నాగార్జున హీరోగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలలో నటించిన తాజా చిత్రం నా సామి రంగ. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడుగా పరిచయమయ్యాడు. ఇప్పటికే యూటర్న్, స్కంద, ది వారియర్ లాంటి సినిమాలు నిర్మించిన శ్రీనివాస చిత్తూరు ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద నిర్మించారు. ఆషిక రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ దిల్లాన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మూడు నెలల్లో పూర్తి చేయడం, రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ అంతా సినిమా మీద అంచనాలు పెంచేలా ఉండడంతో సాధారణంగా అందరి ఆసక్తి సినిమా మీద ఏర్పడింది. దానికి తోడు మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాకి రీమేక్ కూడా కావడంతో ఎందుకో ఈ సినిమా బాగుంటుందని అందరూ భావించారు. దానికి తోడు పండుగ బ్యాక్ డ్రాప్ కూడా కావడంతో సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎట్టకేలకు జనవరి 14వ తేదీన సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
నా సామి రంగా కథ:
ఈ సినిమా అంతా 80లలో జరుగుతూ ఉంటుంది. గోదావరి జిల్లా అంబాజీపేటలో కిష్టయ్య(నాగార్జున), అంజి(అల్లరి నరేష్) ఒక తల్లికి పుట్టక పోయినా ఇద్దరూ సొంత అన్నదమ్ములేమో అనిపించేంత అన్యోన్యంగా పెరుగుతారు. చిన్నప్పుడే తల్లిని కోల్పోవడంతో కిష్టయ్య అంజికి అన్నీ తానే అయి పెంచుతాడు. ఆ ఊరి పెద్ద నాజర్ వద్ద పనిచేస్తూ అదే ఊరిలో వడ్డీ వ్యాపారం చేసే వరదరాజులు కూతురు వరాలు(ఆషిక)తో కిష్టయ్య ప్రేమలో పడతాడు. పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో అది ఇష్టం లేని వరదరాజులు ఆత్మహత్య చేసుకోవడంతో వరాలు పెళ్లి జీవితానికి దూరమైపోతుంది. నిజానికి వరాలును పెద్దయ్య మూడో కొడుకు దాసు(డాన్సింగ్ రోజ్)కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటరు. కానీ వరాలు అందుకు ఒప్పుకోదు. తండ్రి చనిపోయాక పూర్తిగా ఒంటరిగా బతుకు ఈడుస్తూ ఉంటుంది. అదే సమయంలో పక్క ఊరి ప్రెసిడెంట్ కూతురి(రుక్సార్)తో ప్రేమలో పడిన భాస్కర్(రాజ్ తరుణ్) మీద హత్యాయత్నం జరగడంతో పెద్దయ్య ఆజ్ఞ మేరకు అతన్ని కాపాడే బాధ్యత అంజికి అప్పచెబుతాడు కిష్టయ్య. ఇక దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన దాసు తన పెళ్లికి అడ్డుపడిన కిష్టయ్యను అంత మొందించాలని అనుకుంటాడు.. అందుకు పక్క ఊరి ప్రెసిడెంట్(మధుసూదన్ రావు) కూడా చేతులు కలుపుతాడు. ఈ క్రమంలో కిష్టయ్యను దాసు ఏం చేశాడు? కొడుకు తన నమ్మిన బంటును చంపుతున్నాడని తెలిసి పెద్దయ్య ఏం చేశాడు? చివరికి కిష్టయ్య వరాలును పెళ్లి చేసుకున్నాడా? భాస్కర్ కి పక్క ఊరి ప్రెసిడెంట్ కుమార్తెకు వివాహం జరిగిందా లేదా అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
నిజానికి ఈ సినిమా కథ కొత్తది ఏమీ కాదు. గతంలో మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన పోరింజు మరియం జోస్ అనే సినిమాని తెలుగులో నా సామిరంగా అనే పేరుతో తెరకెక్కించారు. పేరు మార్చడమే కాదు తెలుగు నేటివిటీకి తగినట్లు చాలా మార్పులు చేర్పులు చేసినట్లు ఒరిజినల్ చూసినవారు ఇట్టే అర్థం చేసుకుంటారు. నిజానికి కేరళ సంస్కృతికి మన సంస్కృతికి చాలా తేడా ఉంటుంది. ఆ సంస్కృతి బ్యాక్ డ్రాప్ మార్చడమే కాదు చాలావరకు తెలుగు వారికి కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించడంలో దర్శకుడు విజయ్ సఫలమయ్యాడు. నిజానికి గతంలో ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేసిన విజయ్ కి ఇది డైరెక్టర్గా మొదటి సినిమా. అయినా సరే కొత్త దర్శకుడు అనే భావన లేకుండా సినిమా మొత్తాన్ని నడిపించే ప్రయత్నం చేసి దాదాపు సఫలమయ్యాడు. నిజానికి ఈ సినిమా స్క్రీన్ ప్లే లీనియర్ కాదు, నడుస్తూ ఉండగానే గతంలోకి తీసుకువెళ్లడం మళ్ళీ గతంలో నుంచి వర్తమానంలోకి తీసుకురావడంతో కొంత కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. కానీ దాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు అనిపించింది. ముఖ్యంగా డైలాగ్స్ విషయంలో కేర్ తీసుకున్నారు. అయితే గోదావరి జిల్లాలలో కథ నడిపిస్తున్నారు కాబట్టి పూర్తిగా గోదావరి జిల్లాల యాస ఫాలో అయితే మరింత నేటివిటీ వర్కోడై ఉండేది. ఆ యాస కోసం చాలా ప్రయత్నాలు చేసినట్టు అనిపించింది కానీ పూర్తిస్థాయిలో మాత్రం సఫలం కాలేదు. నాగార్జున లుక్ సహా ఆయన క్యారెక్టర్ కూడా కొత్తగా అనిపించింది.. ఊరి పెద్ద మాట కోసం ఏమైనా చేసేందుకు సిద్ధమయ్యే వ్యక్తి అదే ఊరి పెద్ద చేతిలో కత్తిపోట్లు పొడిపించుకోవాల్సి వస్తే ఎలాంటి ఎమోషన్ కి లోనవుతాడు? లాంటి విషయాన్ని చాలా కేర్ఫుల్ గా డీల్ చేసినట్లు అనిపించింది. ఒరిజినల్ కి ఈ సినిమాకి ఉన్న మార్పులు తెలుగు వారికి నచ్చేలా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. సినిమా మొత్తానికి ఎమోషన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. అయితే వాటిని మరింత డెప్త్ గా తీసుకువెళ్లే అవకాశం ఉంది కానీ ఎందుకో పూర్తిస్థాయిలో దాన్ని వాడుకోలేకపోయారని అనిపించింది. మూడు జంటలు వారి మధ్య ప్రేమను కూడా పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు.. మూడు జంటలు ప్రేమలో పడతారు కానీ వారి మధ్య ప్రేమను ఎస్టాబ్లిష్ చేసి ఉంటే మరింత బాగుండేది. అయితే ప్రతి ఫ్రేమ్ లోనూ నిండుగా పండుగ వాతావరణం సృష్టించడంలో మాత్రం మేకర్స్ పూర్తిస్థాయిలో సఫలమయ్యారు. పండుగకి పండుగ సినిమాతో వచ్చి హిట్టు కొడుతున్నాం అని చెబుతూనే పండుగ లాంటి సినిమా తీసుకురావడంలో మేకరస్ కృషి అభినందనీయం.
ఈ సినిమాలోని ముందుగా నటీనటుల విషయానికి వస్తే నాగార్జున సినిమా మొత్తాన్ని తన భుజస్కందాల మీద నడిపే ప్రయత్నం చేశాడు. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో కొత్త నాగార్జున కనిపించినట్టు అనిపించింది. ముఖ్యంగా లుక్కు మాత్రమే కాదు డ్రెస్సింగ్ తో పాటుగా ఆయన మేనరిజం విషయంలో కూడా ఈ సినిమాలో పూర్తి భిన్నంగా కనిపించారు. తనకంటే చిన్నవాళ్ళైనా సరే అల్లరి నరేష్ రాజ్ తరుణ్ వంటి వారితో మ్యాజిక్ చేశాడు. సినిమా మొత్తానికి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా అంజి అనే పాత్రలో అల్లరి నరేష్ ఒదిగిపోయాడు. నిజానికి ఇలాంటి పాత్రలు మన వాడికి కొత్త కాదు కానీ ఈ సినిమాలో కూడా అనుభవంతో ఆడేసుకున్నడు. రాజ్ తరుణ్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఉన్నంతలో తన పాత్రకు న్యాయం చేశాడు. ఆషిక ఒకపక్క గ్లామర్ వలకబోస్తూనే మరొకపక్క నటనతో కూడా ఆకట్టుకుంది. మిర్న, రుక్సార్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.. విలన్ గా డాన్సింగ్ రోజ్ ఒక రేంజ్ లో నటించాడు. నాజర్, మధుసూదన్ రావు, రావు రమేష్, రవి ప్రకాష్, భరత్, మధుమతి వంటి వారందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గురించి. సినిమాని వేరే లెవల్ కి తీసుకు వెళ్లడంలో ఆయన అందించిన పాటలు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ బాగా పనిచేశాయి. కొన్ని పాటలు వినడానికి మాత్రమే కాదు స్క్రీన్ మీద కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది పండుగ వాతావరణాన్ని సృష్టించడంలో కెమెరామెన్ కూడా తన పనితనాన్ని చూపించాడు. 80 ల కాలంలో ఇళ్లు సహా ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ ని వదలకుండా అన్నింటినీ సృష్టించిన ప్రొడక్షన్ డిజైనర్ ఓపికకి హాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎక్కడైనా చిన్న పొరపాటు దొరుకుతుందేమోనని చూస్తే ఏమీ లేకుండా చాలా పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు.. ఇక నిర్మాణం విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా బాగున్నాయి.
టాగ్ లైన్: సంక్రాంతి పండుగకి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంట్టైనర్.