NTV Telugu Site icon

Bloody Mary Movie Review : టైమ్ పాస్ మేరీ!.

Bloody Mary

Bloody Mary

అనువాద చిత్రాలకే పరిమితం అనుకుంటున్న ‘ఆహా’లో కొంతకాలంగా ఒరిజినల్ ఓటీటీ మూవీస్ కూడా ప్రసారం అవుతున్నాయి. అలా తాజాగా స్ట్రీమింగ్ అయిన సినిమా ‘బ్లడీ మేరీ’. నివేదా పేతురాజ్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీతో డైరెక్టర్ చందు మొండేటి సైతం తొలిసారి ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే ఈ మీడియంకు కంటెంట్ అందిస్తున్న టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రానికి నిర్మాత.

వైజాగ్ లోని అనాథ శరణాలయంలోకి కొందరు ఓ రాత్రిపూట చొరబడి అందులోని పిల్లలను ఎత్తుకెళ్ళిపోతారు. ఆ సమయంలో అక్కడి నుండి ఎస్కేప్ అయిన ముగ్గురు పిల్లలు కలిసి పెరుగుతారు. మేరీ (నివేదా పేతురాజ్) నర్స్ అవుతుంది. తనతో పాటే అనాథ శరణాలయం నుండి వచ్చేసిన మరో ఇద్దరి బాగోగులు సైతం ఆమే చూసుకుంటూ ఉంటుంది. అందులో బాషా (కిరీటీ దామరాజు) నటుడు కావాలని కలలు కంటూ ఉంటాడు. రాజు (రాజ్ కుమార్ కసిరెడ్డి)కు స్టిల్ ఫోటోగ్రాఫర్ కావాలని ఆశ. ఒకరోజు తనపై కన్నేసిన డాక్టర్ కాంతారావు (కమల్)ను మేరీ అడ్డుకోగా, అతను పొరపాటున చనిపోతాడు. అదే సమయంలో మూవీ ఆడిషన్ కోసం ఓ డైరెక్టర్ దగ్గరకు వెళ్ళిన బాషాకు అతన్ని ఓ అమ్మాయి బలత్కరించబోతుంటే కొట్టడం, ఇంతలో ఆమె భర్త, సీఐ ప్రభాకర్ (అజయ్) అక్కడకు వచ్చి, అతన్ని చంపేయడం చూస్తాడు. అదంతా ఒక స్టిల్ కెమెరాలో రికార్డ్ అవుతుంది. నాటకీయ పరిణామాల మధ్య ఆ కెమెరా రాజు చేతికి చిక్కుతుంది. దీంతో కాంతారావు మర్డర్ ఇన్వెస్టిగేషన్ కు వచ్చిన సీఐ ప్రభాకర్ ను మేరీ రివర్స్ లో బ్లాక్ మెయిల్ చేస్తుంది. మరి మేరీ ఎత్తుగడకు ప్రభాకర్ లొంగాడా? ప్రభాకర్ ను అదుపుచేయడం కోసం శేఖర్ బాబు (బ్రహ్మాజీ)ని ఆశ్రయించిన మేరీకి ఎలాంటి ప్రయోజనం చేకూరింది? ప్రభాకర్ – శేఖర్ బాబు మధ్య పోరులో మేరీ ఎలా పావుగా మారింది? అన్నదే ఈ చిత్ర కథ.

‘కార్తికేయ, ప్రేమమ్, సవ్యసాచి’ చిత్రాలను డైరెక్ట్ చేసిన చందు మొండేటి మొదటిసారి ఓటీటీ కోసమే ఈ థ్రిల్లర్ మూవీని రూపొందించాడు. ఓ మూగ అబ్బాయి, ఓ చెవిటి కుర్రాడు, కాంటాక్ట్ లెన్స్ లేకపోతే అసలేమీ కనిపించని ఓ అమ్మాయి… ఈ మూడు పాత్రలతో ఈ థ్రిల్లర్ స్టోరీని నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే ప్రారంభం నుండి ముగింపు వరకూ ఎలాంటి ఉత్సుకత ఈ సినిమా కలిగించలేదు. ప్రతి సన్నివేశం సాదాసీదాగా సాగిపోతుంది, మరి ముఖ్యంగా తర్వాత సీన్ లో ఏం జరుగుతుందనే విషయం చూసే వ్యూవర్ కు అర్థమైపోతుంటుంది. క్లయిమాక్స్ లో మేరీ అలియాస్ కౌసల్యాదేవీ పాత్రను మరో లెవల్ కు తీసుకెళ్ళి… ‘ది రైజ్ ఆఫ్ బ్లడీ మేరీ’ అంటూ ముగించారు. దీనికి లభించే ఆదరణను బట్టి మేరీ తన కలల సాకారం కోసం ఏం చేసింది? ఎలా ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది? అనేది మరో సినిమాగా వచ్చే ఛాన్స్ ఉంది.

నివేద పేతురాజ్ క్రిమినల్ మైండ్ ఉన్న అమ్మాయిగా బాగానే చేసింది. కానీ ఆమె అసలు రూపం ఏమిటీ అనేది తెలియకపోవడంతో… ఆడియెన్స్ ఎక్కడా ఆమె పాత్రను ఓన్ చేసుకోలేరు. కిరిటీ దామరాజు, రాజశేఖర్ సపోర్టింగ్ పాత్రల్లో మిగిలిపోయారు. వాళ్ళుగా సినిమాలో సాధించేది శూన్యం. అజయ్ ను ఈ మధ్య కాలంలో ఇలాంటి పోలీస్ పాత్రల్లో చూస్తూనే ఉన్నాం. బ్రహ్మాజీ తనదైన స్టైల్ లో విలనీ పండించే ప్రయత్నం చేశాడు. పమ్మి సాయి పాత్ర కాస్తంత ఎంటర్ టైనింగ్ గా ఉంది. మరికాస్తంత వినోదాన్ని ఆ పాత్ర ద్వారా దర్శకుడు రాబట్టి ఉండాల్సింది. సాంకేతిక నిపుణుల్లో మెయిన్ ఎసెట్ కాలభైరవ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కార్తిక్ ఘట్టమనేని ఫోటోగ్రఫీ. దర్శకుడు చందు మొండేటి రాసిన మాటలు క్లయిమాక్స్ సీన్ లోనే కాస్తంత బాగున్నాయి. ప్రశాంత్ కుమార్ దిమ్మల కథ, కథనాల్లో కొత్తదనం లేదు. హీరోయిన్, డైరెక్టర్ మీద అంచనాలు పెట్టుకుని ఈ మూవీని చూస్తే నిరాశకు గురికాకతప్పదు. ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతోంది కాబట్టి టైమ్ పాస్ కోసం ఓసారి చూడొచ్చు! మరి ‘ది రైజ్ ఆఫ్ బ్లడీ మేరీ’ నైనా కాస్తంత ఆసక్తికరంగా తీస్తారేమో చూడాలి.

రేటింగ్: 2.25 / 5

ప్ల‌స్ పాయింట్స్:
థ్రిల్లర్ జోనర్ కావడం
కాలభైరవ నేపథ్య సంగీతం
కెమెరామ్యాన్ కార్తిక్ పనితనం

మైనస్ పాయింట్స్:
కొత్తదనం లేని కథ
ఆసక్తికలిగించని కథనం

ట్యాగ్ లైన్: టైమ్ పాస్ మేరీ!

Show comments