ఆ మధ్య ‘నవరస’ ఆంథాలజీలో నటించిన ప్రముఖ కథానాయిక అంజలి ఇప్పుడు వెబ్ సీరిస్‌లపై దృష్టి పెట్టింది. ఆమె నటించిన లేటెస్ట్ వెబ్ సీరిస్ ‘ఝాన్సీ’ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ నటుడు కృష్ణ కుల శేఖరన్, కె. ఎస్. మధుబాల సంయుక్తంగా ప్రొడ్యూస్ ఈ వెబ్ సీరిస్ ను తిరు డైరెక్ట్ చేశాడు. ఫస్ట్ సీజన్ కు సంబంధించిన ఆరు ఎపిసోడ్స్ వ్యూవర్స్ కు అందుబాటులో ఉన్నాయి.
సంకేత్ (ఆదర్శ్ బాలకృష్ణ), సాక్షి (సంయుక్త హర్నాద్) భార్యాభర్తలు. వాళ్లకు మేహ అనే చిన్న పాప ఉంటుంది. పోలీస్ ఇన్ స్పెక్టర్ అయిన స్వాతి ఉద్యోగరీత్యా కూతురును సరిగా చూసుకోవడం లేదనే కోపంతో ఆమెను సంకేత్ దూరంగా పెట్టేస్తాడు. కూతురుతో కలిసి ఓ సారి కేరళకు పిక్నిక్ కు వెళ్ళినప్పుడు నదిలో పడిన మేహ ను అక్కడే ఉన్న ఝాన్సీ (అంజలి) రక్షిస్తుంది. అప్పటికే తన గతం మర్చిపోయిన ఝాన్సీని సంకేత్ తనతో పాటు హైదరాబాద్ తీసుకొస్తాడు. అలా ఐదేళ్ళు గడిచిపోతాయి. సంకేత్, అంజలి లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటారు. తనను పెళ్ళి చేసుకోమని చెప్పిన ప్రతిసారి ఝాన్సీ అతన్ని వారిస్తూ ఉంటుంది. గతం తాలుకు జ్ఞాపకాలు ఆమెకు పీడకల రూపంలో వెంటాడుతంటాయి. తన కలలో కనిపించిన వ్యక్తులు నిజ జీవితంలో తారస పడినప్పుడు, ఆమెకు గతంలో జరిగిన సంఘటనలు లీలగా గుర్తొస్తుంటాయి. సంకేత్ సహకారంతో బొటిక్ నిర్వహిస్తున్న ఝాన్సీ తనలో ఓ హిడెన్ పవర్ ఉందని గ్రహిస్తుంది. తన కళ్ళ ముందు చిన్న పిల్లలకు, మహిళలకు ఏదైనా ఆపద జరిగితే తనకు తెలియకుండానే వైల్డ్ గా రియాక్ట్ అవుతుంటుంది. ఆ రకంగా రెండు మూడు హత్యలూ చేసేస్తుంది. అవన్నీ నగరంలో సంచలనం సృష్టిస్తుంటాయి. వీటిని సాక్షినే ఇన్వెస్ట్ గేట్ చేస్తుంటుంది. ఇదే సమయంలో విదేశాలలో నేర సామ్రాజ్యాన్ని శాసించే కాలిబ్ (రాజ్ అర్జున్)పై హత్యాయత్నం జరిగినప్పుడు బార్బీ (చాందినీ చౌదరి) అతన్ని రక్షిస్తుంది. చిత్రం ఏమంటే… బార్బీ కూడా ఝాన్సీ కలలో అప్పుడప్పుడూ తళుక్కున మెరుస్తూ ఉంటుంది. గతాన్ని మర్చిపోయిన ఝాన్సీ పక్కనే ఆమెకు తెలియకుండా కాలిబ్ శత్రువులు కొందరు మెసులుతుంటారు. పదేళ్ల వయసులో ఇంటి నుండి బయలు దేరిన ఝాన్సీ ఉరఫ్ మహిత జీవితం గడిచిన ఇరవై ఏళ్ళలో ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ వెబ్ సీరిస్. ఓ ఒంటరి అమ్మాయి ఈ సమాజంలో ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేసింది, ఎలా వాటిని ఎదుర్కొంది అనేది ఇందులో చూపించారు.
అంజలికి యాక్షన్ మూవీస్ చేయడం కొత్తకాదు. ఈ మధ్య కాలంలో అలాంటి పాత్రలకు ఆమె ప్రాధాన్యమిస్తోంది. ఇది కూడా అలాంటిదే. అయితే యాక్షన్ పార్ట్ తో పాటు ఊహకందని మలుపులు, మెలికలు ఇందులో చాలానే ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ అరగంట పాటే ఉండటం ఓ రకంగా మంచిదయ్యింది. అయితే రిపీట్ సీన్స్ కొంత బోర్ కొట్టిస్తాయి. మొదటి రెండు ఎపిసోడ్స్ స్లో గా సాగినా… అక్కడ నుండి కథ వేగంగా సాగింది. ఒక్కో పాత్రతో అంజలికి ఉన్న సంబంధాన్ని ఆసక్తికరంగా దర్శకుడు రివీల్ చేసుకుంటూ వెళ్ళాడు. ఎక్కువ భాగం రాత్రి పూట జరిగినా… అరవింద్ తన విజువల్స్ తో ఆకట్టుకున్నాడు. ఝాన్సీ కథను బేస్ చేసుకుని సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను చూపించడం బాగుంది. యాసిడ్ దాడికి గురైన కృతి (శరణ్య రామచంద్రన్) ఎపిసోడ్, దానిని ఝాన్సీతో లింక్ చేసిన విధానం చక్కగా ఉంది. ఈ వెబ్ సీరిస్ ను ఆసక్తికరంగా మలిచిన దర్శకుడు తిరు, రచయిత గణేశ్ కార్తిక్, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాలను అభినందించాలి. బట్ శ్రీచరణ్ నేపథ్య సంగీతం మాత్రం ఆశించిన స్థాయిలో ఎందుకో లేదు!
నటీనటుల విషయానికి వస్తే… అంజలికి ఈ తరహా పాత్రలు చేయడం కొట్టిన పిండే! చాలా క్లాజువల్ గా నటించేసింది. ఆదర్శ్ బాలకృష్ణ పాత్రను మలిచిన తీరు బాగుంది. అతనూ హుందాగా నటించాడు. చాందినీ చౌదరిదీ ఇందులో కీలక పాత్రే అయినా… ఆమెకు ఈ సీజన్ లో స్క్రీన్ స్పేస్ తక్కువ ఇచ్చారు. సాక్షి పాత్ర పోషించిన సంయుక్త హర్నాద్ కు తెలంగాణ యాస పెట్టడం అంతగా నప్పలేదు. ఇక ఈ సీరిస్ లో పెద్దంతగా ఉపయోగించుకోని పాత్ర ఏదైనా ఉందంటే అది ముమైత్ ఖాన్ ది. ఆమె పాత్రను ఇంకాస్తంత బెటర్ గా తీసి ఉండొచ్చు. ఆమెను టేకిట్ ఇట్ గ్రాంట్ గా తీసుకున్నారనిపిస్తుంది. ‘సీతామాలక్ష్మీ’తో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకున్న తాళ్ళూరి రామేశ్వరి ఇప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇందులోనూ ముస్లీం మహిళగా నటించారు. అయితే ఆమె పాత్రకు సంబంధించిన సీక్రెట్స్ ఇంకా రివీల్ కావాల్సి ఉంది. ఇతర ప్రధాన పాత్రలను ప్రదీప్ రుద్ర, దేవయాని శర్మ, అన్నంగి రాజశేఖర్, శరత్ బాబు కాకరాల, అభిరామ్ వర్మ, కళ్యాణ్, చైతన్య సింగరాజు తదితరులు పోషించారు. ప్రొడక్షన్ వాల్యూస్ గొప్పలేకపోయినా… కథనం ఆకట్టుకునేలా ఉంటడంతో ఒక ఎపిసోడ్ తర్వాత మరో ఎపిసోడ్ ను చూడాలనే కుతూహలమైతే కలుగుతుంది. మరీ ఎక్కువ ల్యాగ్ చేయకుండా… సీజన్ 2ను కూడా స్ట్రీమింగ్ చేసేస్తే బెటర్.
రేటింగ్ : 2.75 /5
ప్లస్ పాయింట్స్:
అంజలి యాక్టింగ్
ఆకట్టుకునే స్క్రీన్ ప్లే
అరవింద్ సినిమాటోగ్రఫీ
మైనెస్ పాయింట్స్:
సీన్స్ రిపీట్ కావడం
కాస్టింగ్ సరిగా లేకపోవడం
నిరాశ పర్చే ముమైత్ పాత్ర
ట్యాగ్ లైన్: ట్విస్ట్స్ అండ్ టర్న్స్