Bhaje Vayuvegam Movie Review: ఆర్ఎక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కార్తికేయ తెలుగులో ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశారు. అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు. వలిమై లాంటి సినిమాతో విలన్ గా మారినా మరొక పక్క హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే భజే వాయువేగం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పలు కారణాలతో రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని యువి కాన్సెప్ట్స్ బ్యానర్ మీద నిర్మించారు. టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులలో ఓ మాదిరిగా అంచనాలు ఏర్పడేలా చేసుకున్న ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
కథ:
వెంకట్ (కార్తికేయ) తల్లిదండ్రులు చిన్నప్పుడే అప్పుల బాధతో సూసైడ్ చేసుకుంటారు. అనాథగా మారిన వెంకట్ ని తండ్రి స్నేహితుడు (తనికెళ్ల భరణి) దత్తత తీసుకుని తన సొంత కొడుకు వెంకట్ (రాహుల్ టైసన్)లానే పెంచి పెద్ద చేస్తాడు. సిటీలో ఉండే అన్నదమ్ములిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నామని చెప్పి తండ్రిని నమ్మిస్తూ ఉంటారు. అయితే ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో డబ్బులు ఈజీగా సంపాదించవచ్చు అని భావించి వెంకట్ బెట్టింగ్ వేసి గెలుస్తాడు. కానీ మోసం చేసి డబ్బు ఎగ్గొడతారు. దీంతో వాళ్లపై పగ తీర్చుకోవడానికి రెడీ అవుతాడు. అయితే చివరకు వెంకట్ పగ సాధించాడా? లేదా? వెంకట్ కి డేవిడ్ (రవి శంకర్), జార్జ్ (శరత్ లోహిత్స్వ)కి సంబంధమేంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
ఒక్కలైనులో చెప్పాలంటే బెట్టింగ్ లు వేసుకునే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడి కథే ఈ భజే వాయువేగం. సినిమా మొదలైన వెంటనే ఎక్కువ లేట్ చేయకుండా కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్లే ప్రయత్నం చేసిన దర్శకుడు కొంతవరకు సఫలం అయ్యాడు కూడా. అయితే క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఊహించేలానే ఉన్నప్పటికీ.. స్క్రీన్ ప్లేతో మెస్మరైజ్ చేసేందుకు ప్రయత్నించి కొంతవరకు సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. హీరో, హీరోయిన్(ఐశ్వర్య మీనన్) లవ్ ట్రాక్ రోటీన్ గా ఉండటంతో పెద్దగా ఎగ్జయిట్ చేసేలా అనిపించలేదు, సో కాస్త బోర్ కొడుతుంది. అయితే ఇంటర్వెల్ కు ఊహించని ట్విస్ట్ లో సెకండాఫ్ పై ఆసక్తిని రేకెత్తించారు. ఇక సెకండాఫ్ మొదలయ్యాక వచ్చే ఛేజింగ్ లు, ఫైట్స్ తో మూవీ వేగం అందుకోవడమే కాదు సినిమా మీద కొంత పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడేలా చేస్తుంది. అయితే అంతా బాగానే ఉంటుందని అనుకుంటూ ఉండగానే క్లైమాక్స్ కు వచ్చేసరికి రెగ్యులర్ కమర్షియల్ ట్రాక్ లోనే ముగించడం అభిమానులను కాస్త అసంతృప్తికి గురి చేసే అంశం.
నటీనటుల విషయానికి వస్తే ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న కార్తికేయకి భజే వాయువేగంతో మంచి సినిమా పడింది. గత సినిమాలతో పోలిస్తే బెస్ట్ ఫర్పామెన్స్ ఇచ్చాడు. ఎమోషనల్ సీన్స్ లో నటనలో మెచ్యూరిటీ కనిపించింది. హీరోయిన్ గా ఐశ్వర్య మీనన్ తన పాత్రకు న్యాయం చేసిందనే చెప్పాలి. హీరో అన్న పాత్రలో రాహుల్ టైసన్ రీ ఎంట్రీ అదిరింది. హ్యాపీ డేస్ తరువాత గ్యాప్ తీసుకుని చేసిన సినిమానే అయినా తన నటనతో అదరగొట్టాడు. ఇక విలన్ గా రవి శంకర్ ఎప్పటిలాగే జీవించేశాడు. టెక్నికల్ విభాగానికి వస్తే ఆర్.డి రాజశేఖర్ తన సినిమాటోగ్రఫీతో మెప్పించగా రథన్ పాట, కపిల కుమార్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టారు. ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టుగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ ‘భజే వాయువేగం’ అంచనాలు లేకుండా వెళితే థ్రిల్ చేయచ్చు.