NTV Telugu Site icon

Appan Movie Review: ‘అప్పన్’ మూవీ రివ్యూ (మలయాళ డబ్బింగ్)

Appan Movie Review

Appan Movie Review

Appan Movie Review:  కరోనా తర్వాత భిన్నమైన కథాంశాలతో సినిమాలు తీస్తూ వస్తున్న మలయాళ చిత్ర పరిశ్రమలో వచ్చిన మరో చిత్రమిది. అయితే మానవ సంబంధాలను మరీ నీచంగా చూపించటం, ప్రాణం పోయే స్థితిలో కూడా కుటుంబ వినాశనాన్ని కోరుకుంటూ తను మాత్రం జీవించాలనే తాపత్రయపడే కడు స్వార్ధపరుడైన తండ్రి కథతో తెరకెక్కిన సినిమా ఇది. దర్శకుడు మజు నిజజీవిత ప్రేరణతో ఈ సినిమా తీశాడో ఏమో కానీ నిజంగా ఇలాంటి తండ్రులు ఉంటారా? అనిపిస్తుంది. అయితే అప్పుడప్పుడు వార్తలలో చూసే కొందరు కసాయి తండ్రుల గురించి వింటున్నాం కాబట్టి నిజమే కదా అనిపించక మానదు.

కథ విషయానికి వస్తే.. నోంజు (సన్నివేన్) ఒక రబ్బరు తోటలో పనిచేస్తూ తండ్రి, తల్లి, భార్య రోసి (అనన్య), కొడుకుతో ఒక చిన్న గ్రామంలో నివసిస్తుంటాడు. ఇట్టిచాన్ (అలెన్సియర్ లే లోపెజ్) అతని తండ్రి. మంచానికే పరిమితమైన ఇతగాడు స్త్రీలోలుడు. ఇతగాడు తన భార్య కుట్టియమ్మను కొడుకు నోంజును వేధిస్తూ దుర్భాషలాడుతంటాడు. ఇతగాడి మరణం కోసం ఆ కుటుంబ సభ్యులందరూ ఎదురు చూస్తు ఉంటారు. ఆరోగ్యంతో ఉన్నపుడు కూడా అతడితో పలు చేదు అనుభవాలు ఎదుర్కొని ఉన్న గ్రామస్థులు అతడి చావును కోరుకుంటూ కుదిరితే చంపాలని కూడా అనుకుంటూ ఉంటారు. నోంజు ఇంటికి పొరుగున ఉన్న షీలా (రాధికా రాధాకృష్ణన్) అనే మరో స్త్రీతో కలిసి జీవించాలని ఇట్టిచాన్ కుటుంబ సభ్యులను కూడా మోసగిస్తాడు. ఇతగాడి ప్రవర్తననతో విసిగి వేసారిన నోంజు గ్రామాన్ని విడిచి వెళ్ళాలనుకుంటాడు. ఇదిలా ఉంటే ఇట్టిచాన్ తన భార్యపై అత్యాచారం చేయటంతో పగబట్టిన కురియాకో అతనిని చంపడానికి ఇంటికి వస్తాడు. నోంజు తండ్రిని రక్షించడానికి ప్రయత్నిస్తాడు. అయితే కురియాకోతో నోంజు పోరాడుతున్నప్పుడు కొడుకును చంపి మిగిలిన స్త్రీలను తీసుకెళ్లి తన ప్రాణాన్ని వదిలెయ్యమని కోరతాడు ఇట్టిచాన్. అతని మాటలు విన్న షీలా ఏం చేస్తుంది? నోంజు కుటుంబం స్పందన ఏమిటన్నదే ఈ ‘అప్పన్’ ఇతివృత్తం.

ఇందులో క్రూరుడైన, కసాయి తండ్రి పాత్రకు అలెన్సియర్ ప్రాణం పోశాడనే చెప్పాలి. ఇట్టిచాన్ పాత్ర మనను వెంటాడేంతగా తను పాత్రలో జీవించాడు. ఇక నోంజుగా సన్నివేన్ తన పాత్రపరిధి మేరకు అర్థం చేసుకుని మరీ నటించాడు. రాగద్వేషాలను ఇతగాడు తండ్రి, కొడుకులతో ప్రదర్శించిన వైనం అద్వితీయం. ఇట్టిచాన్ భార్య కుట్టియమ్మగా పౌలీ వల్సన్, నోంజు భార్యగా అనన్య హావభావాలతో ఆకట్టుకున్నారు. షీలా పాత్రధారి రాధికపై సింపతీ కలగటం ఖాయం.

వ్యక్తుల మధ్య సంబంధాలు ప్రధానాంశంగా ప్రధానంగా ఓ ఇంటిపరిసరాల్లోనే చిత్రీకరించిన ఈ సినిమాకు సంగీత దర్శకుడు డాన్ విన్సెంట్ తన నేపథ్య సంగీతంతో చక్కటి మూడ్ క్రియేట్ చేశాడు. మనుష్యుల మధ్య అదీ కుటుంబంలో సంబంధబాంధవ్యాలు మరీ ఇంత దిగజారి ఉంటాయా అనిపిస్తుంది ‘అప్పన్’ సినిమాలో అప్పన్ పాత్ర తీరుతెన్నులు చూసిన తర్వాత. అయితే నోంజు, షీలా వంటి పాత్రల ఔచిత్యంతో దానిని బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు మజు సినిమాను చక్కగా మలచిన తీరు ఆకట్టుకుంటుంది.

ప్లస్ పాయింట్స్
నటీనటులు నటన
నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్
అప్పన్ పాత్ర తీరుతెన్ను
బాంధవ్యాలను చులకనగా చూపించటం
ప్రొడక్షన్ వాల్యూస్

రేటింగ్: 2.25/5

ట్యాగ్ లైన్: నీచ’అప్పన్’