Tantra Movie Review: ఈ మధ్యకాలంలో హారర్ సినిమాలకు తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఎక్కువగా హారర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ సహా రక్తం అమ్ముతూ ప్రమోషనల్ కంటెంట్ తో పాటు మా సినిమాకు పిల్ల బచ్చాలు రావొద్దు అంటూ ఒక్క సారిగా ప్రేక్షకుల అటెన్షన్ డ్రా చేసిన ఈ తంత్ర సినిమా ఎలా ఉంది? ట్రైలర్ తో భయపెట్టిన తంత్ర సినిమా నిజంగానే థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను భయపెట్టిందా ? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
తంత్ర కథ:
ఒక పల్లెటూరిలో తన తండ్రి నానమ్మతో కలిసి జీవిస్తూ ఉంటుంది రేఖ (అనన్య). తన స్నేహితురాలు, ఆమె సోదరుడితో కలిసి కాలేజీకి వెళ్లి వస్తూ ఉంటుంది. అదే ఊరికి చెందిన తేజు(దినేష్ రఘుముద్రి)తో ప్రేమలో పడిన రేఖ తన స్నేహితురాలు మీద ఒక క్షుద్ర ప్రయోగం జరిగిందని తెలిసి దాని నుంచి తప్పిస్తుంది. అయితే ఆమె మీద పగ పెంచుకున్న విగతి(టెంపర్ వంశీ) ఊరికి వచ్చి క్షుద్ర ప్రయోగాలతో ఆమెను చంపాలని చూస్తాడు. ఆ సమయంలో అప్పటి వరకు ఎవరికీ తెలియని కొన్ని విషయాలను తన ప్రియుడికి చెబుతుంది రేఖ. అయితే అసలు రేఖ ఎవరు? ఆమె తల్లి రాజేశ్వరి (సలోని) ఎలా చనిపోయింది? రాజేశ్వరితో క్షుద్ర ప్రయోగం చేసిన విగతి ఎందుకు రేఖ మీద పగ పెంచుకుంటాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
నిజానికి హారర్ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు చాలా ఆసక్తి. హారర్ నేపథ్యంలో వచ్చిన ఎన్నో సినిమాలను సూపర్ హిట్గా చేసిన హిస్టరీ వారిది. ఇప్పుడు ఇదే హారర్ జానర్లో తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది కొత్త కథనా? అంటే కొత్త కథ అని చెప్పలేం. ఎందుకంటే ఇలాంటి కథలు మనం గతంలో కొన్ని చూసి విని ఉన్నాం. రక్తదాహం, పాతాళకుట్టి, శత్రువు ఆగమనం, ముసుగులో మహంకాళి, వజ్రోలి రతి, ఛిన్నామస్తా దేవిa అంటూ ‘తంత్ర’ సినిమాలో ఆరు పర్వాలు ఉన్నాయి. అయితేదర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి రాతలో విషయం ఉంది. తాంత్రిక విద్యలు, క్షుద్రపూజలు నేపథ్యంలో క్యూరియాసిటీ క్రియేట్ చేసే పాయింట్ ఉన్నా సినిమా మాత్రం సీరియల్ కంటే స్లోగా సాగుతుంది. స్టోరీ లైన్ తీసుకుంటే హారర్ కథకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ దాన్ని సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విషయంలో తడబడినట్టు అనిపించింది. అయితే మా సినిమాకు పిల్ల బచ్చాలు రావొద్దు అంటూ ప్రచారం చేసుకుంది సినిమా యూనిట్. అందుకు తగ్గట్టే కొన్ని ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలు ఉన్నాయి. ఇక ‘తంత్ర’లో అనన్యకు ఆత్మలు కనిపించడం తప్ప ఇంట్రెస్టింగ్ పాయింట్ లేదు. అయితే ఇదే పాయింట్ తో గతంలో వచ్చిన కొన్ని సినిమాలతో పోలిస్తే ఈ లైన్ బాగుంది. స్క్రీన్ ప్లే విషయంలో కేర్ తీసుకుని ఫ్లాష్ బ్యాక్ బలంగా రాసుకుని ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది.
ఇక నటీనటుల విషయానికి వస్తే శ్రీహరి సోదరుడి కుమారుడు ధనుష్ రఘుముద్రి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. స్క్రీన్ స్పేస్ తో సంబంధం లేకుండా తన సత్తా చాటే అవకాశం దక్కింది. ఇక మెయిన్ లీడ్ గా తెలుగమ్మాయిగా అందరికీ దగ్గరైన అనన్య ఆత్మలతో మాట్లాడే అమ్మాయిగా, క్షుద్ర పూజలు అన్నీ తెలిసి సైలెంటుగా ప్రియుడి కోసం పరితపించే పాత్రలో అదరగొట్టేసింది. గత సినిమాలతో పోలిస్తే నటనలో ఆమె మరో మెట్టెక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో ఆమెకు నటించే స్కోప్ బాగా దొరకడంతో చెలరేగి నటించింది. ఇక ఇప్పటివరకు హీరోయిన్ గా చేసిన సలోని రోల్, ఆ సీన్స్ ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేస్తాయి కానీ ఆమె లుక్స్ ని ఫాన్స్ తట్టుకోలేరు. టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ తదితరులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నీకల్ టీం విషయానికి వస్తే సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ పాటలు, నేపథ్య సంగీతంతో సినిమాకు తన వంతు తోడ్పాటు అందించారు. కధనం మీద మరింత ఫోకస్ పెట్టాల్సింది. సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్టు ఉంది. కావాలని చేశారో ఏమో తెలియదు కానీ కొన్ని లో కలర్ ప్యాలెట్స్ వాడారు. ఇక సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్ గా : హారర్ కథలు ఇష్టపడే వారికి తంత్ర నచ్చొచ్చు..