NTV Telugu Site icon

Anya’s Tutorial Review: అన్యాస్ ట్యుటోరియల్ (వెబ్ సీరిస్)

Anyas Tutorial

Anyas Tutorial

‘బాహుబలి’ వంటి మాగ్నమ్ ఓపస్ మూవీని నిర్మించిన ఆర్కా మీడియా సంస్థకు టీవీ సీరియల్స్ తో పాటు వెబ్ సీరిస్ నిర్మాణంలోనూ చక్కని అనుభవం ఉంది. వెండితెర, బుల్లితెర మీదనే కాదు ఓటీటీలోనూ ఈ సంస్థ తన సత్తా చాటుతోంది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన హారర్ వెబ్ సీరిస్ ‘అన్యాస్ ట్యుటోరియల్’ జూలై 1 నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. రెజీనా కసాండ్రతో పాటు నివేదితా సతీశ్‌ కీలక పాత్ర పోషించిన ఈ వెబ్ సీరిస్ తో పల్లవి గంగిరెడ్డి దర్శకురాలిగా పరిచయం అయ్యారు.

సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ కావాలని తపించే లావణ్య (నివేదిత సతీశ్‌) అనే అమ్మాయి కథ ఇది. తనను పట్టించుకోని తల్లి (ప్రమోదిని పమ్మి), నిత్యం వేధించే అక్క మధు (రెజీనా కసాండ్ర) నుండి దూరంగా వెళ్ళిపోతుంది లావణ్య. ఓ పాడుబడిన అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ లో ఆమె ఒంటరి జీవితాన్ని ప్రారంభిస్తుంది. సోషల్ మీడియాలో ‘అన్యాస్ ట్యుటోరియల్’ పేరుతో ఆమె చేసే లైవ్‌ వీడియోలకు అద్భుతమైన స్పందన వస్తుంది. ఓసారి ఊహించని విధంగా లావణ్య లైవ్ వీడియో చూస్తున్న వారికి ఆమె వెనుక ఓ దెయ్యం కనిపిస్తుంది. ఆ ఫ్లాట్ లో లావణ్యతో పాటు దెయ్యం కూడా ఉందనే విషయం వైరల్ అవుతుంది. ఓవర్ నైట్ వేలమంది అన్యాస్ ట్యుటోరియల్ ను ఫాలో అవుతారు. అందులో కొంతమంది ఆమెను దెయ్యం నుండి రక్షించాలని చూస్తే, మరికొందరు ఇదంతా సబ్ స్క్రైబర్స్ ను పెంచుకోవడానికి లావణ్య ఆడుతున్న నాటకంగా భావిస్తారు. తల్లి, అక్కలతో లావణ్య కు ఉన్న తగువు ఏమిటీ? నిజంగానే ఆమెతో పాటు ఆ ఫ్లాట్ లో దెయ్యం ఉందా? లావణ్య ను రక్షించడానికి ప్రయత్నించిన వారు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అసలు దెయ్యాలు అనేవి ఉన్నాయా? లేవా? అనేదే మిగతా కథ.

‘అన్యాస్ ట్యుటోరియల్’ లోని తొలి ఏడు ఎపిసోడ్స్ ను ఆహా సంస్థ ఒకేసారి స్ట్రీమింగ్ చేసింది. అయితే… ఇంతటితో కథ పూర్తి కాలేదు. అసలు స్టోరీ మిగిలే ఉంది. సో… ఇది మరో సీరిస్ కూడా ఉంటుంది. దేవుడిని మీరు నమ్మితే దెయ్యాన్నీ నమ్మాల్సిందే అని కొందరు చెబుతారు. ఇదే విషయాన్ని ఇందులో రివర్స్ చేసి చెప్పారు. దెయ్యాలు లేవని మీరు భావిస్తే… దేవుడూ లేనట్టే అనుకోవాలని తెలిపారు. దెయ్యాలంటే భయం లేని లావణ్య… తన ఫ్లాట్ లో దెయ్యం ఉందని భయపడటం ఒక ఎత్తు అయితే, తన జీవితంలో దెయ్యం కంటే అక్కకే ఎక్కువ భయపడతానని చెప్పడం మరో ఎత్తు. ఈ అక్కా చెల్లెళ్ళ గతం తాలూకు మిస్టరీని విప్పకుండానే ఫస్ట్ సీజన్ ముగిసిపోయింది. ఇందులోని ఒక్కో ఎపిసోడ్ 30 నిమిషాల నిడివి ఉంది. తొలి నాలుగైదు ఎపిసోడ్స్ లో కథేం పెద్దగా సాగదు. చివరి రెండు ఎపిసోడ్స్ లోనే కొద్దిలో కొద్దిగా కథ సాగుతుంది. ఇలాంటి హారర్ బేస్డ్ వెబ్ సీరిస్ సీట్ ఎడ్జ్ లో వ్యూవర్స్ ను కూర్చోపెట్టాలి. కానీ అలాంటి ఇంట్రస్టింగ్ సీన్స్ ఏవీ ఇందులో లేవు. పైగా లావణ్య నిత్యం కలల్లోనే ఉండటంతో… ఎదురుగా జరుగుతోంది కలో నిజమో తెలియక ప్రేక్షకులు ఆ సన్నివేశంలో ఇన్ వాల్వ్ కాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడు ఎపిసోడ్స్ లో దాదాపు ఇరవై మంది ఆర్టిస్టులు మనకు కనిపిస్తారు. బట్ రెజీనా, నివేదితకు తప్పితే మిగిలిన పాత్రలకు పెద్దంత ప్రాధాన్యం ఉండదు. పైగా వాటిని డిజైన్ చేసిన తీరూ ఆకట్టుకునేలా లేదు. అన్నట్టుండి కొన్ని పాత్రలు మన ముందుకు వస్తాయి. ఠక్కున మాయమైపోతాయి. ఏ పాత్ర ఎందుకు అలా ప్రవర్తించిందనే దానికీ సరైన రీజన్ చూపించలేదు. హారర్ జానర్ కాబట్టి ఆ రకమైన క్రియేటివ్ లిబర్టీ తీసుకోవచ్చని బహుశా రచయిత్రి సౌమ్య శర్మ, దర్శకురాలు పల్లవి గంగిరెడ్డి భావించారేమో తెలియదు. లేదంటే పూర్తి స్థాయి వివరణ నెక్ట్స్ సీజన్ లో ఇవ్వాలని అనుకున్నారేమో! ఇక ఇందులోని ప్రధాన పాత్రలు మాట్లాడే భాష, ఉపయోగించిన కొన్ని పదాలు దారుణంగా ఉన్నాయి. అవసరం లేని చోట సైతం బూతు పదాలను యధేచ్ఛగా వాడేశారు. వెబ్ సీరిస్ కు సెన్సార్ ఉండకపోవడం కథ, మాటల రచయిత్రి సౌమ్యశర్మకు వరంగా మారింది.

నటీనటుల విషయానికి వస్తే… రెజీనా కసాండ్ర గత కొంతకాలంగా రొటీన్ కు భిన్నమైన పాత్రలు చేస్తోంది. అందువల్ల ఆమె ఈ స్క్రిప్ట్ కు ఓకే చెప్పిందని అనుకోవచ్చు. కానీ ఆ పాత్ర తీరుతెన్నులు ఏమంత గొప్పగా లేవు. ఇక గుంటూరుకు చెందిన నివేదిత సతీశ్ చెన్నయ్ లో స్థిరపడి తమిళ చిత్రాల ద్వారా కాస్తంత గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే వచ్చిన ‘సుడల్’ వెబ్ సీరిస్ లో కాస్తంత ప్రాధాన్యమున్న పాత్రే చేసింది. ఓ రకంగా ఆమెకు తెలుగులో ఇదే బిగ్ బ్రేక్ అని చెప్పాలి. ఈ కథ మొత్తం ఆమె చుట్టూనే సాగుతుంది. దానికి తగ్గట్టుగా నివేదిత హార్డ్ వర్క్ కూడా చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇతర ప్రధాన పాత్రలను ప్రమోదిని పమ్మి, సమీర్ మల్లా, దర్శ్‌, శ్రీతేజ ప్రసాద్, లావణ్య, అనూజ్ గురువర, డా. సాయి కామాక్షి భాస్కరాల, తన్మయి బోల్ట్, శ్రుతి నోరి, మిర్చి హేమంత్, ఫాల్గుణి తదితరులు పోషించారు. టెక్నికల్ టీమ్ పడిన కష్టం తెర మీద కనిపిస్తోంది. అరోల్ కొరెల్లీ సంగీతం, గౌతమ్ నాయర్ సౌండ్ డిజైనింగ్ ఆసమ్! విజయ్ కె చక్రవర్తి సినిమాటోగ్రఫీ కూడా ఓకే. బట్ సౌమ్య శర్మ రాసుకున్న కథేమిటో, కథనం ఇంత దారుణంగా ఎందుకుందో అర్థం కాలేదు. బహుశా ఆ కన్ఫ్యూజన్ కారణంగానే పల్లవి గంగిరెడ్డి ఈ వెబ్ సీరిస్ ను ఈ రకంగా డైరెక్ట్ చేశారేమో. నిజానికి మూడున్నర గంటల నిడివి ఉన్నఈ ఏడు ఎపిసోడ్స్ లో రచయిత్రి, దర్శకురాలు తాము చెప్పదల్చుకున్న మొత్తం కథ చెప్పేసి ఉంటే బాగుండేది.

రేటింగ్: 2.25 / 5

ప్లస్ పాయింట్స్
హారర్ జోనర్ కావడం
ఆర్కా మీడియా నిర్మించడం
కెమెరా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్

మైనెస్ పాయింట్స్
తలా తోక లేని కథ, కథనం
నత్తనడకలా సాగే సన్నివేశాలు
అర్థాంతరమైన ముగింపు

ట్యాగ్ లైన్: బోరింగ్ ట్యుటోరియల్!

Show comments