలమ్మ(ఇంద్రజ) కుమార్తె మహాలక్ష్మి(మేఘ లేఖ)తో చిన్నప్పటి నుంచి బాలరాజుకి మంచి స్నేహం ఉంటుంది. అయితే బాలరాజుకు తెలియకుండా మహాలక్ష్మి అతని ప్రేమలో పడుతుంది. మరొక పక్క బాలరాజు కాలేజీలో చదివే సిరి(సిరి హనుమంతు) కూడా బాలరాజును ప్రేమిస్తుంది. సిరి తన ప్రేమ విషయాన్ని బాలరాజుకి చెప్పే సమయంలో మహాలక్ష్మి బాలరాజుని ప్రేమిస్తున్నానని చెబుతుంది. దీంతో సిరి సైడ్ అవడంతో బాలరాజు, మహాలక్ష్మి ప్రేమలో మునిగి తేలుతూ ఉంటారు. ఒకానొక సమయంలో వారిద్దరూ ఏకాంతంలో ఉండగా చూసిన పటేలమ్మ బాలరాజుని కొట్టించి ఊరు వదిలి వెళ్లిపోవాలని చెబుతుంది. అవమానంగా భావించిన బాలరాజు ఆమెను ఎదిరించి జనాలు ఓట్లేస్తేనే సర్పంచ్ అయ్యారు మీరు ఏదో పైనుంచి దిగి వచ్చినట్టు ఫీల్ అవ్వద్దన్నట్లు మాట్లాడడంతో దాన్ని సీరియస్ గా తీసుకుని అతను తన మీద సర్పంచ్ గా గెలిస్తే తన కూతురినిచ్చి పెళ్లి చేస్తానని అంటుంది. ఆ ఛాలెంజ్ బాలరాజు కూడా స్వీకరిస్తాడు. మరి ఊర్లో అల్లరి చిల్లరగా తిరిగే బాలరాజు ఊరికి సర్పంచ్గా గెలుస్తాడా? చివరికి బాలరాజు ప్రేమ దక్కుతుందా? సర్పంచ్ అవ్వడం కోసం బాలరాజు ఎన్ని తిప్పలు పడ్డాడు? చివరికి సర్పంచ్ అయ్యాడా? లేదా? అనే విషయాలు తెలియ చేయాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: బూట్ కట్ బాలరాజు సినిమా కథ కొత్తది ఏమీ కాదు. డబ్బు లేని ఒక అబ్బాయి బాగా డబ్బున్న వారి అమ్మాయిని ప్రేమించి ఆమెను దక్కించుకోవడానికి ఒక ఛాలెంజ్ చేయడం, ఆ తరువాత ఆ ఛాలెంజ్ గెలవడం లాంటివి ఎన్నో సినిమాలలో చూశాం. ఈ సినిమా కూడా అలాంటి కథతోనే తెరకెక్కించారు మేకర్స్. కథలో కొత్తదనం లేకపోవడం, ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం సినిమాకి ఇబ్బందికర అంశం. సినిమా మొదటి భాగం మొదటి అంతా పటేలమ్మ గురించి, మహాలక్ష్మి- బాలరాజు మధ్య స్నేహం – లవ్ లో పడటం వంటి వాటిని ఎస్టాబ్లిష్ చేస్తూనే బాలరాజు అతని ఫ్రెండ్స్ చేసే కామెడీతో అలరించే ప్రయత్నం చేశాడు మేకర్స్. ఇక ఇంటర్వెల్ కి ముందు బాలరాజు, మహాలక్ష్మి ఏకాంతంగా ఉండగా దొరికిపోవడంతో ఏం జరుగుతుందా అని సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. ఇక సెకండ్ హాఫ్ అంతా బాలరాజు సర్పంచ్ అవ్వడానికి ఏం చేశాడు అనే అంశం చుట్టూనే ఉంది. ఇక సెకండ్ హాఫ్ లో కూడా ముందు కామెడీ చూపించినా చివర్లో లవ్ యాంగిల్ ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇక కొన్ని చోట్ల సీన్స్ చాలా సాదా సీదాగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ కొంత మేరకు ఆసక్తికరంగా ఉన్నాయి. ఓవరాల్‌గా సినిమా ఫర్వాలేదనిపించేలా తెరకెక్కించారు.
ఇక నటీనటుల విషయానికి వస్తే.. ఎప్పటిలాగే హీరో సోహెల్ తన నటనతో స్క్రీన్ మీద మిగతా అందరినీ డామినేట్ చేసాడు.. ముఖ్యంగా కామెడీ సీన్స్‌తో పాటు ఏమోషనల్ సీన్స్‌లో కూడా తనదైన మార్క్ వేసుకున్నాడు. హీరోయిన్ మేఘలేఖ కూడా తెర మీద తనదైన అందంతో పాటు నటనతో ఆకట్టుకున్నాడు. సిరి హన్మంత్ కూడా తన పరిధి మేరకు ఓకే అనిపించింది. ఇక ఇతర పాత్రల్లో నటించిన సునీల్, ఇంద్రజ, జబర్దస్త్ రోహిణి వంటి నటీనటులు కూడా పరిధి మేరకు ఆకట్టుకున్నారు. టెక్నీకల్ అంశాల విషయానికి వస్తే పల్లెటూరి వాతావరణం మొత్తాన్ని కెమెరా విజువల్స్ లో బాగా క్యాప్చర్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదనిపిస్తుంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే కనుక రెండు పాటలు వినడానికి, చూడటానికి బాగున్నా మిగిలినవి ఓకే అనిపించేలా ఉన్నాయి. ఇది కథ పాతదే అయినా దర్శకుడిగా శ్రీనివాస్ కోనేటి తన మార్క్ వేసుకునే ప్రయత్నం చేశాడు. కాస్ట్యూమ్స్ విషయంలో ముఖ్యంగా కాస్ట్యూమ్స్ లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు ఉన్నాయి.
ఫైనల్ గా బూట్ కట్ బాలరాజు తెలంగాణ మార్క్ కామెడీతో సాగే ఒక క్రేజీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.