NTV Telugu Site icon

Amigos Telugu Movie Review: అమిగోస్ రివ్యూ

Amigos

Amigos

Amigos Telugu Movie Review: రివ్యూ: అమిగోస్
రిలీజ్: 10-02-2023
నటీనటులు: కళ్యాణ్‌ రామ్, అషికా రంగనాథ్, బ్రహ్మాజీ, జయప్రకాశ్, కళ్యాణి నటరాజన్, రవిప్రకాశ్
సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్
సంగీతం: జిబ్రాన్
నిర్మాణం: మైత్రీ మూవీస్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజేంద్ర రెడ్డి

గత యేడాది ‘బింబిసార’ మూవీతో తన కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఇర మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ యేడాది ఆరంభంలోనే ‘వీర సింహారెడ్డి, వాల్తేరువీరయ్య’ చిత్రాలతో డబుల్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు కళ్యాణ్ రామ్, మైత్రీ కలయికలో రూపుదిద్దుకుంది ‘అమిగోస్’. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీలో కళ్యాణ్ రామ్ ఏకంగా మూడు పాత్రలను పోషించాడు. సో… ఫిబ్రవరి 10 శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన ట్రిపుల్ రోల్ మూవీ ‘అమిగోస్’ ఎలా ఉందో చూద్దాం…

సిదార్థ్‌ (కళ్యాణ్‌ రామ్) హైదరాబాద్ లో ఫ్యామిలీ మెంబర్స్ తో జాలీగా ఉంటుంటాడు. తన మావయ్య(బ్రహ్మాజీ)తో సరదాగా పబ్ లో గడుపుతున్న సమయంలో అతనికి డోపెల్ గ్యాంగర్ వెబ్ సైట్ గురించి తెలుస్తుంది. తనను పోలిన మనుషుల గురించి తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఆ వెబ్ సైట్ లో సెర్చ్ చేస్తాడు. అతనికి బెంగళూరు కు చెందిన మంజునాథ్‌ (కళ్యాణ్‌ రామ్), కోల్ కత్తాలో ఉండే మైఖేల్ (కళ్యాణ్‌ రామ్) టచ్ లోకి వస్తారు. వీరంతా గోవాలో కలుసుకుని ఎంజాయ్ చేయాలనుకుంటారు. అంతవరకూ బాగానే ఉంది. ఆ తర్వాత సిదార్థ్‌ కు ప్రేమ విషయంలో సాయం చేసేందుకు మిగిలిన ఇద్దరూ హైదరాబాద్‌ వస్తారు. అయితే అప్పటికే మైఖేల్ కోసం నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌.ఐ.ఎ.) వెతుకుతూ ఉంటుంది. అతనే అనుకుని తనలా ఉన్న మంజునాథ్‌ను పొరపాటున అదుపులోకి తీసుకుంటుంది ఎన్.ఐ.ఎ. అసలు మైఖేల్‌ ఎవరు? అతని గతం ఏమిటీ? అతని కోసం ఎన్.ఐ.ఎ. ఎందుకు వెదుకుతోంది? మైఖేల్ బదులు ఎన్.ఐ.ఎ. అధికారులకు చిక్కిన మంజునాథ్ గతేంటి? తనలా ఉండే వ్యక్తుల కోసం వెబ్ సైట్ లో ఆరా తీసి, సాలెగూడులో చిక్కుకున్న సిద్ధు అందులోంచి ఎలా బయట పడ్డాడు? అనేదే మిగతా కథ.

మనుషులను పోలిన మనుషులను సినిమాల్లోనే కాదు… నిజ జీవితంలోనూ చూస్తుంటాం. ఒకే వయసు ఉన్నవారు కూడా అందులో ఉంటారు. అంతమాత్రాన కవల పిల్లలలా వారి ఆలోచనలు, హావభావాలు, ఆహార వ్యవహారాలు ఒకేలా ఉండవు. ఇక వివిధ ప్రాంతాలలో నివసించే మనుషులను పోలిన మనుషుల ఆలోచనల్లోనూ ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఈ మూవీ ద్వారా దర్శకుడు రాజేంద్ర రెడ్డి అదే తెలిపాడు. లీడ్ క్యారెక్టర్ లో కనిపించే సిద్ధూకు ఫ్యామిలీ లైఫ్ జత చేస్తే, మంజునాథ్‌ బేలగా ఉండేలా డిజైన్ చేసి తన పాత్ర తీరుతెన్నులను దానికి తగ్గట్టుగా మలిచాడు. ఇక మైఖేల్ క్యారెక్టర్ నరరూప రాక్షసుడికి ఏ మాత్రం తగ్గనిది. నందమూరి వంశంలో నటులకు ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం ఏమీ కొత్తకాదు. మహానటుడు ఎన్టీయార్ ఏకంగా ఐదు పాత్రలను కూడా సమర్థవంతంగా పోషించారు. కళ్యాణ్‌ రామ్ బాబాయ్ బాలకృష్ణ ‘అధినాయకుడు’లో త్రిపాత్రాభినయంతో పాటు ఎన్నో హిట్ సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశయగా… సోదరుడు ఎన్టీయార్ సైతం ద్విపాత్రాభినయంతో పాటు ‘జై లవకుశ’లో త్రిపాత్రాభినయం చేసి మెప్పించాడు. అందుకేనేమో కళ్యాణ్‌ రామ్ కూడా ఈ ట్రిపుల్ రోల్ కథ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే కథలో ఊహకందని మలుపులు లేకపోవడంతో సినిమా థ్రిలింగ్ ఎక్స్ పీరియన్స్ ను ఇవ్వలేకపోయింది. ఫ్రెండ్ షిప్ మీద సాగిన గోవా సాంగ్ ఓకె. బాలకృష్ణ రీమిక్స్ సాంగ్‌ ‘ఎన్నో రాత్రులు వస్తాయి కానీ…’ పాట పిక్చరైజేషన్‌ కలర్ ఫుల్ గా సాగింది. హీరోతో మూడు పాత్రలు చేయించాలని దర్శకుడు భావించినప్పుడు మరింత బలమైన కథను సిద్ధం చేసుకుని, ఆసక్తికరమైన సన్నివేశాలను రాసుకుని ఉండాల్సింది. అయితే… డోపెల్ గ్యాంగర్‌ వెబ్ సైట్… దాని ద్వారా లుక్ ఏ లైక్ వ్యక్తులను కలుసుకోవచ్చుననే అంశం ఆసక్తికరమైనదే!

నటీనటుల విషయానికి వస్తే… నెగెటివ్‌ షేడ్ ఉన్న పాత్రలను పోషించడం హీరో కళ్యాణ్‌రామ్ కు కొత్తేమీ కాదు. గతంలో తన సొంత బ్యానర్ లోనే అలాంటి చిత్రాలను నిర్మించి, నటించాడు కూడా. మొన్న వచ్చిన ‘హే రామ్’ తో పాటు ఇటీవల తీసిన ‘బింబిసార’లోనూ దాదాపు అదే తరహా పాత్రలను పోషించాడు. ఇప్పుడు ఈ సినిమాలో మూడు భిన్నమైన మనస్తత్త్వాలు కల పాత్రలను సునాయాసంగా చేసేశాడు. హీరోయిన్ ఆషికా రంగనాథ్‌ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. తనకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కళ్యాణ్‌ రామ్ మామగా బ్రహ్మాజీ పంచ్ డైలాగ్స్ తో వినోదాన్ని పంచాడు. మిగిలిన పాత్రధారులందరూ తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. జిబ్రాన్‌ నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ ఈ మూవీకి మెయిన్ ఎసెట్. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా థ్రిల్లింగ్ గా ఉంది. అయితే కథలో తగిన దమ్ములేకపోవడం, కథనం ఆసక్తిని కలిగించకపోవడంతో సాధారణ ప్రేక్షకులను ‘అమిగోస్‌’ ఊహించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. యాక్షన్ మూవీ లవర్స్ కు, నందమూరి ఫ్యాన్స్ మాత్రం సంతృప్తి చెందే అవకాశం ఉంది.

రేటింగ్: 2.75 / 5

ప్లస్‌ పాయింట్స్

కళ్యాణ్‌ రామ్ త్రిపాత్రాభినయం

జిబ్రాన్ రీరికార్డింగ్

యాక్షన్ సీక్వెన్స్

ప్రొడక్షన్ వాల్యూస్

మైనెస్ పాయింట్స్

బలహీనమైన కథ

ఆసక్తికలిగించని కథనం

ట్యాగ్ లైన్: డోపెల్ గ్యాంగర్!