NTV Telugu Site icon

35 Chinna Katha Kaadu Review: 35 చిన్న కథ కాదు రివ్యూ

Chinna Katha

Chinna Katha

35 Chinna Katha Kaadu Review: ఈ మధ్యకాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అనే లెక్క లేకుండా పోయింది. కంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కాబట్టి పెద్ద సంస్థలు కూడా చిన్న సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నాయి. అలా రానా సమర్పణలో 35 చిన్న కథ కాదు అనే సినిమా ఒకటి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. నిజానికి ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసే వరకు ఇలాంటి ఒక సినిమా తెరకెక్కుతుందనే విషయం కూడా చాలామందికి తెలియదు. నివేదా థామస్ ప్రధాన పాత్రలో విశ్వదేవ్ మరో కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో మోస్ట్ హపెనింగ్ యాక్టర్ ప్రియదర్శి టీచర్ పాత్రలో నటించాడు. ఇక టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా మీద బజ్ ఏర్పడింది. సృజన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి నందు డైరెక్షన్ చేశాడు. రిలీజ్ కి ముందే నాని లాంటి హీరో వచ్చి తన సరిపోదా శనివారం సినిమా అయినా మళ్లీ మళ్లీ రావచ్చు కానీ ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి కచ్చితంగా ధియేటర్లకు వెళ్లి చూడాలని చెప్పడంతో ఉన్న హైప్ ఒక్కసారిగా డబుల్ అయింది. మరి ఈ సినిమా నిజంగానే అంత బాగుందా? ప్రేక్షకులను ఈ సినిమా ఎంతలా ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

35 చిన్న కథ కాదు కథ ఏమిటంటే:
తిరుపతిలో ప్రసాద్(విశ్వదేవ్) ఒక ఆర్టీసీ కండక్టర్ గా పని చేస్తూ ఉంటాడు. వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ప్రసాద్ తన సొంత మరదలు అయిన చిన్ను(నివేదా థామస్)ని పెళ్లి చేసుకుని అరుణ్, వరుణ్ అనే ఇద్దరు పిల్లలకు తండ్రి అవుతాడు. చిన్నవాడు వరుణ్ పర్లేదు కానీ పెద్దోడు అరుణ్ చిన్నప్పటి నుంచి ఏదైనా సరే లాజికల్ గా కనెక్ట్ అయితేనే ఆ పని చేస్తూ ఉంటాడు. జీరో గురించి ఎన్నో డౌట్లు ఉండడంతో అతనికి మ్యాథ్స్ అంటేనే విరక్తి ఏర్పడుతుంది. ఎంతమంది మ్యాథ్స్ టీచర్లు వచ్చి చెప్పినా అతనికి మ్యాథ్స్ మీద ఏ మాత్రం ఇంట్రెస్ట్ కలగదు. ఆ కారణంగా మిగతా అన్ని సబ్జెక్ట్స్ లో 80 శాతానికి పైగా మార్కులు తెచ్చుకుంటూ మ్యాచ్ మాత్రం ఫెయిల్ అవుతూ ఉంటాడు. అలాంటి సమయంలో అదే స్కూల్ కి చాణక్య వర్మ(ప్రియదర్శి) మ్యాథ్స్ టీచర్గా వస్తాడు. ఫండమెంటల్స్ ని క్వశ్చన్ చేస్తున్నాడు అంటూ అరుణ్ మీద కోపం పెంచుకుంటాడు. అయితే ఒకానొక సందర్భంలో చాణక్య ఆక్సిడెంట్ కి అరుణ్ కారణమవుతాడు. దీంతో స్కూల్లో పెద్ద గొడవ అవుతుంది. అరుణ్ స్కూల్లో కొనసాగాలి అంటే అతను మ్యాథ్స్ పాస్ అవ్వాలి అనే కండిషన్ పెడతారు. ఈ నేపథ్యంలో అసలు మ్యాథ్స్ అంటే వణికిపోయే అరుణ్ మ్యాథ్స్ పాస్ అయ్యాడా? చివరికి స్కూల్లో కంటిన్యూ అయ్యాడా అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ:
ఈ సినిమా కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఏమీ కాదు. గతంలో చిన్న పిల్లలతో కొన్ని సినిమాలు ఉన్నాయి కానీ ఈ సినిమా పూర్తిగా మ్యాథ్స్ అనే భూతం చుట్టూ చిన్నపిల్లలకు ఉన్న భయం అనే ఎలిమెంట్ తో రాసుకున్నారు. నిజానికి మనలో చాలామంది చిన్నప్పుడు మ్యాథ్స్ అంటే భయపడే ఉంటారు. ఆ తర్వాత కాలంలో దాన్ని అధిగమించి ఉంటారు. దాన్ని తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు అందులో భాగంగా వచ్చే సన్నివేశాలతో నవ్వు పుట్టించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా నేర్చుకోవడానికి వయసుతో పనిలేదు అని చెబుతూనే ప్రయత్నం చేస్తే సఫలం కానిది ఏదీ లేదు అని కూడా చెప్పే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. ముఖ్యంగా తిరుపతి నేపద్యంలో రాసుకున్న ఈ కథ మరింత ఆసక్తికరంగా మలిచాడు అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. అమ్మానాన్న ఇద్దరు అబ్బాయిలు, కొడుకుని ఎలా అయినా ప్రయోజకుడిని చేయాలని కలలుగనే తండ్రి. ఇలా సాగిపోతున్న ఈ ప్రయాణంలో మాథ్స్ అనే ఒక పెనుభూతం ఎంటర్ అయితే ఆ పెనుభూతాన్ని తన తల్లి సహాయంతో ఒక కుర్రవాడు ఎలా ఎదిరించాడు అనే విషయాన్ని చాలా హృద్యంగా తెరమీద ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఇది కొత్త కథేం కాదు కానీ చిన్న కథ కూడా కాదు సినిమా చూసిన తర్వాత కూడా ఆలోచింపజేస్తూ సాగే కథ. అయితే సినిమా ఎందుకో కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది కానీ థియేటర్ ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది అనుమానమే. ఎందుకంటే సినిమా ఓటీడీకి పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది కానీ థియేటర్లో కూడా చూడదగ్గ సినిమా. కాకపోతే నివేదా థామస్, ప్రియదర్శి తప్ప స్టార్ అట్రాక్షన్ లేకపోవడం సినిమాకి కాస్త మైనస్ అయ్యే అంశం. అయితే చిన్నపిల్లల నటనతో దాన్ని మైమరిపించే ప్రయత్నం చేశారు.

నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో నివేదా థామస్ చిన్ను అనే పాత్రలో పరకాయ ప్రవేశం ఏమైనా చేసిందా అని అనుమానం కలుగక మానదు. సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని ఆమె నడిపించే ప్రయత్నం చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా భర్తతో వచ్చే ఎమోషనల్ సీన్స్ తో పాటు కొడుకులతో బిహేవ్ చేసే సీన్స్ ఆమెలో నటనను మరో మెట్టు ఎక్కించాయని చెప్పొచ్చు. ప్రియదర్శి కూడా మాథ్స్ టీచర్ పాత్రలో ఒదిగిపోయాడు. విశ్వదేవ్ ఉన్నంతలో పర్వాలేదనిపించాడు. భాగ్యరాజాకి సరైన క్యారెక్టర్ ఫర్వాలేదనిపించింది. గౌతమి క్యారెక్టర్ కూడా చిన్నదే కాకపోతే పిల్లలుగా నటించిన వాళ్లందరూ ది బెస్ట్ ఇచ్చారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా అరుణ్ క్యారెక్టర్ చేసిన కుర్రాడు అద్భుతంగా నటించాడు. టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడు కేవలం కథ- స్క్రీన్ ప్లే విషయంలోనే కాదు డైలాగ్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నట్లు అనిపించింది. స్క్రీన్ ప్లేతో పెద్దగా కష్టపడిన దాఖలాలు ఏమీ లేవు లీనియర్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను పెద్దగా కన్ఫ్యూజ్ చేయకుండానే బండి నడిపించాడు. కథ కూడా సింపుల్ గానే ఉంది పెద్దగా కాంప్లికేటెడ్ విషయం అయితే కాదు. అయితే తిరుపతి నేపథ్యంతో కథను నడిపిన తీరు కొన్ని డైలాగ్స్ మాత్రం హాట్సాఫ్ అనిపించేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ ని మార్చేసింది. ఒక నాష్టాలజీ ఫీలింగ్ తీసుకురావడానికి కారణమైంది. ఇక పాటలు ఫర్వాలేదు, నేపథ్య సంగీతం సినిమా స్థాయికి తగ్గట్టుగా సెట్ అయింది. ఎడిటింగ్ విషయంలో కొంచెం క్రిస్పీగా కట్ చేసుకుని ఉంటే బాగుండేది ఓవరాల్ గా నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టు సెట్ అయ్యాయి

ఫైనల్ గా ఈ 35 చిన్న కథ కాదు కానీ చెప్పుకోవాల్సిన కథే!!

Show comments