Umapathi Movie Review: తెలుగు భాషలోనే కాదు దాదాపు అన్ని భాషల్లోనూ లవ్ స్టోరీలు ఎప్పటికప్పుడు తెరకెక్కుతూనే ఉంటాయి. అయితే వాటిలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీలు అంటే తెలుగు ఆడియన్స్ ఎందుకో కాస్త ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఉమాపతి అనే సినిమా తెరకెక్కించారు మేకర్స్. అనురాగ్ హీరోగా చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను క్రిషి క్రియేషన్స్ బ్యానర్ మీద కే.కోటేశ్వర రావు నిర్మించారు. సత్య ద్వారంపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్ ఇలా అన్నీ కూడా పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి . ఇక ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి.
ఉమాపతి కథ
కొత్తపల్లి అనే గ్రామానికి చెందిన వర (అనురాగ్) ఊర్లో అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. దుబాయ్‌లో తండ్రి కష్టపడి సంపాదిస్తుంటే వర ఆ డబ్బుతో జల్సా చేస్తూ ఉంటాడు. ఇక వర పక్క ఊరైన దోసకాయపల్లకి చెందిన ఉమా (అవికా గోర్)ను ఇష్టపడుతుంటాడు. కానీ రెండు ఊర్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేంత వైరం ఉంటుంది. అలాగే ఉమ సోదరుడికి, “వర”కు పాత వివాదాలు కూడా ఉంటాయి. ఇలాంటి తరుణంలో వర తన ప్రేమను ఉమకి చెప్పాడా? తన ప్రేమను సఫలం చేసుకున్నాడా? ఈ రెండు గ్రామాల మధ్య ఉన్న గొడవలు ఎందుకు? చివరికి వారి ప్రేమ కథ ఎలా ముగిసింది? అన్నది థియేటర్ లో చూడాల్సిందే.
విశ్లేషణ
ఈ సినిమా చూసిన తర్వాత ఏదో కొత్త కథ చూసిన ఫీలింగ్ మాత్రం కలగదు. గతంలో మనం ఎన్నో సినిమాలు ఇలాంటి కథతోనే రావడం చూసాం, అందులో కొన్ని హిట్లయ్యాయి, కొన్ని యావరేజ్ గా మిగిలాయి. ఈ సినిమా దర్శకుడు కూడా రొటీన్ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చి తెరకెక్కించడంలో సఫలమయ్యాడు. హీరో హీరోయిన్ల మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ గొడవలు, ఇద్దరి మధ్య దూరం తగ్గి ప్రేమ చిగురించే సీన్స్ రోటీన్ అనిపించినా ఈ జంట మధ్య కెమిస్ట్రీ ఆసక్తిగా అనిపించింది. ఇక పల్లెటూరి వాతావరణం అక్కడి పంతాలు, మలినం తెలియని మనసులు చూపిస్తూ మొదటి భాగం అంతా చూపించాడు డైరెక్టర్. అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం ఆసక్తికరంగా రాసుకున్నాడు. మొదటి భాగం అంతా వారిద్దరి మధ్య ప్రేమ మీద ఫోకస్ చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ లోకి వెళ్ళాక మాత్రం రెండు ఊర్ల మధ్య అసలు గొడవకు కారణం ఏమిటి అనే విషయాన్ని రివీల్ చేశాడు. రెండు ఊర్ల మధ్య గొడవకు, ఈ ప్రేమ కథకు ఉన్న లింక్ వల్ల ఆ గొడవల్ని ఎలా క్లియర్ చేసుకున్నారు అనేది ఆసక్తికరం. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎమోషనల్‌గా ప్లాన్ చేసుకున్న డైరెక్టర్ దాదాపు రొటీన్ తెలుగు సినిమా లాగానే ముగించాడు. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగితే సెకండాఫ్ ఎమోషనల్‌గా ఉంది.
నటీనటుల ఉమాపతి సినిమా అంతా కూడా అనురాగ్, అవికా గోర్ ఇద్దరి మధ్యే సాగుతుంది. తనకన్నా నటనలో అనుభవం ఉన్న అవికా పక్కన అనురాగ్ తెరపై తన ప్రతిభను చాటుకునే ప్రయత్నం చాలా వరకు చేసి సఫలమయ్యాడు. యాక్షన్, కామెడీ, రొమాన్స్ ఇలా అన్నిటినీ బ్యాలెన్స్ చేశాడు. అవికా గోర్ అందంగా కనిపిస్తూనే.. తన అల్లరితో, తన నటనతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మిగతా పాత్రధారులు అందరూ తమ పరిధి మేరకు నటించారు. సాంకేతిక పరంగా చూస్తే ఈ సినిమాలో పాటలు గుర్తుంచుకునేలాగా పెద్దగా ఆకట్టుకోకపోయినా ఆర్ఆర్ ప్లస్ అయింది. గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే విజువల్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. కొన్ని డైలాగ్స్ గట్టిగా తగిలేలా రాసుకున్నారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్లీ : ఉమాపతి ఒక విలేజ్ లవ్ స్టోరీ.. ప్రేమ కథలు ఇష్టమున్నవారికి కనెక్ట్ అవుతుంది.