NTV Telugu Site icon

Acharya Movie Review : అయ్యో.. ఆచార్య‌!

Acharya

Acharya

తారాగ‌ణం: చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్, పూజా హెగ్డే, సోనూ సూద్, జిష్షూ సేన్ గుప్త‌, సౌర‌వ్ లోకేశ్, అజ‌య్, కిశోర్, త‌నికెళ్ళ భ‌ర‌ణి, రఘుబాబు, ‘వెన్నెల’ కిశోర్, నాజ‌ర్, బెన‌ర్జీ, శత్రు, రాజా రవీంద్ర, సత్యదేవ్, సంగీత‌, ప్రభు, రెజీనా కాసాండ్రా
సినిమాటోగ్ర‌ఫి: తిరు
సంగీతం: మ‌ణి శ‌ర్మ‌
నిర్మాత‌లు : నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
స‌మ‌ర్ప‌ణ‌: సురేఖ కొణిదెల‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: కొర‌టాల శివ‌

‘సైరా… న‌ర‌సింహారెడ్డి’ త‌రువాత మెగాస్టార్ చిరంజీవి న‌టించిన చిత్రం కావ‌డం, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలిసారి తండ్రితో పూర్తి స్థాయిలో న‌టించిన సినిమా అవ్వ‌డం, ఇక వ‌రుస విజ‌యాల మీదున్న ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తెర‌కెక్కించిన మూవీ కావ‌డంతో `ఆచార్య‌`కు తొలినుంచీ అభిమానుల్లో ఓ స్పెష‌ల్ క్రేజ్ నెల‌కొంది. ఒక‌ప్పుడు చిరంజీవితో వ‌రుస విజ‌యాలు చూసిన సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ చాలా రోజుల త‌రువాత ఈ సినిమాతో మ‌ళ్ళీ చిరు సినిమాకు ప‌నిచెయ్య‌డం, ఆయ‌న స్వ‌ర‌క‌ల్ప‌న‌లో రూపొందిన పాట‌లు అల‌రిస్తూ ఉండ‌డం కూడా `ఆచార్య‌`పై అంద‌రిలో ఆస‌క్తి క‌లిగేలా చేసింది. శుక్రవారం జనం ముందుకు వచ్చిన ‘ఆచార్య’ ఎలా ఉందో తెలుసుకుందాం.

ఇక ‘ఆచార్య‌’ క‌థ విష‌యానికి వ‌స్తే – సిద్ధవనానికి ఓ పక్క పాదఘట్టం, మరో పక్క ధర్మస్థలి ఉంటాయి. మధ్యలో జీవనది పారుతూ ఉంటుంది. పాద‌ఘ‌ట్టం ప్ర‌జ‌లు ప్ర‌కృతి మాత ఒడిలో తరతరాలుగా జీవిస్తుంటారు. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన పాదఘట్టంకు ఇటు పక్కన ఉన్న ధర్మస్థలిలోని ఘట్టమ్మ దేవత అండగా ఉంటుందని వారంత నమ్ముతుంటారు. వన మూలికలతో వైద్యం చేస్తూ అక్కడే జీవనాన్ని సాగిస్తుంటారు. అయితే సిద్ధవనంలోని ఖనిజాల మీద కార్పొరేట్ అధినేత రాథోడ్ (జిష్షూ సేన్ గుప్త‌) కన్ను పడుతుంది. ధ‌ర్మ‌స్థ‌లిలో ఉన్న బ‌స‌వ (సోనూ సూద్) సాయంతో ఆ ప్రాంతాన్ని తన కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. దాంతో బసవ త‌న అనుచ‌రుల‌తో ధర్మస్థలిలో అకృత్యాలు చేస్తూ జ‌నాన్ని వ‌ణికిస్తుంటాడు. పాద‌ఘ‌ట్టం ప్ర‌జ‌లను ధర్మస్థలికి దూరం పెట్టే ప్రయత్నాలు చేస్తాడు. ఆ స‌మ‌యంలో ఆచార్య (చిరంజీవి) వ‌చ్చి, ధ‌ర్మ‌స్థ‌లి, పాద‌ఘ‌ట్టం జ‌నానికి అండ‌గా నిలుస్తాడు. త‌మ‌ను ర‌క్షిస్తున్న ఆచార్య ఎక్క‌డివాడు, ఎందుకు త‌మ ద‌గ్గ‌ర‌కే వ‌చ్చాడు అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంగా త‌నకు సిద్ధా (రామ్ చ‌ర‌ణ్)తో ఉన్న అనుబంధం గురించి చెబుతాడు. సిద్ధా పాద‌ఘ‌ట్టంకు చెందినవాడు. త‌న చుట్టూ ఉన్న‌వారిని అభిమానించి, వారి కోసం ఏదైనా చేసే వ్య‌క్తి. అలాంటి వ్య‌క్తితో త‌న‌కు ఎలా ప‌రిచ‌యం అయింది, పాదఘట్టం వదిలిన తర్వాత అతను ఏమ‌య్యాడు అన్న వివ‌రాల‌ను ఆచార్య ఫ్లాష్ బ్యాక్ లో చెబుతాడు. సిద్థా కోరిక మేరకు పాదఘట్టానికి, ధర్మస్థలికి పట్టిన పీడను ఆచార్య ఎలా తొలగించాడన్నదే మిగతా కథ.

ఇంత‌కు ముందు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ రూపొందించిన నాలుగు చిత్రాల‌ను ప‌రిశీలిస్తే, ప్ర‌తి చిత్రంలోనూ ఒక‌రు వ‌ద‌లివేసిన ‘మిష‌న్’ను హీరో వ‌చ్చి టేక‌ప్ చేయ‌డం అన్న‌ది ప్ర‌ధానంగా క‌నిపిస్తుంది. ఇందులోనూ అదే రీతిన సాగారు కొర‌టాల శివ‌. సిద్థా కోరికను ఆచార్య పాత్ర ద్వారా తీర్చినట్టు చూపించారు. అయితే…. కాషాయానికి కమ్యూనిజానికి లింక్ చేయడంలో కొరటాల తడబడ్డాడు. మతం, ధర్మం వంటి పదాలను పలకడానికే ఇష్టపడని నక్సలైట్స్ తో ధర్మ రక్షణ చేయించే ప్రయత్నం చేశాడు కొరటాల. అడవిలోని సంపదను కొల్లకొడుతున్న కార్పొరేట్ శక్తుల పని పట్టడానికి నక్సలైట్లు వచ్చారన్నా ఓ రకంగా జనం అర్థం చేసుకునే వాళ్ళేమో! కానీ సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ ధర్మ రక్షణలోనే ఆచార్య మునిగి తేలుతుంటాడు. అది ఓ నక్సలైట్ కొడుకైన సిద్ధా కోరిక అని చెప్పినా… ఎందుకో అంత కన్వెన్సింగ్ గా అనిపించదు. సిద్ధా ఎవరు? అతను ధర్మస్థలి కోసం ఏం చేశాడు అనే పాయింట్ రివీల్ కానంత వరకూ సినిమా ఆసక్తిగానే సాగింది. కానీ ఒక్కసారి సిద్ధా ఎంటర్ అయిన తర్వాత ఆ టెంపో ఎక్కువ సేపు నిలవలేదు. దాంతో ద్వితీయార్థం పేలవంగా మారిపోయింది. పాటలు విడిగా వినడానికి, వీడియోలలో చూడటానికి బాగానే ఉన్నా కథలో అవి సరిగా ఇమడలేదు. సెకండ్ హాఫ్ లో చిరంజీవి, చరణ్ మీద మైనింగ్ లో తీసిన యాక్షన్ కామెడీ సన్నివేశం ఏ మాత్రం ఆకట్టుకోలేదు. మహేశ్ బాబు వాయిస్ ఓవర్ తో మూవీకి చక్కని టేకాఫ్ ఏర్పడింది. విడుదలకు ముందే దర్శకుడు చెప్పినట్టు కాజల్ పాత్రను సినిమా నుండి తొలగించారు. సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టు అనుష్క గెస్ట్ అప్పీయరెన్స్ ఏమీ ఇవ్వలేదు.

నటీనటుల విషయానికి వస్తే, ఆచార్య పాత్ర‌లో చిరంజీవి ఒదిగిపోయారు. ఇలాంటి పాత్ర‌లు ఆయ‌న‌కు కొట్టిన పిండి అనే చెప్పాలి. ఇక ప్ర‌త్యేకంగా చెప్పుకోవ‌ల‌సింది సిద్ధా పాత్ర‌లో న‌టించిన రామ్ చ‌ర‌ణ్ గురించి. ఇంత‌కు ముందు `ట్రిపుల్ ఆర్`లో సీతారామ‌రాజు పాత్ర‌లో అల‌రించిన రామ్ చ‌ర‌ణ్ ఇందులో మ‌రో వైవిధ్య‌మైన పాత్ర‌ను చ‌క్క‌గా అభిన‌యించారు. పూజా హెగ్డే త‌న ప‌రిధి మేర‌కు న‌టించారు. ప్రతినాయకుడిగా సోనూసూద్ ఆకట్టుకున్నాడు. కానీ ఇవాళ అతనికి పబ్లిక్ లో ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఇలాంటి నెగెటివ్ పాత్రలను కొంతకాలం పోషించకపోతే బెటర్. ఈ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ తిరు సినిమాటోగ్ర‌ఫి, మణిశర్మ నేపథ్యం సంగీతం అనే చెప్పాలి. క‌థ‌కు త‌గ్గ మూడ్ ను క్రియేట్ చేసే లైటింగ్ ను ఆద్యంత‌మూ అనుసరించి, చూప‌రుల‌ను తిరు క‌ట్టి ప‌డేశాడు. మ‌ణిశ‌ర్మ బాణీల్లో రూపొందిన “లాహే లాహే లాహే…“ పాట అందంగా తెర‌కెక్కింది. “నీలాంబ‌రి…నీలాంబ‌రి…“ పాట క‌నువిందు చేస్తుంది. `ఆచార్య‌…` టైటిల్ సాంగ్, “శానా క‌ష్టం…“ ఐట‌మ్ సాంగ్ ఫర్వాలేదని పిస్తాయి. అలానే ఆర్ట్ డైరెక్టర్ సురేశ్ సెల్వరాజన్ టీమ్ చక్కటి ప్రతిభ కనబరిచింది.కొర‌టాల శివ ఇంత‌కు ముందు రూపొందించిన నాలుగు చిత్రాల‌లోనూ క‌థ ఓ పాయింట్ నుండి మంచి ఊపుగా సాగుతుంది. ఆ విష‌యంలో ఈ సారి ఎందుక‌నో కొర‌టాల శివ మునుప‌టి వేగం చూపించ‌లేక‌పోయారు. నిర్మాత‌లు నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి చిత్ర నిర్మాణంలో ఎక్క‌డా రాజీపడలేదు. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి కనిపించిన సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకునేవే అయినా… యాక్షన్ తప్పితే, ఎమోషనల్ బాండింగ్ ఆ పాత్రల మధ్య లేకపోవడం ఈ చిత్రానికి పెద్ద మైనస్!!

ప్ల‌స్ పాయింట్స్:
చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ క‌ల‌సి న‌టించ‌డం
తిరు కెమెరా ప‌నిత‌నం
మ‌ణిశ‌ర్మ బాణీలు

మైన‌స్ పాయింట్స్:
బ‌ల‌హీన‌మైన క‌థ‌, క‌థ‌నం
మిస్స‌యిన ఎంట‌ర్ టైన్ మెంట్
కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం

రేటింగ్: 2.25/ 5

ట్యాగ్ లైన్ : అయ్యో… ఆచార్య‌!