Site icon NTV Telugu

Graduate Voter Registration : గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదులో వైసీపీ ప్రత్యేక శ్రద్ధ

Election

Election

Graduate Voter Registration : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అప్పుడే కొత్త అంచనాలు మొదలయ్యాయా? తాజా ఈక్వేషన్లతో ప్రధాన ప్రతిపక్షం అడకత్తెరలో పడిందా? అభ్యర్థుల ఎంపికలో కీలకం కాబోతున్న సమీకరణాలేంటి? పార్టీలు ఏ విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి? లెట్స్‌ వాచ్‌..!

ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తిగా మారుతున్నాయి. అధికార వైసీపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. ఎన్నికల ప్రచారం ప్రారంభించేసింది కూడా. పెద్ద ఎత్తున ఓటర్ల నమోదు చేయించాలనేది వైసీపీ ఆలోచన. గత ఎన్నికల్లో మొత్తం లక్షా 55 వేల 993 మంది ఓటర్లు నమోదైతే.. 69 పాయింట్‌ 7 శాతమే పోలయ్యాయి. అప్పట్లో టీడీపీ మద్దతుతో బీజేపీ నేత మాధవ్‌ 5 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ దఫా ఓటర్ల సంఖ్యను కనీసం 30 శాతం పెంచాలని.. అలా పెరిగిన ఓటర్లు వైసీపీని బలపరిచేలా జాగ్రత్త పడాలని ఆదేశాలు వెళ్లాయట. ప్రైవేట్‌, ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో ఓటర్లను వెతికి పట్టుకునే పనిని ఎమ్మెల్యేలకు అప్పగించారు. ఉద్యోగులు, టీచర్ల సంఘాలతోనూ సంప్రదింపులు జరుగుతున్నాయి. దీంతో టీడీపీ సైతం పోటీకి దిగడం అనివార్యమని భావించింది. అభ్యర్థుల అంశంపై కొన్ని పేర్లు చర్చకు వచ్చాయి. ఇదే సమయంలో బీజేపీ నుంచి తిరిగిపోటీకి మాధవ్‌ సిద్ధమని ప్రకటించారు. వీళ్లకు తోడు PDF నుంచి లెఫ్ట్‌ అభ్యర్థి బరిలో ఉంటారని భావించారు. ఇంతలో ఏమైందో ఏమో.. సడెన్‌గా బీజేపీ, టీడీపీలు స్పీడ్‌ తగ్గించేశాయి. కొత్త చర్చకు ఆస్కారం కల్పించాయి.

ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో టీడీపీలో వైఖరిలో మార్పు వచ్చిందని చెబుతున్నారు. సిట్టింగ్‌ స్థానం కావడంతో బీజేపీకి లోపాయికారీగా మద్దతిచ్చే అంశంపై టీడీపీ సీరియస్‌గా వర్కవుట్ చేస్తోందనే ప్రచారం మొదలైంది. అందుకే అభ్యర్థి అంశంలో తొందరపడరాదని టీడీపీ అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవడమే మంచిదనే అభిప్రాయంలో టీడీపీ సీనియర్లు ఉన్నారట. ఇప్పటికే జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాయి. అంతర్గతంగా టీడీపీ మద్దతు కూడగడితే వర్కవుట్‌ అవుతుందనే లెక్కల్లో ఉన్నారట.

ఇక్కడ ఇంకో తిరకాసు ఉందట. బీజేపీలోనూ అభ్యర్థి విషయంలో అంతర్మథనం మొదలైందని టాక్‌. ఎమ్మెల్సీ మాధవ్‌కే మళ్లీ ఛాన్స్‌ ఇవ్వడమా లేక వైసీపీ బ్రాహ్మణ అభ్యర్థిని ప్రకటించినందున అదే సామాజికవర్గం నుంచి ఎవరి పేరైనా పరిశీలించడమా అనే చర్చ సాగుతున్నట్టు సమాచారం. అభ్యర్థి ఎవరైనా టీడీపీ, జనసేన మద్దతు కూడగట్టినా ఓటర్లు ఎంత వరకు సహకరిస్తారనేది మరో ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రైవేటీకరణ విధానాలు ఇబ్బందులు తెచ్చిపెడతాయనే ఆందోళన కమలనాథుల్లో ఉందట. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ, LIC లో పెట్టుబడుల ఉపసంహరణ, బ్యాంకుల విలీనం ప్రభావం పడుతుందని సందేహిస్తున్నారట. గత ఎన్నికల్లోనే ఈ విభాగాలకు చెందిన ఓటర్లు 20 వేల వరకు ఉన్నారని అంచనా. ఇక టీచర్లు, గ్రాడ్యుయేట్లు ఎలా స్పందిస్తారనే అనుమానాలు ఉన్నాయట. పీడీఎఫ్‌కు ఈ కేటగిరి నుంచి బలమైన మద్దతు లభించే వీలుంది.

2017లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల MLC బరిలో 30 మంది ఉండగా.. పోటీ మాత్రం ప్రధాన అభ్యర్థుల మధ్యే సాగింది. PDF న ఉంచి అజశర్మ, బీజేపీ-టీడీపీ నుంచి మాధవ్‌ పోటీ చేశారు. ఈ సారి మాత్రం వైసీపీ, పీడీఎఫ్‌ మధ్య పోటీ ఉంటుందనే చర్చ జరుగుతోంది. మరి.. మారిన అంచనాలు.. సమీకరణాలు ఎన్నికలు దగ్గర పడేకొద్దీ ఇంకెలా మారతాయో చూడాలి.

Exit mobile version